లింగంపేట, ఫిబ్రవరి 12: మండలంలోని సజ్జన్పల్లి గ్రామంలో మద్యం విక్రయాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయాలు చేపడితే లక్ష రూపాయల జరిమానా విధించాలని తీర్మానించారు. బుధవారం గ్రామస్తులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొన్నారు. గ్రామంలో మద్యం విక్రయాలతో యువత చెడిపోవడంతోపాటు కుటుంబాలు వీధిన పడుతున్నాయని భావించి మద్యపాన నిషేధం విధిస్తున్నట్లు గ్రామపెద్దలు తెలిపారు.
తీర్మానానికి వ్యతిరేకంగా మద్యం విక్రయాలు చేసిన వారికి లక్ష రూపాయలు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో పుట్టి పోశయ్య, లక్ష్మయ్య, రాములు, రవి, సాయికిరణ్, ఎల్లాగౌడ్, కిష్టయ్య, పోచయ్య, విష్ణు, వెంకాగౌడ్, మల్లేశ్, గంగారాం, సిద్ధిరాములు, మహిళలు పాల్గొన్నారు.