మంగళవారం 02 మార్చి 2021
Nizamabad - Jan 23, 2021 , 00:36:33

అనర్హులు 12వేలు!

అనర్హులు 12వేలు!

  • అంగన్‌వాడీ కేంద్రాల్లో డబుల్‌ పేర్లతో గందరగోళం 
  • ప్రభుత్వ ఆదేశాలతో ప్రక్షాళన మొదలు పెట్టిన అధికారులు 
  • ఇప్పటి వరకు నిజామాబాద్‌ జిల్లాలో మూడు ప్రాజెక్టుల్లో పూర్తి 
  • డిచ్‌పల్లి, భీమ్‌గల్‌ ప్రాజెక్టుల్లో పూర్తి కాని బోగస్‌ పేర్ల తొలగింపు 
  • రెండు చోట్ల పేర్లుంటే ఒకటి తొలగించి కొత్త జాబితా తయారు 

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నది. అయితే కొందరు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ ఆశయం పక్కదారి పడుతున్నది. లబ్ధిదారుల పేర్లు అటు అత్తగారి ఇంటి వద్ద, ఇటు తల్లిగారి ఇంటి వద్ద ఉన్న సెంటర్లలో నమోదు చేయిస్తున్నారు. ఒకే లబ్ధిదారు పేరు రెండేసి చోట్ల ఉంటున్నది. ఒకచోట లబ్ధిదారు సరుకులు తీసుకుంటుండగా, మరో చోట గైర్హాజరు ఉంటున్నది. అయితే లబ్ధిదారు అందుబాటులో లేకున్నా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు అంగన్‌వాడీ సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఇలా రెండేసి చోట్ల పేర్లు ఉండడంతో గందరగోళ పరిస్థితి నెలకొంటున్నది. బోగస్‌ లబ్ధిదారుల ఏరివేతపై అధికారులు దృష్టి సారించారు. లబ్ధిదారుల పేర్లు ఎక్కడో ఒక చోట మాత్రమే రికార్డుల్లో ఎక్కించేలా చర్యలు చేపట్టారు. నిజామాబాద్‌ జిల్లాలో ఐదు ప్రాజెక్టులు ఉండగా, నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌, బోధన్‌ ప్రాజెక్టుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి 12 వేల మంది బోగస్‌ లబ్ధిదారులను గుర్తించారు. డిచ్‌పల్లి, భీమ్‌గల్‌ ప్రాజెక్టుల్లో ఏరివేత ప్రక్రియ ఇంకా మొదలుపెట్టలేదు.

నిజామాబాద్‌, జనవరి 22  (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. లబ్ధిదారుల పేర్లు రెండు చోట్ల ఉంటే ఎక్కడో ఒక చోట మాత్రమే రికార్డులో ఎక్కించేలా చర్యలు చేపట్టారు. ఈ ప్రక్రియ నిజామాబాద్‌ జిల్లాలో కేవలం మూడు ప్రాజెక్టుల్లోనే పూర్తి కాగా డిచ్‌పల్లి, భీంగల్‌ ప్రాజెక్టుల్లో ఇంకా మొదలు పెట్టలేదు. నిజామాబాద్‌ అర్బన్‌, ఆర్మూర్‌, బోధన్‌ ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు 12 వేల మంది డబుల్‌ పేర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది.

12వేల మంది పేర్ల తొలగింపు

అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలకు అంతేలేకుండా పోతున్నది. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన లేకపోవడంతో లబ్ధిదారుల సంఖ్యలో గతం నుంచి గందరగోళం కొనసాగుతున్నది. అంగన్‌వాడీ కేంద్రాల్లో అర్హులకు బదులుగా రెండు పేర్లు నమోదైన వారితోపాటు, ఆరేండ్ల వయస్సు దాటిన అనర్హులైన పిల్లలనూ జాబితాలో చూపిస్తున్నారు. ప్రతినెలా అందించాల్సిన పౌష్టికాహారం లెక్కల్లో భారీగా తేడాలు వస్తున్నాయి. దీన్ని ఆసరాగా తీసుకొని కొన్ని కేంద్రాల్లో బోగస్‌ లబ్ధిదారుల పేరుతో పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తప్పులను సరిచేయడంతోపాటు అర్హుల లెక్క పక్కాగా తేల్చడానికి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ నడుం బిగించింది. అనర్హుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. నిజామాబాద్‌ జిల్లాలో ఐదు సమగ్ర శిశు అభివృద్ధి సేవా ప్రాజెక్టులు ఉన్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌, డిచ్‌పల్లి, బోధన్‌, భీమ్‌గల్‌, ఆర్మూర్‌ పరిధిలో మొత్తం 1500 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 13వేల 93 మంది గర్భిణులు, 14వేల 403 మంది బాలింతలు, 82వేల 352 మంది ఆరేండ్లలోపు పిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌, బోధన్‌ ప్రాజెక్టుల పరిధిలో సుమారుగా 12వేల బోగస్‌ పేర్లు తొలగించగా డిచ్‌పల్లి, భీమ్‌గల్‌ ప్రాజెక్టుల్లో ఇంకా ఈ ప్రక్రియనే షురూ కాకపోవడం గమనార్హం.

పకడ్బందీగా.. 

గతంలో అంగన్‌వాడీ కేంద్రాల్లో అనర్హుల పేర్ల తొలగింపు కోసం జిల్లా నుంచి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి సమాచారం పంపి పేర్లను తొలగించే వారు. ఈ విధానం సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో ఆ శాఖ నూతన డైరెక్టర్‌ దివ్య కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. జిల్లా అధికారులకే అనర్హుల తొలగింపు అధికారం అప్పగించారు. మూడు నెలల క్రితం ప్రారంభించిన తొలగింపు ప్రక్రియ 2020 ముగింపు నాటికే పూర్తి కావాలని ఆదేశాలు సైతం జారీ కావడంతో నిజామాబాద్‌ జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో లబ్ధిదారుల సంఖ్యపై కసరత్తు పూర్తి చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం లక్షా తొమ్మిదివేల మంది లబ్ధిదారులున్నారు. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద ప్రతిరోజూ సంపూర్ణ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. కేంద్రాలకు రాని చిన్నారులకు బాలామృతం, గుడ్డు అందిస్తుండగా కేంద్రాలకు హాజరయ్యే చిన్నారులకు అల్పాహారం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు.

పక్కదారి పడుతున్నది ఇలా.. 

ఎన్‌హెచ్‌టీఎస్‌(న్యూట్రిషన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌)లో అర్హుల పేర్ల నమోదుకు అంగన్‌వాడీ టీచర్లకు అవకాశం ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొన్ని చోట్ల లబ్ధిదారుల సంఖ్యను అధికంగా చూపిస్తున్నారని తేలింది. బిడ్డ పుట్టగానే ఏ పేరు నమోదు చేయకుండా, ఒక సారి, కొద్ది రోజుల తర్వాత ఆ బిడ్డ పేరుతో మరోసారి ఇలా రెండుసార్లు జాబితాలో నమోదు చేశారు. గర్భిణులు, బాలింతల విషయానికి వచ్చినప్పుడు నివాసం ఉంటున్న చోట ఒకసారి, పురుడు పోసుకోవడానికి తల్లిగారి ఇంటికి వెళ్లిన చోట మరోసారి పేర్లు నమోదు చేశారు. ఆన్‌లైన్‌ ఎన్‌హెచ్‌టీఎస్‌లో నమోదైన లబ్ధిదారుల సంఖ్యను బట్టి అంగన్‌వాడీ కేంద్రాలకు పౌష్టికాహారం సరఫరా అవుతున్నది. వాస్తవ లబ్ధిదారుల సంఖ్యకు మించి పౌష్టికాహారం కేంద్రాలకు రావడంతో కాలపరిమితి దాటిన పౌష్టికాహారం నిల్వలు అలాగే ఉంటున్నాయి. దీనికి కారణం ఆన్‌లైన్‌ జాబితాలో ఉన్న లబ్ధిదారుల సంఖ్య కన్నా క్షేత్రస్థాయి లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉండడమే. దీన్ని ఆసరాగా తీసుకుని కొన్ని చోట్ల బోగస్‌ లబ్ధిదారుల పేరిట సరుకులు పక్కదారి పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. 

మూడు ప్రాజెక్టుల్లో పరిశీలన పూర్తి చేశాం

అంగన్‌వాడీ కేంద్రాల్లో అర్హుల గుర్తింపు ప్రక్రియ నిజామాబాద్‌ జిల్లాలో ఇంకా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ప్రాజెక్టుల్లో పూర్తి స్థాయిలో వెరిఫికేషన్‌ జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ కార్యాలయ ఆదేశాల మేరకు అనర్హులను తొలగిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా అన్ని అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారుల జాబితాలో ఉన్న పేర్లను ఒకటికి రెండు సార్లు పరిశీలిస్తున్నాం. అర్హుల లెక్క పక్కాగా తేలితే అవసరం మేరకు పౌష్టికాహారం సరఫరా అవుతుంది. ప్రభుత్వం అందిస్తోన్న ప్రయోజనం పక్కదారి పట్టడానికి అవకాశం ఉండదు.

- ఝాన్సీ, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి, నిజామాబాద్‌ జిల్లా

VIDEOS

logo