ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 5: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పంటనష్టం జరిగిన ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి కనీసం తిరగలేదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మండిపడ్డారు. వరదలతో సర్వం కోల్పోయి ప్రజలు, రైతులు దిక్కుతోచని స్థితిలో ఉంటే తొమ్మిది రోజుల తర్వాత సీఎం, మంత్రులు విహారయాత్రకు వచ్చినట్లు వచ్చి పోవడానికి సిగ్గుండాలని ఆగ్రహం వ్యక్తంచేశారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దాదాపు 20వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినా సీఎం సరిగ్గా స్పందించలేదన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గమన్నా, ఇక్కడి రైతులన్నా ముఖ్యమంత్రికి అంత చులకనా అని మండిపడ్డారు. పదిహేను రోజుల తర్వాత సమీక్షలు చేయడం కాదని, నష్ట పరిహారానికి సత్వర చర్యలు కావాలని జాజాల డిమాండ్ చేశారు.
బోరు మోటర్లు ఉచితంగా పంపిణీ చేయాలి
ఎల్లారెడ్డి నియోజకవర్గం భారీగా నష్టపోయిందని తెలిపారు. భారీ వర్షాలకు, వరదలకు పంటపొలాలు పూర్తిగా కొట్టుకుపోయాయని, ప్రతి రైతుకు లక్ష రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు పొలాల హద్దులు చెరిపివేయబడ్డాయని, ప్రభుత్వమే భూసర్వే చేయించి రైతులకు హద్దులు ఏర్పాటుచేయించాలన్నారు.
వరదలో పంట పొలాలు మునిగిపోవడంతో బోరు మోటర్లు పాడయ్యాయని, అటువంటి రైతులను గుర్తించి వారికి ఉచితంగా బోరు మోటర్లను పంపిణీ చేయాలన్నారు. తెగిన చెరువు కట్టలు, అలుగుల మరమ్మతులకు ప్రత్యేక నిధులు కేటాయించి తక్షణమే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పోచారం ప్రాజెక్ట్ వద్ద శాశ్వత పరిష్కారంగా తగిన చర్యలు తీసుకోవాలని, కళ్యాణి ప్రాజెక్ట్ గేట్లు పురరుద్ధరణ, కట్ట మరమ్మతులు పూర్తిస్థాయిలో చేపట్టాలని కోరారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్, మత్తమాల పీఏసీఎస్ అధ్యక్షుడు కాసాల శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.