నవీపేట, డిసెంబర్ 19: నవీపేట మండలం కోస్లీ వద్ద బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ సోమవారం అలీసాగర్ నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి సీజన్లో రైతులు పంటలు పండించుకునేందుకు నీటిని విడుదల చేస్తున్నామన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకొని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలీసాగర్ ఎత్తిపోతల పరిధిలో ఆరు మండలాల్లోని 56వేల ఎకరాలకు నీరు అందిస్తున్నట్లు చెప్పారు. యాసంగిలో రైతులు వేసుకున్న నారుమడులకు నీటిని అందించేందుకు ముందుగానే నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ రైతు సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్నారని చెప్పారు. ఈ నెల 28 నుంచి రైతుబంధు పెట్టుబడి సాయం డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వి.నర్సింగ్‌రావు, వైస్ ఎంపీపీ హరీశ్, సర్పంచ్ నీలేశ్ కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తెడ్డు పోశెట్టి, న్యాలకంటి అబ్బన్న, వి.కిశోర్ రావు, దొంత ప్రవీణ్ కుమార్, తాడ్‌బిలోలి లిఫ్ట్ చైర్మన్ మౌలానా, అల్లం రమేశ్, ప్రదీప్ రావు, ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ బల్రాం, ఏఈ ప్రణయ్ రెడ్డి, గుత్తేదారు ఈగ కిశోర్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.