ఆర్మూర్‌టౌన్, జూలై 20 : బీజేపీ, కాంగ్రెస్ నేతల పరస్పర విమర్శలు, సవాళ్లతో ఆర్మూర్, అంకాపూర్‌లలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వంపై, సీఎంపై ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేయడం, ఆయన ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ ‘చలో అంకాపూర్’కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు నియోజకవర్గ వ్యాప్తంగా రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి వినయ్‌రెడ్డిని పోలీసులు హౌస్అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో హైటెన్షన్ నెలకొన్నది.
కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చి తప్పినందుకు కాంగ్రెస్ పార్టీ నేతల మెడలలో ఉన్న చైన్లను మహిళలు లాగేసుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. స్కూటీలు ఇస్తామన్న హామీని అమలు చేయనందుకు కాంగ్రెస్ నేతల షోరూంల నుంచి స్కూటీలు ఎత్తుకెళ్లాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్మూర్ మండలం అంకాపూర్లోని నివాసంలో రాకేశ్‌రెడ్డిని పోలీసులు హౌస్అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ.. మహిళలు ధైర్యంగా వెళ్లి కాంగ్రెస్ నేతల మెడలో ఉన్న గొలుసులు లాక్కుని, వాటిని అమ్మేసి ఆ రిసీప్ట్‌ను తనకు పెట్టాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని, వచ్చేది బీజేపీ ప్రభుత్వమేని తెలిపారు. కాంగ్రెస్ హామీలపై ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలతో చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.