కూలీల కొరత, ఖర్చు, సమయం ఆదా చేసుకునేందుకు ఓ రైతు వినూత్న యంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు. దీంతో ఏడుగురు చేయాల్సిన పనిని ఒక్క యంత్రమే చేస్తున్నది. డోంగ్లీ మండలంలోని లింబూర్ గ్రామ శివారులో సోయాబీన్ విత్తడానికి ఓ రైతు ఆధునిక యంత్రాన్ని ఉపయోగిస్తున్నాడు. పాత పద్ధతిలో ఎకరం సోయాబీన్ విత్తడానికి ఆరు నుంచి ఏడుగురు కూలీలు అవసరం ఉండేది. వారికి సుమారు రూ.2వేల వరకు కూలి డబ్బులు వెచ్చించాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ ఆధునిక యంత్రం ఒక మనిషి సహాయంతో రోజుకు రెండు ఎకరాల వరకు విత్తనాలు వేస్తున్నది. సరైన మధ్యదూరాన్ని పాటిస్తుండడంతోపాటు సమయం, ఖర్చు ఆదా అవుతుందని రైతు పేర్కొన్నాడు. ఈ యంత్రాన్ని సోయాబీన్, వేరుశనగ, మక్కజొన్న తదితర పంటలకు ఉపయోగించవచ్చని చెబుతున్నారు.