నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 16: యువతే దేశ భవిష్యత్తు, అలాంటి యువత రోడ్డు ప్రమాదాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును కోల్పోకూడదని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన ట్రాఫిక్ అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలే ప్రధానమని పేర్కొన్నారు. యువత సమాజానికి ఆదర్శంగా ఉండాలని,చట్టాలను గౌరవించాలని సూచించారు. తమను నమ్ముకున్న తల్లిదండ్రులకు దుఃఖం మిగలకుండా చూడాలని పేర్కొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: అదనపు కలెక్టర్
మన దేశంలో జనాభాకు అనుగుణంగా రోడ్ల విస్తరణ సరియైన విధంగా లేదని, మనం అభివృద్ధి చెందిన దేశంలా ఉండాలన్నారు. యువత క్రమశిక్షణ పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా అనుసరించాలని సూచించారు.
కుటుంబానికి మనోవేదన మిగల్చొద్దు: డీసీ
చేతికి వచ్చిన పిల్లలు రోడ్డు ప్రమాదంలో వారికి దూరమైతే కన్నవారి మనోవేదనకు అంతు ఉండదని డిప్యూటీ కమిషనర్ జయరాం అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు.అన్ని కళాశాలల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ నారాయణ మాట్లాడుతూ.. ప్రతి వాహనదారుడు రూల్స్ ప్రకారం వాహనం నడపాలని సూచించారు. అనంతరం పలు ప్రమాదాలకు సంబంధించిన లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో సీసీఆర్బీ ఏసీపీ రవీందర్‌రెడ్డి, మేఘన డెంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ప్రతాప్ కుమార్, రెడ్‌క్రాస్ సొసై టీ జిల్లా చైర్మన్ ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, ఇన్ఫినిటీ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, విజయ రూరల్ ఇంజినీరింగ్, ఎస్సెస్సార్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.