కంఠేశ్వర్, అక్టోబర్ 26: స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ నెల 29న బీసీ కమిషన్ ప్రతినిధుల బృందం రానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ కిరణ్కుమార్ సూచించారు. కలెక్టరేట్లో శనివారం సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
కమిషన్ చైర్మన్ నిరంజన్ నేతృత్వంలోని బృందానికి ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిజామాబాద్ జిల్లాకు చెందిన వారు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కామారెడ్డి జిల్లా ప్రజలు రాతపూర్వకంగా అభిప్రాయాలను నివేదించవచ్చని తెలిపారు. డీసీపీ కోటేశ్వర్రావు, డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారిణి స్రవంతి, ఆర్డీవో రాజేంద్రకుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్ పాల్గొన్నారు.