రామారెడ్డి (సదాశివనగర్), ఫిబ్రవరి 17: జాతీయ రహదారిపై అదుపుతప్పి కంటైనర్‌ను ఢీకొన్న ఓ కారులో మంటలు చెలరేగి దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సదాశివనగర్ ఎస్సై పుష్పరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న ఓ కారు సదాశివనగర్ మండలం పద్మాజీవాడి వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జిపై అదుపు తప్పింది. డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న కంటైనర్‌ను ఢీ కొనగా టైరు పంక్చర్ కావడంతో మంటలు చెలరేగాయి.
దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది అక్కడి చేరుకొని పోలీసులు, స్థానికుల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కారు నడుపుతున్న నిజామాబాద్‌కు చెందిన రాహుల్‌కు స్వల్ప గాయాలు కాగా, వెంటనే అతడిని కామారెడ్డి దవాఖానకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నదని ఎస్సై తెలిపారు.