నిజామాబాద్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బుధవారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌కు రానున్నారు. తెలంగాణ తిరుమలగా ప్రసిద్ధి చెందిన శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కల్యాణోత్సవ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారు. బుధవారం ఉదయం 9.50గంటలకు ప్రగతిభవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి బయల్దేరుతారు. అక్కడి నుంచి 10గంటలకు హెలికాప్టర్లో బయల్దేరి 10.40 గంటలకు బాన్సువాడ పట్టణానికి చేరుకుంటారు.
అనంతరం ప్రత్యేక వాహన శ్రేణిలో 10.55 గంటలకు బీర్కూర్ మండలం తిమ్మాపూర్‌లోని తిరుమల వేంకటేశ్వర ఆలయానికి వస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ స్వయంగా పాల్గొంటారు. అనంతరం ఇక్కడే ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ముఖ్యమంత్రి పాల్గొనే అవకాశం ఉన్నది. బ్రహ్మోత్సవ క్రతువులో పాల్గొన్న అనంతరం సీఎం కేసీఆర్ హైదరాబాద్‌కు హెలికాప్టర్లో పయనం అవుతారు. మొత్తంగా రెండున్నర గంటలపాటు ముఖ్యమంత్రి టూర్ కొనసాగనున్నది.
కేసీఆర్ చొరవ… పోచారం సంకల్పం…
ఒకప్పుడు అరకొర సౌకర్యాలతో కొట్టుమిట్టాడిన వేంకటేశ్వరాలయం ఇప్పుడు అద్భుతమైన సౌకర్యాలతో మార్మోగుతున్నది. తిమ్మాపూర్ దేవస్థానం ప్రజల్లో తెలంగాణ తిరుమలగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దశాబ్దాలుగా స్థానిక ప్రజానీకం పూజలు అందుకుంటూ కొంగుబంగారంగా వెలుగొందుతున్న వేంకటేశ్వరాలయం అభివృద్ధిని స్థానిక ఎమ్మెల్యే, శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి చేపట్టారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో విడుదలైన రూ.23కోట్ల నిధులతోపాటు పోచారం శ్రీనివాస రెడ్డి ప్రత్యేక చొరవతో తిమ్మాపూర్ ఆలయం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చెందింది.
అచ్చంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తలపించేలా కట్టడాలు మైమరిపిస్తున్నాయి. తిరుపతిలో అలిపిరి ఘాట్ వద్ద కనిపించే గరుత్మంతుని స్వాగత విగ్రహం దగ్గరి నుంచి మొదలు పెడితే ఆలయ ప్రహరీ వరకు అచ్చంగా తిరుమల దేవస్థానాన్ని తలపిస్తున్నది. ఆలయ అభివృద్ధిని పోచారం శ్రీనివాస రెడ్డి దగ్గరుండి చేపట్టారు. గుట్టపై ఘాట్ రోడ్డును ప్రజల సౌకర్యార్థం నిర్మించడంతోపాటు వసతికి 50 సూట్ రూమ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చారు. తెలంగాణ తిరుమల దేవస్థానంలో ప్రతిచోటా వైష్ణవ సంప్రదాయం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. ఆగమ శాస్త్ర పండితుల సలహాలు, సూచనల ప్రకారం తిమ్మాపూర్ గుట్టపై వెలసిన వేంకటేశ్వరాలయాన్ని స్పీకర్ పునర్నిర్మాణం చేపట్టారు.