బుధవారం 27 మే 2020
Nizamabad - Feb 20, 2020 , 02:37:09

ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర

ఉమ్మడి జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర


నిజామాబాద్‌/ నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేసే పనులను పూర్తి చేయిస్తూ రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ముందుకు సాగుతున్నారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలు వ్యవసాయాధారమైన జిల్లాలు కాబట్టి వాటికి ముందుగా సాగునీటి వసతి కల్పించడం ప్రధానమని గుర్తించిన మంత్రి ఈ రెండు జిల్లాల్లో సాగునీటి రంగ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్ర మంత్రి గా బాధ్యతలు స్వీకరించి బుధవారం నాటికి ఏడాది కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు వేముల ప్రశాంత్‌రెడ్డి. జిల్లా అభివృద్ధితో పాటు పార్టీ పరమైన బాధ్యతల్లో, ఎన్నికల బాధ్యతల్లో కీలకంగా పని చేశారు. జిల్లా పాలనపై తనదైన ముద్ర వేసుకున్నారు.


తండ్రి ఆశయాలతో.. కేసీఆర్‌ అడుగుజాడల్లో.. 

తన తండి వేముల ప్రశాంత్‌రెడ్డి అడుగుజాడల్లో నడిచి, ఉద్యమ నేత కేసీఆర్‌ దిశానిర్దేశంలో ఉద్యమకారుడిగా టీఆర్‌ఎస్‌ శ్రేణులతో కలిసి పనిచేసిన వేముల ప్రశాంత్‌ రెడ్డి 2014లో బాల్కొండ నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అత్యంత విశ్వసనీయుడిగా పని చేస్తూ మిషన్‌ భగీరథ వైస్‌ చైర్మన్‌ బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తించారు. 2019లో రెండోసారి బాల్కొండ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారి కూడా జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి జిల్లాలోని ఎస్సారెస్పీకి పూర్వ వైభవం కల్పించే ఎస్సారెస్పీ పునరుజ్జీవం పథకం పనులు జరుగుతున్నాయి. ఈ పనులను వేగంగా పూర్తి చేయించే బాధ్యతను సీఎం కేసీఆర్‌  ఆదేశంతో భుజాన వేసుకున్నారు మంత్రి. పనులను స్వయంగా పరిశీలిస్తూ, అధికారులకు దిశానిర్దేశం చేస్తూ పనులను వేగంగా పూర్తి చేయించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే కేసీఆర్‌ సహకారంతో పునరుజ్జీవం పనులు పూర్తి చేయించి కాళేశ్వరం జలాలను ఎస్సారెస్పీ గడపను ముద్దాడేలా చేశారు.


తర్వాతి మిషన్‌ ప్యాకేజీ 21..

ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి కాళేశ్వరం జలాలను తొందరగా అందించడం ఎంతో అవసరమని గుర్తించిన మంత్రి కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీ గడపకు చేరిన వెంటనే ఇక తన తర్వాత మిషన్‌ ప్యాకేజీ-21, 22 పనులను పూర్తి చేయించడమని ప్రకటించారు. నిజామాబాద్‌ జిల్లాలోని బాల్కొండ, నిజామాబాద్‌ రూరల్‌, ఆర్మూర్‌ నియోజకవర్గాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాలకు సాగునీటిని అందించే ప్యాకేజీ-21, ప్యాకేజీ-22 పనులను అప్పటికే తరచూ సందర్శిస్తూ, పనుల ప్రగతిని సమీక్షిస్తూ పనుల్లో వేగం పెంచారు. అనంతరం సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌తో పనులను పరిశీలింపజేశారు. దీంతో పనులు పరుగులు పెట్టాయి.


సమన్వయం.. సక్సెస్‌ మంత్ర.. 

ఉమ్మడి జిల్లాలో పరిపాలనా, అభివృద్ధి పనులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించారు. కీలకమైన పల్లె ప్రగతి కార్యక్రమం పక్కాగా అమలయ్యేలా కృషి చేశారు. పెండింగ్‌ రోడ్లకు, వర్షాలతో పాడైన రోడ్లను బాగు చేయడానికి భారీగా నిధులు మంజూరు చేశారు. నూతనంగా రూ.40 కోట్లతో చేపట్టిన నిజామాబాద్‌ కలెక్టరేట్‌ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయిస్తుండడంలో కృషి చేస్తున్నారు. పంట ధాన్యాల కొనుగోలుపై ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు, ఆదేశాలు ఇస్తూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూశారు.


పార్టీ పటిష్టతకు తనదైన కృషి..

పార్టీ పటిష్టతకు, ఎన్నికల్లో విజయాలకు మంత్రి వేముల కృషి చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఘన విజయాలకూ కృషి చేశారు. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లాలో జడ్పీ చైర్మన్‌, మేయర్‌ పదవుల కైవసంలో కీలకంగా వ్యవహరించారు. నిజామాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయిస్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గంలో పార్టీ ఘన విజయంలో మంత్రి పాత్ర కీలకమైంది. భీమ్‌గల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో మొత్తం స్థానాలు కైవసం చేసుకోవడంలో, సహకార ఎన్నికల్లో నియోజక వర్గంలో మొత్తానికి మొత్తం సొసైటీలను కైవసం చేసుకోవడంలో మంత్రిగా వేముల ప్రశాంత్‌రెడ్డి కృషి ఎంతో ఉంది. డీసీసీబీ, డీసీఎంఎస్‌ చైర్మన్లు, డైరెక్టర్ల ఎన్నికల విషయంలో అంతా తానై వ్యవహరించారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసిన వారికి పదవులు దక్కేలా కేసీఆర్‌తో మాట్లాడి అందరికీ సమన్యాయం చేశారు. 


logo