ఆదివారం 01 నవంబర్ 2020
Nizamabad - Sep 28, 2020 , 03:26:20

విడువని వాన.. తగ్గని వరద

విడువని వాన.. తగ్గని వరద

మెండోరా/నిజాంసాగర్‌/నాగిరెడ్డిపేట్‌/బోధన్‌ రూరల్‌/బాన్సువాడ రూరల్‌/రెంజల్‌/పిట్లం:  ఎగు వ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియడంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 1,64,922 క్యూసెక్కుల వరద వ స్తున్నదని ప్రాజెక్టు డీఈ జగదీశ్‌ ఆదివారం తెలిపారు. ఈ వానకాలం సీజన్‌లో ఇప్పటి వరకు ప్రాజెక్టులోకి 222 టీఎంసీల వరద వచ్చి చేరిందని చెప్పారు. ఆదివారం ఉదయం వరకు 113.29 టీఎంసీల నీటిని గోదావరి నదిలోకి వదిలివేశామని పేర్కొన్నారు. ఇన్‌ఫ్లో భారీగా పెరగడంతో ఆదివారం ఉదయం ప్రాజెక్టు 40 గేట్లను ఎత్తి లక్షా 50 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలామని తెలిపారు. ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రం వరకు 88.11 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 7,878 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నదని, దీంతో ప్రాజెక్టు నీటి నిల్వలు 7.33 టీఎంపీలకు చేరుకున్నాయని ప్రాజెక్టు డీఈఈ దత్తాత్రి తెలిపారు. మండలంలోని గాలీపూర్‌ బ్రాహ్మణ చెరువుకు గండి పడడంతో తహసీల్దార్‌ సత్యనారాయణ అక్కడికి చేరుకొని రైతులతో కలిసి ఇసుక బస్తాలు వేయించి పూడ్చివేయించారు. ఒడ్డేపల్లి కొత్త చెరువుకు గండి పడగా.. రైతులు మరమ్మతులు చేశారు. నాగిరెడ్డిపేట్‌ మండలం పోచా రం ప్రాజెక్టు నుంచి 2,365 క్యూసెక్కుల నీరు నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి వెళ్తున్నదని ప్రాజెక్టు ఏఈఈ నాగరాణి తెలిపారు. బాన్సువాడ మండలంలోని కొల్లూర్‌ వాగు నిండుగా ప్రవహించింది. పలు చెరువులు అలుగులు పారాయి. బోధన్‌ మండలంలోని సాలూ ర వద్ద మంజీరానది పాత వంతెనను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తున్నది. రెంజల్‌ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నదిలో ఉన్న పురాతన శివాలయం పూర్తిగా నీటిలో మునిగింది. జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా, భక్తులు నీటిలోకి దిగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్సై రాఘవేందర్‌ తెలిపారు. పిట్లం మండలంలోని రాంపూర్‌వాగు బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించడంతో పిట్లం  బాన్సువాడ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని కారేగాంతండాలో ఓ ఇల్లు కూలిపోయింది.