వినాయక్‌నగర్, ఫిబ్రవరి 18: డ్రైంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్సైను కారులో వచ్చిన దుండగులు ఢీకొట్టి పరారైన ఘటన జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. నాల్గో టౌన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు.. నాల్గోటౌన్ ఎస్సై-2 ఉదయ్ కుమార్ సిబ్బందితో కలిసి స్థానిక కోటగల్లి హనుమాన్ ఆలయం వద్ద సోమవారం అర్ధరాత్రి వరకు డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. వాహనదారులకు బ్రీత్ ఎనలైజర్ మిషన్‌తో పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో అటు వైపుగా ఓ కారు రాగా.. నిలపాలని ఎస్సై సూచించారు. కారును నిలపకుండా అందులో ఉన్న దుండగులు మరింత వేగంగా ఎస్సై ఉదయ్ కుమార్‌ను ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు.
కారు ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎస్సై కింద పడిపోవడంతో ముఖానికి, ఇతర శరీర భాగాలకు గాయాలయ్యాయి. వెంటనే ఆయనను సిబ్బంది చికిత్స కోసం ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారుతోపాటు దుండగులను పట్టుకునేందుకు సిబ్బంది ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ఘటనను పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించారు. అదనపు డీసీపీ బస్వారెడ్డి ఆదేశాల మేరకు ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి పర్యవేక్షణలో నగర సీఐ శ్రీనివాస్ రాజ్ ఆధ్వర్యంలో ఫోర్త్ టౌన్ ఎస్సై శ్రీకాంత్ గాలింపు చర్యలు చేపట్టారు.