మోర్తాడ్, జూలై 30: ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణలక్ష్మి పథకం కింద రూ.లక్ష చెక్కుతోపాటు తులం బంగారం వెంటనే ఇవ్వాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన వేల్పూర్‌లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులపై సంతకాలు చేసిన సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందుకున్న వారందరికీ తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ దరఖాస్తులు ఎన్ని వచ్చినా తాను నియోజకవర్గానికి వచ్చినప్పుడల్లా తీసుకొచ్చి సంతకాలు చేయించుకోవాలని అధికారులకు సూచించారు. భీమ్‌గల్ మండలానికి చెందిన 136, మెండోరా మండలానికి చెందిన 46, కమ్మర్పల్లి మండలానికి చెందిన 35, మోర్తాడ్ మండలానికి చెందిన 27 మొత్తం 244 దరఖాస్తులపై ఎమ్మెల్యే వేముల సంతకాలు చేశారు.
ఏ కష్టమొచ్చినా మీకు అండగా ఉంటా..: వేముల
వేల్పూర్ , జూలై 30: వేల్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పర్యటించారు. ‘మీకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటా.. నేను ఈ స్థాయిలో ఉండడానికి మీరే కారణం’ అంటూ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తూ భరోసా ఇచ్చారు. ప్రధాన వీధుల గుండా తిరుగుతూ గ్రామస్తుల బాగోగులను తెలుసుకున్నారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని వారికి సూచించారు. ఇటీవల పలువురు అనారోగ్యంతో మృతిచెందగా… బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు బబ్బురు ప్రతాప్, రేగుల్ల రాములు, మాజీ ఉపసర్పంచ్ పిట్ల సత్యం, మాజీ ఎంపీటీసీ మొండి మహేశ్, సుంకరి రాము, సామ మహేందర్, బాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.