శక్కర్ నగర్ : బోధన్ పట్టణ శివారులోని ఈతవనానికి వెళ్లే రోడ్డు కబ్జాకు గురైందని గీతా కార్మిక సంఘం నాయకులు, కుటుంబీకులు బోధన్ తహసీల్దార్ విఠల్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ విషయంలో విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ పి గంగాధర్ గౌడ్ ( RP Gangadhar Goud ) కోరారు.
బోధన్ శివారులోని పసుపు వాగు ప్రాంతం సర్వే నంబర్ 594లో 8 ఎకరాల ఆరు గుంటల భూమిలో ఈతవనం (Itavanam) ఉందని అన్నారు. అప్పట్లో ఈత వనానికి వెళ్లేందుకు పానాది ఉండేదని, దాని ద్వారానే గీత కార్మికులు ఈతవనానికి వెళ్లేవారని అన్నారు. కాలక్రమేణ రహదారి ఆక్రమణకు గురైందని ఆరోపించారు.
రోడ్డు కబ్జాకు గురి కావడంతో ఈత వనాలకు వెళ్లేందుకు గీత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రెవెన్యూ శాఖ పరంగా సమగ్ర సర్వే నిర్వహించి ఈత వనానికి వెళ్లే గతంలో ఉన్న పానాదిని కబ్జాల నుంచి కాపాడాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో శంకర్ గౌడ్, రాజేందర్ గౌడ్, సాయ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్ గౌడ్, కమలమ్మ, లక్ష్మి, శ్రీధర్ గౌడ్ ఉన్నారు.