శనివారం 30 మే 2020
Nizamabad - Feb 29, 2020 , 00:47:11

పీఠమెక్కేది ఎవరో..!

పీఠమెక్కేది ఎవరో..!

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్రతినిధి: డీసీసీబీ, డీఎసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలు ఎవరికి దక్కనున్నాయో మరికొన్ని గంటల్లో తేటతెల్లం కానున్నది. చివరి వరకు దీనిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉన్నది. ఆశావహులు ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకోవడంతో పాటు తమకే పీఠం దక్కుతుందని ప్రచారాలు సైతం చేసుకున్నారు. ఊహాగానాలకు తెరదించుతూ శనివారం(నేడు) ఉదయం 8గంటలకు సీల్డ్‌ కవర్‌లో ఉన్న చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పేర్లను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించనున్నారు. ఎవరికి పీఠం దక్కుతుందోనన్న నరాలు తెగే ఉత్కంఠ చివరి వరకు కొనసాగనుంది. డీసీసీబీ, డీఎసీఎంఎస్‌ చైర్మన్లకు సంబంధించి ఎవరి పేరును ఫైనల్‌ చేయాలో సీఎం కేసీఆరే నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రి సైతం అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి సీల్డ్‌కవర్‌లో ఎవరి పేరును ప్రతిపాదిస్తే, ఆ పేరును ప్రతిపాదించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. డీసీసీబీ, డీఎసీఎంఎస్‌ డైరెక్టర్లు ఇప్పటికే శిబిరాల్లో ఉన్నారు. వారంతా శుక్రవారం  రాత్రి కామారెడ్డికి చేరుకోనున్నారు. హైదరాబాద్‌ నుంచి నేరుగా సీల్డ్‌ కవర్లతో బయలుదేరి మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఉదయం 7.30 గంటలకు కామారెడ్డిలో ప్రత్యేకంగా డైరెక్టర్లతో భేటీ కానున్నారు. 


అధిష్టానం సూచించిన చైర్మన్‌, వైస్‌ చైర్మన్ల పేర్లను అందరి ముందు ప్రకటించి, ఆ మేరకు నామినేషన్‌ వేసేందుకు వారిని సమాయత్తం చేయనున్నారు. మంత్రి సూచన మేరకు అక్కడి నుంచి నేరుగా డీసీసీబీ, డీఎసీఎంఎస్‌ కార్యాలయాలకు డైరెక్టర్లు చేరుకోనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 9వరకు అధికారులు డైరెక్టర్లతో సమావేశం ఏర్పాటు చేస్తారు. కోరం ఉందని తేలగానే వెంటనే నామినేషన్‌ ప్రక్రియకు ఉపక్రమిస్తారు. 10గంటల నుంచి 11గంటల మధ్యలో నామినేషన్లు స్వీకరిస్తారు. ఏకగ్రీవంగా గెలిచిన డైరెక్టర్లంతా టీఆర్‌ఎస్‌కే చెందిన వారు ఉన్నారు. దీంతో డీసీసీబీ, డీఎసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పదవులు సైతం అధిష్టానం సూచించిన వారికి అప్పగించనున్నారు. దీంతో చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు. 


ఈ ప్రక్రియ అంతా లంచనప్రాయంగా కానుంది. డీసీసీబీ పీఠానికి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీ నెలకొన్నది. ప్రధానంగా ముగ్గురు నాయకులు డీసీసీబీ చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నారు. వీరిలో ఎవరికి పీఠం దక్కనుందో, సీల్డ్‌ కవర్‌లో అధిష్టానం ఎవరి పేరు సూచించిందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. డీసీసీబీ చైర్మన్‌ పీఠం నిజామాబాద్‌ జిల్లాకు ఇస్తే.. డీసీఎంఎస్‌ కామారెడ్డి జిల్లాకు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇరు జిల్లాలకు చెరో పదవిని పంపిణీ చేయాలనే నిర్ణయం జరిగినట్లు తెలిసింది. సహకార ఎన్నికల మొదలు.. డీసీసీబీ చైర్మన్‌ ప్రక్రియ ముగిసే వరకు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అంతా తానై సమన్వయం చేస్తూ వస్తున్నారు. డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక అదే కార్యాలయంలోని కొత్త భవనంలో, డీసీఎంఎస్‌ చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక డీసీఎంఎస్‌ కార్యాలయంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. logo