సోమవారం 01 జూన్ 2020
Nizamabad - Apr 11, 2020 , 00:29:43

నిత్యపూజలు.. నిరాటంకంగా సేవలు..

నిత్యపూజలు.. నిరాటంకంగా సేవలు..

  • ఆలయాల్లో కొనసాగుతున్న పూజా కార్యక్రమాలు
  • ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు
  • దేవుడి సేవలో అర్చకులు, వేద పండితులు
  • వంతుల వారీగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు
  • పరిశుభ్రంగా ఆలయ పరిసరాలు
  • లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇండ్లకే పరిమితమైన భక్తులు

ప్రపంచదేశాలను వణికిస్తున్న కొవిడ్‌-19 (కరోనా వైరస్‌) ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన లాక్‌డౌన్‌తో దేశంలోని ఆలయాలను మూసివేశారు. భక్తుల రాకను నిషేధించారు. ఈ పరిస్థితుల్లోనూ గడిచిన 20 రోజులుగా నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లోని ఆలయాల్లో నిత్యపూజలు కొనసాగుతున్నాయి. దేవుళ్లకు నిత్య కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి లోటూ లేకుండా సర్వ జనుల క్షేమం ఆకాంక్షిస్తూ పూజారులు బాధ్యతగా సేవలు అందిస్తున్నారు. దేవుళ్లకు జలాభిషేకాలు, ఫల, పుష్ప అలంకరణలతో పాటు  అర్చనలు కొనసాగుతున్నాయి.  నిత్య కైంకర్యాలు, పూజలు, ఏకాంత సేవలన్నింటినీ కొనసాగిస్తూ ఆలయాల్లో అర్చకులు తమ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు.

బాసర: పరీక్షార్థుల మొక్కులు.. చిన్నారుల అక్షరాభ్యాసాలతో ఏటా ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు కిటకిటలాడే చదువులతల్లి క్షేత్రం ప్రస్తుతం బోసిపోయింది. నిర్మల్‌ జిల్లా బాసర జ్ఞానసరస్వతీ ఆలయ పరిసరా లు భక్తుల సందడి లేకుండా కనిపిస్తుండగా.. అమ్మవారికి నిత్యపూజలు మాత్రం నిరాటంకంగా కొనసాగుతున్నాయి. అర్చకులు నిత్యకైంకర్య సేవలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. ప్రతిరోజూ ఉద యం అభిషేకం, అలంకరణ, హారతి అనంతరం ఆలయాన్ని మూసివేస్తున్నారు. తిరిగి 12.30గంటలకు ఆలయం తెరిచి మధ్యాహ్న హారతి, రాత్రి 7.30గంటలకు మహాహారతి ఇచ్చి మూసి వేస్తున్నారు. వేదపండితులు చండీయాగం నిర్వహిస్తున్నారు.  గోదావరి ఒడ్డున ఉన్న శివాలయంలో నిత్యపూజలు యథావిధిగా కొనసాగుతున్నాయి. పూజలకు అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచుతున్నామని అధికారులు తెలిపారు. ఉదయం, సాయంత్రంవేళల్లో రెండు షిఫ్టుల్లో నలుగురు  ఆలయ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. హోంగార్డులు మూడుషిప్టుల్లో విధులకు హాజరవుతున్నారు.

పూజలందుకుంటున్న ‘జైనథ్‌ లక్ష్మీనారాయణుడు’

జైనథ్‌: ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండల కేంద్రంలోని అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రతిరోజు పూజా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు భక్తులతో కోలాహలంగా ఉండే ఆలయంలో కేవలం పూజారి  పూజలు నిర్వహిస్తున్నారు.   లాక్‌డౌన్‌ నేపథ్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడంలేదని ఆలయ అర్చకుడు ధీరజ్‌కుమార్‌ తెలిపారు.

కామారెడ్డి జిల్లాలోని అన్ని ఆలయాల్లోనూ నిత్య పూజలు కొనసాగుతున్నాయి. భిక్కనూరు మండలంలోని శ్రీ సిద్దరామేశ్వరాలయంలో క్రమంతప్పకుండా నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ స్వా మి వారికి సేవలు అందిస్తున్నారు. మాచారెడ్డి మండలంచుక్కాపూర్‌లోని లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలోనూ అర్చకులు నిత్య కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో కొనసాగిస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులో ఉన్న సలాబత్‌పూర్‌ హనుమాన్‌ ఆలయంలోనూ నిరాడంబరంగా హనుమాన్‌ జయంతి జరగడం ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి.

అంతరాయం లేకుండా ఏకాంతసేవ

బీర్కూర్‌ మండలంలోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవాలయంలోనూ ఏడు కొండల వారికి ఏకాంత సేవల్లో ఎలాంటి అంతరాయం కలుగకుండా అర్చకులు శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. రామారెడ్డి మండలంలోని కాలభైరవ స్వామి వారికి సైతం ప్రతి మంగళవారం విశిష్ట పూజలు కొనసాగుతుండగా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో భక్తుల రద్దీ లేకుండానే స్థానిక పూజారులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో నిరాడంబరంగా పూజలు కొనసాగుతున్నాయి.

యథావిధిగా పూజా కార్యక్రమాలు..

ప్రతి రోజు స్వామి వా రికి పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతున్నా యి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను  తప్పకుండా పాటిస్తున్నాం. భక్తులు సైతం మాకు చక్కగా సహకరిస్తున్నారు. లాక్‌డౌన్‌ను గౌరవిస్తూ ఇండ్లకే పరిమితమవుతున్నారు. కరోనా వైరస్‌ నివారణార్థం, ఉపద్రవ నివారణ కోసం  దేవాలయంలో ప్రతి రోజూ స్వామి వారికి ప్రత్యేక పూజ, మహానివేదన, సాయంకాలం స్వామి వారికి ప్రదోష కాల పూజ యథావిధిగా నిర్వహిస్తున్నాం. పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుతున్నాం.

- కొడకండ్ల సిద్దగిరి శర్మ, అర్చకులు,  సిద్ద రామేశ్వరాలయం, భిక్కనూరు, కామారెడ్డి జిల్లా


logo