బోధన్, అక్టోబర్ 28: ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఏఐపీకేఎస్ (అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి గుమ్ముల గంగాధర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధకారంలోకి రాగానే రూ. 2లక్షల లోపు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించినా, ఇందులో సుమారు 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందని, మిగతా వారు కార్యాలయాలు, బ్యాంకుల చుట్లూ తిరగాల్సి వస్తోందన్నారు.
రైతు భరోసా పంట కోతలు పూర్తయినా అందించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఇంతవరకూ పూర్తిస్థాయిలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తమ పంటను దళారులకు అమ్ముకుంటున్నారని తెలిపారు. పరోక్షంగా ప్రభుత్వం దళారులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
వ్యవసాయంపై ఆధారపడి 58 ఏండ్లు పూర్తయిన ప్రతి రైతుకూ నెలకు రూ. 10వేలు అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సబ్ కలెక్టర్ వికాస్ మహతోకు అందజేశారు. కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పుట్టి నడ్పినాగన్న, మండల అధ్యక్షుడు పడాల శంకర్, కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి షేక్ నసీర్, నాయకులు సిద్ద పోశెట్టి, శంకర్, గంగారాం పాల్గొన్నారు.