శనివారం 16 జనవరి 2021
Nizamabad - Nov 17, 2020 , 00:11:05

గల్ఫ్‌ బాధితుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి

గల్ఫ్‌ బాధితుల సంక్షేమ బోర్డు ఏర్పాటుకు కృషి

ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌

నిజామాబాద్‌ రూరల్‌: రాష్ట్రంలోని గల్ఫ్‌ కార్మికులను ఆదుకునేందుకు గల్ఫ్‌ బాధితుల సంక్షేమ బోర్డు ఏర్పాటు విషయమై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దృష్టికి తీసుకెళ్తానని  నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ స్పష్టం చేశారు. సోమవారం తన స్వగ్రామమైన చీమన్‌పల్లిలోని నివాస ప్రాంగణంలో ఎమ్మెల్యే బాజిరెడ్డిని ప్రవాస హక్కుల సంక్షేమ వేదిక దుబాయ్‌ అధ్యక్షుడు    వేముల రమేశ్‌, కోటపాటి నర్సింహనాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లిన రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన గల్ఫ్‌ బాధితులు అక్కడ పనులు లేక స్వగ్రామాలకు చేరుకున్నారని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గల్ఫ్‌ బాధితుల సంక్షేమానికి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసే విషయంలో ప్రత్యేక చొరవ చూపాలని వారు విన్నవించారు. ఎమ్మెల్యే బాజిరెడ్డి స్పందిస్తూ గల్ఫ్‌ బాధితులు అప్పుల బాధలతో కొట్టుమిట్టాడుతుండడంతో పాటు ఖాళీగా ఉంటున్న వారికి ఉపాధి కల్పించి ఆదుకోవాల్సిన ఆవశ్యకతపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఎంబీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన వేముల రమేశ్‌ను ఎమ్మెల్యే శాలువాతో సత్కరించారు.