సిరికొండ, జనవరి 21: మండలంలోని తూంపల్లి అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు నాటు తుపాకీ పేలి ఓ వేటగాడు మృతిచెందగా..ఈ కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులు హత్యగా నిర్ధారించారు. వెంట వచ్చిన ఇద్దరు స్నేహితులే హత్యచేసినట్లు విచారణలో నిగ్గుతేల్చారు. ఇందుకు సంబంధించిన వివరాలను అసిస్టెంట్ కమిషర్ వెంకటేశ్వర్లు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఆయన
మాచారెడ్డి మండలం సర్దాపూర్తండాకు చెందిన రాంరెడ్డి, బానోత్ రావుజీ (36), సోమరిపేట్కు చెందిన అశిరెడ్డి స్నేహితులు. ఈ నెల 18వ తేదీన అర్ధరాత్రి తూంపల్లి అటవీ ప్రాంతంలో వేటకు వెళ్లారు. తూంపల్లి గ్రామ పరిధిలోని దేవుడి గుట్ట, మైసమ్మ గుడి మధ్య ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో రావుజీని వెంట వచ్చిన ఇద్దరు స్నేహితులు నాటు తుపాకీతో కాల్చి చంపినట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఆయన చెప్పారు.