బాన్సువాడ రూరల్, అక్టోబర్ 22 : భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్న బోర్లం గ్రామంలోని ఆదిబసవేశ్వర ఆలయం రాష్ట్రంలోనే ఏకైక స్వయంభు ఆలయం. గర్భగుడిలోని ఆది బసవేశ్వరుడి నంది విగ్రహం ఏటేటా పెరుగుతూ అనుగ్రహిస్తున్నాడని భక్తుల నమ్మకం. ఈ ఆలయానికి దాదాపు 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ ఆలయంలోని నందీశ్వరుడిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. ఈ ఆలయ నిర్వహణ బిచ్కుంద బసవేశ్వర మఠం ఆధ్వర్యంలో కొనసాగుతున్నది.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రా మంలోని ఎత్తయిన రాతి గుట్టపై పచ్చని చెట్ల మధ్య ఆలయం వెలిసింది. నాలుగు వందల సంవత్సరాల క్రితం బిచ్కుంద మఠాధిపతి అయిన మడిమాలప్ప స్వామి కర్ణాటకలోని బీదర్‌కు వెళ్లగా ఆయన శిష్యుడు గురువుకు కోడె దూడను బహుమానంగా ఇస్తాడు. మఠానికి కానుకగా ఇచ్చిన కోడె తనంతట తాను బిచ్కుంద మఠానికి వస్తుందని మడిమాలప్ప వచ్చేస్తాడు. కోడె దూడ బిచ్కుందకు కాకుండా బోర్లం గుట్టకు వస్తుంది. మడిమాలప్ప జొన్న చేను ప్రతి రోజూ రాత్రి అర ఎకరం చొప్పున తరిగిపోతుంటుంది. కారణం తెలుసుకోవాలని, పంటపై నిఘా వేయాలని కాపలాదారులను ఆదేశిస్తాడు. మరుసటి రోజు అర్థరాత్రి వేళ కోడె వచ్చి జొన్న చేను మేయడం కాపలాదారులు చూస్తారు. కోడెను తరమగా, గుట్ట కింద చివరి ప్రాంతంలో అంబా అని రంకె వేయగా అరుపులతో అక్కడ పెద్ద బావి వెలిసింది. అది చూసి కాపలాదారుడు భయం తో పారిపోతుండగా, కోడె బావిలోకి దూకి గుప్తమైంది. ఇది ఒక గొర్రెల కాపరి చూడగా, అప్పుడు ఆది బసవేశ్వరుడు మానవరూపంలో ప్రత్యక్షమై ఈ విషయాన్ని గ్రామస్తులెవరికీ చెప్పవద్దని చెప్పి మాయమైందని చరిత్ర చెబుతున్నది. బసవేశ్వరుడు ఒక రోజు మడిమాలప్ప స్వామి కలలోకి వచ్చి బీదర్‌లో కానుకగా ఇచ్చిన దూడ తానేనని ఇక్కడే గుప్తమైనట్లు తెలుపుతూ, తన ముందు శివలింగాన్ని ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. మడిమాలప్ప స్వామి బిచ్కుంద నుంచి శివలింగాన్ని నేల బొయ్యారం ద్వారా బోర్లం గ్రామానికి తీసుకొచ్చి బసవేశ్వరుడి ముందు ప్రతిష్ఠించి పూజలు చేశాడని ప్రతీతి.. అప్పటి నుంచి ఈ ఆలయంలో ప్రతిరోజూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
బోర్లం గ్రామంలోని ఎత్తయిన రాతిగుట్టపై గుప్తమైన ఆదిబసవేశ్వరుడి శిలా విగ్రహం ఏటేటా పెరుగుతున్నదని ఆలయ పీఠాధిపతి, అర్చకుడు గ్రామస్తులు తెలిపారు. గర్భగుడిలోని బసవేశ్వరుడికి అభిషేకం చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ప్రభుత్వ సహకారంతో మౌలిక సదుపాయాలు భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు మం జూరు చేశారు. కల్యాణ మండపం నిర్మాణానికి రూ. 25లక్షలు, వంటగది నిర్మాణానికి రూ. 20లక్షలు, గుట్టపైకి భక్తులు వెళ్లేందుకు సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 10లక్షలు, రూ. 35లక్షలతో తాగు నీటి సౌకర్యం కల్పించారు.