ఆదివారం 25 అక్టోబర్ 2020
Nizamabad - Jul 18, 2020 , 02:57:01

పచ్చదనానికి కేరాఫ్‌ కోటగిరి ఠాణా

పచ్చదనానికి  కేరాఫ్‌  కోటగిరి ఠాణా

  • మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు
  • ఆహ్లాదాన్ని పంచుతున్న ఆవరణ
  • హరితహారంలో నాటిన  మొక్కలతో పరుచుకున్న పచ్చదనం

కోటగిరి : పచ్చదనానికి కేరాఫ్‌గా మారింది కోటగిరి పోలీసుస్టేషన్‌. మండల కేంద్రంలోని ఠాణాలో హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు నేడు వృక్షాలుగా మారి చల్లని నీడనిస్తున్నాయి. ఇక్కడ ఎస్సైగా పని చేసిన బషీర్‌ అహ్మద్‌ ప్రత్యేక చొరవ తీసుకొని పలు రకాల మొక్కలు నాటించారు. ఆయనతోపాటు ఎస్సై రాజ్‌భరత్‌రెడ్డి, ప్రస్తుతం ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన మశ్చేందర్‌రెడ్డి హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నీడనిచ్చే మొక్కలతోపాటు పలు రకాల పూలు, అలంకరణ మొక్కలను నాటారు. ఆవరణలో పచ్చని గార్డెన్‌ ఏర్పాటు చేశారు. స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులు ఈ చెట్ల కింద ఏర్పాటు చేసిన సిమెంట్‌ బెంచీలపై సేద తీరుతున్నారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ప్రస్తుతం పెరగడంతో పోలీసుస్టేషన్‌ నందనవనాన్ని తలపిస్తోంది. పచ్చని చెట్లు, పూల మొక్కలు ఆకట్టుకుంటున్నాయి.

మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

హరితహారం కార్యక్రమంలో భాగంగా స్టేషన్‌ ఆవరణలో నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. సిబ్బంది మొక్కలు పెంచే బాధ్యతను తీసుకున్నారు. స్టేషన్‌ ఆవరణలో పచ్చదనం పరుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందరి కృషి ఫలితంగానే ఇది సాధ్యమైంది. 

- మశ్చేందర్‌రెడ్డి, ఎస్సై, కోటగిరి


logo