ఆదివారం 17 జనవరి 2021
Nizamabad - Jan 12, 2021 , 00:08:46

రెడీ ఫర్‌ సంక్రాంతి

రెడీ ఫర్‌ సంక్రాంతి

రెడీమేడ్‌ పిండివంటలకు పెరుగుతున్న ఆదరణ

పట్టణాల నుంచి పల్లెలకు విస్తరిస్తున్న సంస్కృతి

బిజీలైఫ్‌లో మారుతున్న ట్రెండ్‌

సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందే జిల్లాలో పిండివంటల తయారీ షురూ అయ్యింది. వివిధ రకాల పిండివంటకాలు నోరూరిస్తున్నాయి. చేగోడిలు, మురుకులు, అప్పాలు, అరిసెలు, లడ్డూలు, గవ్వలు, చకినాలు తదితర పిండివంటల తయారీలో మహిళలు నిమగ్నమయ్యారు. ఒకప్పుడు సంక్రాంతి పండుగంటే వారం, పది రోజుల ముందు నుంచే ఇండ్లల్లో పిండివంటల తయారీ ప్రారంభమయ్యేది. చకినాలు, మురుకులు, చేగోడీలు, అరిసెలు ఇలా అనేక రకాల పిండివంటలు ఇండ్లల్లోనే చేసుకునేవారు. మహిళలు ఎంతో ఆసక్తితో వీటిని తయారు చేసేవారు. పిల్లలకిది ఆటవిడుపుగానూ ఉండేది. పట్టణాల్లో పురుషులతోపాటు మహిళలు ఉద్యోగం చేస్తుండడం, ఏదైనా వ్యాపారంలో బిజీగా ఉండడంతో తీరిక దొరకడం లేదు. దీంతో తీరా పండుగ దగ్గర పడ్డ తర్వాత వెంటనే అందుబాటులో ఉన్న హోమ్‌ఫుడ్స్‌ నుంచి పిండివంటలను తీసుకొస్తున్నారు. 

ఖలీల్‌వాడి / ఇందూరు, జనవరి 11 : 

ఇంట్లో ఆడపడుచులు పిండివంటల తయారీలో బిజీబిజీగా గడిపే పండుగ సంక్రాంతి. అయితే పట్టణాల్లో ఈ కల్చర్‌ మారుతూ వస్తున్నది. పల్లెటూర్ల మాదిరిగా పట్టణాల్లో మహిళలు అంత ఓపికగా పిండివంటలు చేసేందుకు పెద్దగా శ్రద్ధ కనబర్చడం లేదు. ఇతర పనులతో బిజీగా ఉండడంతో పిండి వంటల కోసం సమయం కేటాయించలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వీరంతా ఇప్పుడు ‘రెడీమేడ్‌' పిండి వంటల వైపు చూస్తున్నారు. వీరి కోసమే అన్నట్లుగా నిజామాబాద్‌ నగరంలో పలుచోట్ల హోమ్‌ఫుడ్స్‌ పేరుతో పిండి వంటల దుకాణాలు వెలుస్తున్నాయి. పట్టణాలు రోజురోజుకూ విస్తరిస్తున్న క్రమంలో పిండి వంటలు ఇంట్లో చేసుకునే వారి సంఖ్య సైతం తగ్గుతూ వస్తున్నది. దీంతో సంక్రాంతి పండుగకు రెండు రోజుల ముందు రెడీమేడ్‌ పిండివంటలను కొనేందుకు పరుగులు తీస్తున్నారు నేటి నగర మహిళలు. క్రమంగా వీటి వైపు ఎక్కువ మంది మహిళలు శ్రద్ధ కనబర్చడంతో ఈ వ్యాపారం నగరంలో రోజురోజుకూ విస్తరిస్తున్నది. పదేండ్ల కింద నగరంలోని సుభాష్‌నగర్‌ ఎన్జీవోస్‌ కాలనీలోని రైతుబజార్‌ పక్కన ఒకే ఒక్క హోమ్‌ఫుడ్‌ దుకాణం ఉండేది. ప్రస్తుతం నగరంలో ప్రధాన కూడళ్లకు విస్తరించాయి. పలువురు మహిళలకు ఉపాధిగా మారింది. మిగిలిన రోజుల్లో పెండ్లిళ్లు, శుభకార్యాలకు ఆర్డర్లపై తయారు చేయడం, హోమ్‌ డెలివరీ చేయడంతో ఏడాదంతా ఉపాధి లభిస్తున్నది.

క్యాంపుల్లోవంటల సందడి

తయారీలో మహిళలు బిజీబిజీ

బోధన్‌, జనవరి 11 : 

సంక్రాంతి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు పెద్ద పండుగ. ఎప్పుడో 60, 70 సంవత్సరాల క్రితం జిల్లాలోని బోధన్‌, కోటగిరి, నవీపేట్‌, నిజామాబాద్‌ రూరల్‌, నందిపేట్‌, మాక్లూర్‌ తదితర ప్రాంతాలకు కోస్తా జిల్లాల నుంచి వచ్చి స్థిరపడి ఇక్కడి జీవన స్రవంతిలో మమేకమైన అనేక కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాల్లో ఇప్పటికీ అక్కడి పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది. సంక్రాంతికి ముగ్గులు, పాడిపంటలతోపాటు పిండి వంటలకు వీరు ప్రాధాన్యత ఇస్తారు. ఉద్యోగ, ఉపాధి కోసం ఎక్కడెక్కడో స్థిరపడిన కుటుంబసభ్యులంతా సంక్రాంతికి కలవడం క్యాంపుల్లో ఆనవాయితీగా వస్తోంది. తరాలు మారినా ఈ సంప్రదాయంలో పెద్దగా మార్పులేకపోవడం గమనార్హం. అందుకే, నెల రోజులకు సరిపడా పిండి వంటలను తయారు చేస్తుంటారు. గతంలోనైతే నెల రోజుల ముందుగానే పిండివంటలు తయారు చేసుకునేవారు. ఇప్పుడు కనీసం పదిహేను రోజుల ముందునుంచే పిండి వంటలు సిద్ధం చేసుకుంటున్నారు. ఆంధ్రా పిండి వంటకాల్లో అరిసెలకే అగ్రస్థానం ఉంది. సంక్రాంతి వచ్చిందంటే చాలు.. అరిసెలు చేయాల్సిందే.. ఒక్క సంక్రాంతి నెలలోనే అరిసెలకు బాగా డిమాండ్‌ ఉంటుంది. ప్రతి ఇంట్లో అరిసెలు తయారు చేసుకుంటుంటారు. ఒక్కో ఇంట్లో ఒక్కో రోజు చొప్పున అరిసెలు తయారు చేసుకోవడమో లేదా కొన్ని కుటుంబాలు కలిసి వాటిని తయారు చేసుకోవడమో చేస్తారు. ఎందుకంటే.. అరిసెల తయారీ చాలా కష్టమైన పని. అరిసెలతోపాటు సక్కిడాలు, చెక్కలు, అప్పడాలు, బూంది లడ్డూ, గవ్వలు తదితర కారం, తీపి పంటకాలను తయారు చేసుకుంటున్నారు. సంక్రాంతి వేళ.. ఏ ఇంట్లో చూసినా పిండి వంటల ఘుమఘుమలు గుబాళిస్తుంటాయి.

ఇండ్లల్లో తగ్గిన సందడి..

ఒకప్పుడు సంక్రాంతి పండుగంటే వారం, పది రోజుల ముందు నుంచే ఇండ్లల్లో పిండివంటల తయారీ ప్రారంభమయ్యేది. చకినాలు, మురుకులు, చేగోడీలు, అరిసెలు ఇలా అనేక రకాల పిండివంటలు ఇండ్లల్లోనే చేసుకునేవారు. మహిళలు ఎంతో ఆసక్తితో వీటిని తయారు చేసేవారు. పిల్లలకిది ఆటవిడుపుగానూ ఉండేది. పల్లెల్లో ఇప్పటికీ ఈ పిండివంటల కోసం కట్టెలపొయ్యిలనే ఉపయోగిస్తున్నారు. కట్టెల పొయ్యి సంస్కృతి తగ్గుతూ రావడంతో గ్యాస్‌పొయ్యిలమీదైనా సరే రెండు, మూడు రోజులపాటు ఓ సందడిలా పిండివంటలను చేస్తున్నారు. అయితే ఇది పట్టణాలకు వచ్చే సరికి తగ్గుతోంది. పట్టణాల్లో పురుషులతోపాటు మహిళలు ఏదో ఒక ఉద్యోగం చేస్తుండడం, ఏదైనా వ్యాపారంలో బిజీగా ఉండడంతో అంత తీరిక దొరకడం లేదు. దీంతో తీరా పండుగ దగ్గర పడ్డ తర్వాత అందుబాటులో ఉన్న హోమ్‌ఫుడ్స్‌ నుంచి పిండివంటలను తీసుకొస్తున్నారు. కిలో, అరకిలో చొప్పున కొనుగోలు చేసి కావాల్సిన పిండి వంటలను తెచ్చుకొని పండుగ కానిచ్చేస్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ వాతావరణంలో పిండి వంటల సందడిని పిల్లలు మిస్‌ అవుతున్నారు. ఇంట్లో పెద్దలు పిండి వంటలు చేస్తున్న సమయంలో పిల్లలు ఆసక్తిగా గమనిస్తూ ఉండేవారు. ఉడతా భక్తిగా వారూ ఇంట్లోవారికి సహాయపడుతుండేవారు. ఇలా పిండి వంటలు ఎలా చేయాలో వారికి చిన్నప్పట్నుంచే అలవాటయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితులు క్రమేణా దూరమవుతూ వస్తున్నాయి. పెద్దల చేతిలో సెల్‌ఫోన్‌, పిల్లల చేతిలో టీవీ రిమోట్‌.. రెడీమేడ్‌గా తెచ్చుకున్న పిండివంటలతో పండుగను అలా అలా సెలబ్రేట్‌ చేసేసుకుంటున్నారు. కానీ ఇంట్లో చేసుకున్నంత రుచికరంగా బయట ఫుడ్‌ ఉంటుందా? అంటే అనుమానమే. సహజ సిద్ధమైన న్యాచురాలిటీ వీటికి ఉండదు. మార్కెట్లో నిత్యం రేట్లు విపరీతంగా పెరిగిపోతుండడంతో ఎలాంటి వస్తువులతో వీటిని తయారు చేస్తున్నారో తెలియదు. 

పిండి వంటలకు భలే గిరాకీ

పండుగ వేళ హోమ్‌ఫుడ్స్‌కు గిరాకీ విపరీతంగా ఉంది. ప్రధానంగా ఈ పండుగ కోసమే వీటిని ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. అరిసెలు, చేగోడీలు, మురుకులు, చకినాలు తదితర పిండి వంటలతోపాటు నోముల కోసం నువ్వుల ఉండలు తయారు చేసి విక్రయిస్తున్నారు. బిజీలైఫ్‌కు అలవాటు పడినవారు ఇక్కడికి వచ్చి తమకు ఇష్టమైన పిండివంటకాలను కొనుగోలు చేస్తున్నారు. నగరంలోని సుభాష్‌నగర్‌ రైతుబజార్‌ సమీపంలో వరుసగా మూడు, నాలుగు దుకాణాలు ఏర్పాటు చేశారు. ఇవి ఎప్పుడూ బిజీగా ఉంటాయి. వీటితోపాటు వినాయక్‌నగర్‌, గంగాస్థాన్‌, జిల్లా పరిషత్‌ ఏరియాలోనూ దుకాణాలు ఉన్నాయి. కొంతకాలంగా ఇవి మూడు అరిసెలు.. ఆరు చేగోడీలు అన్నట్లుగా నడుస్తున్నాయి. నగరాల్లో మారుతున్న కల్చర్‌కు అనుగుణంగా ఈ వ్యాపారం రోజు రోజుకూ విస్తరిస్తోంది. 

మహిళలకు ఉపాధి..

రెడీమేడ్‌ (హోమ్‌ఫుడ్స్‌) పిండివంటల వ్యాపారంతో మహిళలకు ఉపాధి లభిస్తున్నది. సీజన్‌లో రోజుకు రూ.వెయ్యి వరకు సంపాదిస్తున్నారు. కిలోన్నర పిండిని పిండివంటలుగా చేసి ఇస్తే వారికి రూ.200 కూలిగా చెల్లిస్తారు. ఇలా నిత్యం వీరికి పని ఉంటుంది. సీజన్‌ సమయంలో వీరికి డిమాండ్‌ బాగుంటుంది. పండుగలతోపాటు పెండ్లిళ్లు, శుభకార్యాలకు ఆర్డర్లు రావడంతో ఎప్పుడూ చేతి నిండా పని ఉంటుంది. నగరంలో పది వరకు రెడీమేడ్‌ పిండి వంటల దుకాణాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 100 మంది వరకు మహిళలు ఉపాధి పొందుతున్నారు. పట్టణాలకు పరిమితమైన పిండివంటల దుకాణాలు పల్లెలకు విస్తరిస్తున్నాయి. పట్టణ సమీప గ్రామాల్లోనూ హోమ్‌ఫుడ్స్‌ వెలుస్తున్నాయి. 

సంక్రాంతి అంటేనే పిండి వంటలు

సంక్రాంతి అంటేనే మాకు పిండి వంటలు.. ఏ పండుగకైనా ఎప్పటికప్పుడే స్వీట్లు, ఖార తయారు చేసుకుంటాం. కానీ సంక్రాంతికి అలా కాదు.. నెల రోజులకు సరిపడా పిండి వంటలు చేయాల్సిందే. సంక్రాంతికి అరిసెలు తప్పనిసరిగా తింటుంటారు. ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన కుటుంబాలే కాకుండా ఇక్కడి కుటుంబాలు అరిసెలను ఎక్కువగా ఇష్టపడుతుంటాయి. అరిసెలతోపాటు కారంపూస, బూందీ, చెక్కలు, మురుగులు ఎక్కువగా తయారు చేసుకుంటున్నాం.

-మాధవి, గృహిణి, ఆచన్‌పల్లి, బోధన్‌ 

చాలామంది కొంటున్నారు..

ఇప్పుడు ఎవరూ ఇండ్లల్లో పిండివంటలు చేయడంలేదు. ఇక్కడి నుంచే కొనుగోలు చేస్తున్నారు. నాలుగైదు రోజుల నుంచి విపరీతమైన గిరాకీ ఉంది. మరో నాలుగు రోజులపాటు ఉంటుంది. ఆ తర్వాత శుభకార్యాలకు పిండివంటలు సరఫరా చేస్తాం. ధర్మాబాద్‌ నుంచి వచ్చి పిండి వంటలు కొనుగోలు చేస్తారు. ఎంతో మంది నా వద్ద పని నేర్చుకొని వేరే దగ్గర వ్యాపారాలు పెట్టుకొని ఉపాధి పొందుతున్నారు.

-శోభ, తిరుమల హోమ్‌ఫుడ్స్‌ యజమాని

సీజన్‌లో రోజుకు వెయ్యి ఆదాయం

పండుగ సీజన్‌లో రోజుకు వెయ్యి రూపాయల వరకు ఆదాయం వస్తున్నది. ఆ తర్వాత మాకు రోజూ పని ఉంటుంది. అన్ని రకాల పిండి వంటలు తయారు చేస్తున్నాం. 

- నాగమణి, పిండివంటలు చేసే మహిళ

గల్ఫ్‌ దేశాలకు పంపిస్తారు..

మేము తయారు చేసే పిండి వంటలను దు బాయ్‌, మస్కట్‌, సౌదీ లాంటి దేశాలకు పంపి స్తాం. మా దగ్గర అన్ని రకాల పిండి వంటకాలు అందుబాటులో ఉన్నాయి. నాలుగు సంవత్సరాలుగా పిండి వంటలు తయారు చేస్తున్నాం. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మా వద్ద కొనుగోలు చేస్తారు. కారంపూస, అప్పాలు, చకినాలు, అరిసెలు, కొబ్బరి బూరెలు తయారు చేస్తున్నాం. 

-బి.విజయ, శ్రీగురు హోం ఫుడ్స్‌

గిరాకీ బాగుంది..

పిండివంటలకు గిరాకీ బాగుంది. ప్రజలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కిలోల చొప్పున అమ్ముతున్నాం. మా దగ్గర పండుగ కోసం అన్ని రకాల పిండి వంటలు తయారు చేసి అమ్ముతున్నాం. కొందరైతే ఆర్డర్‌ ఇచ్చి మరీ తయారు చేయించుకుంటున్నారు. గత ఏడాదే షాపు పెట్టాం. విదేశాలకు పిండి వంటలు పంపించేందుకు ఆర్డర్లు వస్తున్నాయి. 

-ఉడుతల లక్ష్మి, శ్రీలక్ష్మి హోంఫుండ్స్‌

హోమ్‌ఫుడ్స్‌ ధరలు (కిలో)కు 

అరిసెలు రూ.200

లడ్డూలు రూ. 200

చకినాలు రూ.160

మురుకులు రూ. 140

అప్పాలు రూ. 140

కారం అప్పాలు రూ. 140

గరిజెలు రూ. 180

గవ్వలు రూ. 160

ఖారాబూందీ రూ. 160

పోలెలు రూ. 200

రవ్వలడ్డూలు రూ. 160

నువ్వుల ఉండలు రూ. 300