కేసీఆర్ హయాంలో ఎలాంటి కరెంట్ కష్టాలు లేకుండే.. 24 గంటలూ మెరుగైన విద్యుత్ అందించారు. దీంతో అన్ని రకాల చిరువ్యాపారులూ తమ వ్యాపారాలను ధీమాగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు నిరంతరంగా కరెంట్ ఇవ్వడంతో తాము ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేసుకున్నామంటూ నాటి కేసీఆర్ పాలనను పలువురు చిరువ్యాపారులు గుర్తుచేసుకుంటున్నారు. ప్రభుత్వం మారడంతో మళ్లీ కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని ఆందోళన చెందుతున్నారు.
కేసీఆర్ హయాంలో 24గంటల కరెంటుతో ఇబ్బంది లేకుండా పనులు తొందరగా పూర్తి చేసుకునేది. రైతులకు గాని ఇతరత్రా పనులు ఆలస్యం కాకుండా పూర్తి చేసి ఇచ్చేవాడిని. పొద్దున 8గంటలకు పనులు ప్రారంభిస్తే రాత్రి 11వరకు పనులు చేస్తూనే ఉండేవాళ్లం. కేసీఆర్ హయాంలో ఒక్క నిమిషం కూడా కరెంటు పోలేదు. ఇప్పుడు మళ్లీ కరెంట్ కష్టాలు మొదలయ్యాయి.
-పవన్చారి, లైట్మిషన్ ఆపరేటర్, వెల్డర్,నవీపేట
నవీపేట,జూన్ 21: కేసీఆర్ పాలనలో కరెంట్ కోతలు అసలే లేకుండే. 24 గంటల పాటు కరెంట్ ఇవ్వడంతో వ్యాపారులెవరూ ఇబ్బందులు పడలే. నేను ప్రతిరోజు కరెంట్ తోనే పిండి గిర్ని నడిపించకుంటున్న. అవసరమైతే ఇతర రాష్ర్టాల నుంచి కరెంట్ కొనుగోలు చేసి ఇచ్చిండ్రు. కానీ ఇప్పుడు మళ్లీ కరెంట్ కష్టాలు మొదలైనయి. ఎప్పుడు పోతుందో..ఎప్పుడు వస్తుందో తెలియడంలేదు. మళ్లీ పాతరోజులు వచ్చాయేమోనని అనిపిస్తున్నది.
-సయ్యద్ జిలానీ, పిండిగిర్ని యజమాని, నవీపేట
పదేండ్ల కేసీఆర్ పాలన భేష్ అని చెప్పాలే. 24 గంటల పాటు త్రీఫేస్ ఉచిత కరెంట్ ఇచ్చిన కేసీఆర్ సార్కు రెండు చేతులు ఎత్తి మొక్కాలే. దేశంలోనే తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది ఒక కేసీఆరే. ఆయన దిగిపోయిన తర్వాత కరెంట్ బాధలు మొదలయ్యా యి. రోజుకు పదిసార్లు కరెంట్ ట్రిప్పు కావడంతో మేము ఇస్త్రీ బట్టలు చేయలేక పోతున్నాం. పదేండ్లపాటు నిరంతరం కరెంట్ ఇచ్చిన కేసీఆరే గుర్తుకు వస్తున్నాడు.
-ఎస్. జీవన్, లాండ్రీ షాపు యజమాని, నవీపేట