మంగళవారం 20 అక్టోబర్ 2020
Nizamabad - Jul 14, 2020 , 03:38:16

పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి

పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలి

  • కల్లాల పనులు త్వరగా పూర్తిచేయాలి
  • ఉపాధిలో కూలీల నమోదు పెరగాలి
  • అధికారులతో సమీక్షలో కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి: ఉపాధి హామీ, హరితహారం, పల్లె ప్రగతి పది ప్రమాణాల కార్యక్రమాల అమలును మండల ప్రత్యేకాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌ ఆదేశించారు. సోమవారం ఆయన తన చాంబర్‌లో పంట రుణాలు, కొవిడ్‌ రుణాలు, రైతుబంధు, ఎరువుల సరఫరా, ఉపాధి హామీ, హరితహారం, పల్లెప్రగతి పది ప్రమాణాల కార్యక్రమాల అమలు తదితర అంశాలపై మండల ప్రత్యేకాధికారులతోపాటు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి, నిర్దేశించిన సమయంలో పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలోని నస్రుల్లాబాదు, మద్నూర్‌, బీబీపేట, రాజంపేట మండలాల్లో మాత్రమే పంట రుణాల లక్ష్యాన్ని చేరుకున్నారని తెలిపారు. మిగతా మండలాల్లో కూడా పూర్తిచేయాలని సూచించారు.  బిచ్కుంద మండలంలో కొన్నిచోట్ల సోయాబీన్‌ విత్తనాలు మొలకెత్తలేదని, సదరు రైతుల వివరాలను సకాలంలో పంపించనందుకు ఏవో, ఏఈవోలపై చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. రెండురోజుల్లో రైతుబంధు వివరాలను పూర్తిచేయాలని సూచించారు. ఉపాధి హామీ కింద  జిల్లాలో కాలువల పూడికతీత పనులు 1224 కిలో మీటర్ల వరకు నిర్వహించాల్సి ఉండగా, 568 కి.మీటర్ల మేరకు పూర్తిచేసినట్లు చెప్పారు. 778 కి.మీటర్ల మేర పంచాయతీరాజ్‌ రోడ్లకు ఇరువైపులా ముళ్ల పొదలను ఈ నెల 18లోపు 60శాతం తొలగించాలని సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ పంపిణీ చేసిన మొక్కల వివరాలను పంచాయతీల వారీగా నమోదుచేయాలని సూచించారు. ఉపాధి హామీ పనుల్లో కూలీల నమోదు పెరగాలని, జాబ్‌కార్డుల పంపిణీ రెండు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్‌సైడ్‌ ఎవెన్యూ ప్లాంటేషన్‌, రైతు కల్లాల పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. రైతుకల్లాల పనులను స్పెషల్‌ డ్రైవ్‌గా చేపట్టాలని సూచించారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ దోత్రే, డీఆర్డీవో చంద్రమోహన్‌రెడ్డి, సీపీవో శ్రీనివాస్‌, జిల్లా అటవీ అధికారిణి వసంత, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్‌, జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్‌ రాజేందర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. logo