బాన్సువాడ, జూలై 11 : విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. విద్యార్థినిని లైంగికంగా వేధించడం ప్రారంభించాడు. మరోవైపు, ఈ విషయం బయటికి పొక్కకుండా గ్రామ పెద్దలు రాజీ కుదిర్చారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. దీంతో ఉపాధ్యాయుడు సహా పది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాన్సువాడ డీఎస్పీ సత్యనారాయణ కేసు వివరాలను గురువారం విలేకరులకు వెల్లడించారు. బాన్సువాడ మండలంలోని ఓ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయుడు.. అదే పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు.
అయితే, ఈ ఘటనబయటికి పొక్కకుండా గ్రామానికి చెందిన కొందరు మధ్యవర్తులు.. ఉపాధ్యాయుడికి, బాలిక తల్లిదండ్రులకు మధ్య రాజీ కుదిర్చారు. అయితే, తాజాగా ఈ విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సహకారంతో బాధితురాలితో పాటు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడగా, లైంగిక వేధింపులు నిజమేనని తేలింది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఉపాధ్యాయుడితోపాటు రాజీకుదిర్చిన తొమ్మిది మధ్యవర్తులపైనా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పాఠశాలల్లో, పని చేసే ప్రదేశాల్లో, ఇతర చోట్ల బాలికలను, మహిళలను వేధిస్తే పోలీసులను ఆశ్రయించాలని డీఎస్పీ సూచించారు.