ఆర్మూర్‌టౌన్, అక్టోబర్ 14 : ఆర్మూర్ ఏసీపీ కార్యాలయం ఎదుట సోమవారం ఉద్రిక్తత నెలకొంది. హిందూ సంఘాలు, బీజేపీ నేతలు దుర్గామాత విగ్రహంతో ఆఫీసు ముందర బైఠాయించారు. దేవీ శోభాయాత్ర సందర్భంగా నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్న సౌండ్‌సిస్టమ్‌ను పోలీసులు తీసుకెళ్లడంతో భక్తులు ఆందోళనకు దిగారు. జిల్లాలో డీజేలను నిషేధిస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్మూర్‌లోని త్రిపుర యూత్ క్లబ్ సభ్యులు దుర్గామాత శోభాయాత్ర సందర్భంగా నిబంధనల మేరకు సౌండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే, దాన్ని కనీసం ప్రారంభించక ముందే పోలీసులు వచ్చి సౌండ్ సిస్టమ్‌ను తీసుకెళ్లారు.
దీంతో యూత్ సభ్యులు, బీజేపీ నాయకులు పోలీసుస్టేషన్‌కు చేరుకున్నారు. నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకున్న సౌండ్ సిస్టమ్‌ను తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డిని అడిగి తీసుకెళ్లాలని సిబ్బంది చెప్పడంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. నిమజ్జనానికి తీసుకెళ్తున్న దుర్గామాత విగ్రహాన్ని ఏసీపీ ఆఫీసు వద్దకు తీసుకొచ్చి బైఠాయించారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి నచ్చజెప్పేందుకు యత్నించగా, సౌండ్ సిస్టమ్‌ను తిరిగి ఇచ్చేదాకా ఆందోళన విరమించబోమని యువకులు స్పష్టం చేశారు.
ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డిని ట్రాన్స్ఫర్ చేయాలని, పోలీసుల జులుం నశించాలని నినాదాలు చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పని చేస్తున్నారని మండిపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో దిగి వచ్చిన పోలీసులు.. చివరకు సౌండ్ సిస్టమ్‌ను అప్పగించారు. దీంతో యూత్ సభ్యులు ఆందోళన విరమించడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఆర్మూర్ పోలీసులు అతిగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్నా సౌండ్ సిస్టమ్‌లను సీజ్ చేసి తీసుకెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.