శనివారం 30 మే 2020
Nizamabad - Mar 03, 2020 , 01:17:29

పట్టణాలకు పచ్చదనం!

పట్టణాలకు  పచ్చదనం!

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి : జిల్లాలోని అన్ని మున్సిపాటీల్లో నేడు హరితహారం డేను నిర్వహించనున్నారు. నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్‌, భీమ్‌గల్‌, బోధన్‌ మున్సిపాలిటీల్లో మంగళవారం ఒక్కరోజే వేలాదిగా మొక్కలు నాటనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నగర మేయర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొంటారు. గత నెల 24 నుంచి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభించుకొని నగరంలో, మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలను అందరి భాగస్వామ్యంతో చేపడుతున్నారు. రోడ్లు శుభ్రం చేయడం, చెత్తను, పిచ్చి మొక్కలను తొలగించడం, విద్యుత్‌ స్తంభాల రీప్లేస్‌మెంట్‌, లూజ్‌వైర్లు సరిచేయడం తదితర కార్యక్రమాలు వడివడిగా జరుగుతున్నాయి. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. మంగళవారం(నేడు) నగరపాలక సంస్థతో పాటు మిగతా మూడు మున్సిపాలిటీల్లోనూ హరితహారం రోజును నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి డివిజన్‌ లేదా వార్డుల్లో కనీసం 200 మొక్కలు నాటడానికి నిర్ణయించామని తెలిపారు. ఈ హరితహారం డేను విజయవంతం చేయడానికి అందరూ కృషిచేయాలన్నారు. డివిజన్‌, వార్డు పరిధిలో నాలుగు కమిటీలకు సంబంధించిన సభ్యులు, ప్రత్యేకాధికారులతో కలిసి కనీసం రెండు వందల మొక్కలకు తక్కువ కాకుండా నాటించడానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోరారు. వార్డులోని ప్రజలను భాగస్వాములను చేసి ముందుకు వెళ్లాలని సూచించారు. అందరి సహకారంతో జిల్లాలోని మున్సిపాలిటీలను స్వచ్ఛమయంగా, పచ్చదనంతో ఉట్టిపడేలా తీర్చిదిద్దాలన్నారు. నేటి హరితహారం డేలో మొక్కలు నాటేందుకు తగిన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది.  logo