నిజాంసాగర్, జనవరి 25: జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా ఆదరణ పొందుతున్నది. వివిధ రాష్ర్టాల్లో పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. పొరుగురాష్ట్రమైన మహారాష్ట్రలో తెలంగాణ పథకాలు చూసి బీఆర్ఎస్లో చేరడానికి అక్కడివారు ఆసక్తి చూపుతున్నారు. కొన్నిరోజులుగా పార్టీని బలోపేతం చేయాలని ఇక్కడి నాయకులను కలిసి విన్నవిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5న నాందెడ్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నా రు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఆర్మూర్, జుక్కల్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, హన్మంత్ షిండే బుధవారం పరిశీలించారు. అనంతరం నాందెడ్ మాజీ ఎంపీ డాక్టర్ వెంకటేశ్ కాబ్డేను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేషిండే మాట్లాడుతూ.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు మహారాష్ట్ర ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో జాతీయ పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్కు ఇక్కడి వారు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తెలంగాణలో ప్రవేశపెడుతున్న పథకాలు తమ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని వారి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని చెప్పారు. ఫిబ్రవరి 5న సీఎం కేసీఆర్ సభకు మహారాష్ట్రతో పాటు సరిహద్దులోని తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారని, ఆ మేరకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.