వేల్పూర్, ఏప్రిల్ 4 : విద్యార్థులు కష్టపడి చదువుకుంటేనే మంచి భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ వార్షికోత్సవం శుక్రవారం రాత్రి నిర్వహించగా వేముల పాల్గొని మాట్లాడారు. వేల్పూర్ పాఠశాలకు ఉన్నతమైన చర్రిత ఉన్నదని తెలిపారు. ఈ పాఠశాల ఎందరో మేథావులను తయారుచేసి సమాజానికి అందించిందని పేర్కొన్నారు. తన విద్యాభ్యాసం ఈ పాఠశాల నుంచే మొదలైనట్లు తెలిపారు. ఏలేటి మహిపాల్‌రెడ్డి, డి.శ్రీనివాస్‌తోపాటు తనను ఈ రాష్ర్టానికి మంత్రులుగా అందించిందని తెలిపారు. తన తండ్రి దివంగత సురేందర్‌రెడ్డి ఇదే పాఠశాలలో చదువుకొని అనేక హోదాల్లో పనిచేశారని గుర్తుచేశారు.
మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నారని తెలిపారు. అంతర్జాతీ య క్రీడాకారులను, ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, సాయన్న ఇలా ఎందరినో ఈ పాఠశాల తయారుచేసిందన్నారు. ఆస్తులు కరిగిపోతాయని, కానీ నేర్చుకున్న జ్ఞానం ఊపిరి ఉన్నంత వరకు ఉపయోగపడుతుందని తెలిపారు, తాను చదివిన ఇంజినీరింగ్ చదువుతోనే కేసీఆర్ తనను పిలిచి ఎమ్మెల్యేగా, ఆర్అండ్బీ మంత్రిగా అవకాశం కల్పించారని చెప్పారు.
ఆ చదువే అద్భుతమైన సెక్రటేరియట్ నిర్మాణం, అమరవీరుల స్మారకం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నిర్మాణంలో భాగస్వామ్యం చేసిందన్నారు. చదువుకు పేదరికం అడ్డుకాకూడదని, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి తన శక్తిమేర నిధులు తీసుకువచ్చానని, ఇకముందు కూడా సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాం స్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రమేశ్‌రెడ్డి, హెచ్ఎం రాజన్న, ఎంఈవో రేణుక, రిటైర్ట్ హెచ్ఎంలు లక్ష్మారెడ్డి, సంజీవ్‌రెడ్డి, శంకర్, టీచర్లు పాల్గొన్నారు.