మాక్లూర్, మే 21 ; జన్మనిచ్చిన ఊరి రుణం తీర్చుకోవాలని అందరూ అనుకుంటారు. తమ వంతు ఏదో ఒకటి చేయాలని ఆరాటపడుతుంటారు. కానీ, పరిస్థితుల కారణంగా కొందరే ముందడుగు వేస్తారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలుస్తున్నారు బిగాల సోదరులు. తాము పుట్టిన ఊరు మాక్లూర్ ప్రగతికి బాటలు వేస్తున్నారు. తాత, నానమ్మ, తండ్రి పేరిట సేవలందిస్తున్నారు. తాజాగా సుమారు రూ.2కోట్లతో నూతన ఆలయాలను నిర్మించగా నేటి నుంచి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించనున్నారు.
ఊరు తమకు చాలా ఇచ్చింది.. కొంచెమైనా తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా , బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై సెల్ కన్వీనర్ బిగాల మహేశ్ గుప్తా. సొంతూరైన మండల కేంద్రం మాక్లూర్‌కు సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. మాక్లూర్‌లో శిథిలావస్థకు చేరిన రుక్మిణీ సహిత పాండురంగ విఠలేశ్వర స్వామి, హన్మాన్ ఆలయాలను తండ్రి బిగాల కృష్ణమూర్తి జ్ఞాపకార్థం రూ.2కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ ఆలయాల పక్కనే బిగాల కుటుంబానికి ఇష్టదైవమైన శ్రీ అయ్యప్ప స్వామి మందిరాన్ని కూడా నిర్మించారు. ఈ ఆలయాల ప్రారంభంతోపాటు విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు నేటి నుంచి మూడు రోజులపాటు వైభవంగా నిర్వహించనున్నారు.
తండ్రి సంకల్పాన్ని నెరవేర్చిన తనయులు..
బిగాల కృష్ణమూర్తి సంకల్పాన్ని తనయులు బిగాల గణేశ్ గుప్తా, మహేశ్ గుప్తా నెరవేర్చారు. రెండు దశాబ్దాలుగా ఆలయాల పునర్నిర్మాణం చేపట్టాలని ఎంత అనుకున్నా ఏదో ఒక ఆటంకంతో నిలిచిపోయాయి. కాగా అయ్యప్ప ఆశీస్సులతోనే తాము ఈ స్థాయికి చేరామని, ఆలయాన్ని కట్టించాలని తండ్రి బిగాల కృష్ణమూర్తి తరచూ కుమారులతో చెబుతుండేవాడు. అయ్యప్ప ఆలయంతోపాటు రుక్మిణీ సహిత పాండురంగ విఠలేశ్వర స్వామి, హన్మాన్ ఆలయాలను కూడా నిర్మించాలని తరచూ గ్రామస్తులు, సన్నిహితులు, కుటుంబసభ్యులతో కృష్ణమూర్తి అంటుండేవారు. రెండేండ్ల క్రితం బిగాల కృష్ణమూర్తి అకాల మరణం చెందారు. ఆయన చివరి కోరికగా ఆలయాల నిర్మాణాన్ని రూ.2కోట్లు వెచ్చించి పూర్తి చేశారు.
సమాజ సేవలో ముందు..
తాత బిగాల గంగారాం పేరుతో ప్రభుత్వ పాఠశాల నిర్మాణం, నానమ్మ బిగాల రాంబాయి పేరుతో తెలంగాణలో ఎక్కడాలేని విధంగా వైకుంఠధామంలో సౌకర్యాలు, నాన్న బిగాల కృష్ణమూర్తి పేరుతో ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. పేద పిల్లలకు స్కాలర్షిప్లు, ఆర్థిక సహాయం అందజేస్తున్నారు. తమను ఇంతటి స్థాయికి తీసుకువచ్చిన ఊరికి కొంతైనా తిరిగి ఇవ్వాలనే సంకల్పంతో ఇరువురు సోదరులు మాక్లూర్‌లో ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.
పూజా కార్యక్రమాల వివరాలు..
22న గణపతి పూజ, ధ్వజారోహణం, జలాధివాసం, యంత్రశుద్ధి, తీర్థప్రసాద వితరణ, 23న హోమం, అభిషేకాలు, దేవతల హవనం, స్థాపిత దేవతల ప్రాతఃకాల పూజలు, సాయంత్రం పూజలు, అధివాస హోమాలు, ఫల, పుష్ప, తీర్థప్రసాద వితరణ, రాత్రి 7గంటల నుంచి జగద్గురు హంపీ విద్యారణ్య భారతీ స్వామి అనుగ్రహ భాషణం, 24న ఉదయం గణపతిపూజ, విగ్రహా స్థిర ప్రతిష్ఠాపన కార్యక్రమాలు హంపీ పీఠాధిపతి నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు.
కలిసికట్టుగా పనిచేస్తున్నాం..
మూడు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలకు గ్రామస్తులందరూ కలిసికట్టుగా కృషి చేస్తున్నాం. ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఏర్పాట్లు చేశారు. గ్రామంతోపాటు చుట్టు పక్కల గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ఆహ్వాన పత్రికలు అందజేశాం. ఉత్సవాల్లో జీపీ పాలకవర్గం, వీడీసీ సభ్యులు, స్వాధ్యాయ పరివారం, భజనమండలి సభ్యులు , గ్రామస్తులు పాలుపంచుకుంటూ విజయవంతానికి కృషి చేస్తున్నాం.
–అశోక్‌రావు, సర్పంచ్, మాక్లూర్
నాన్న సంకల్పంతోనే..
ఆలయాలను నిర్మించాలన్నది మా నాన్న కృష్ణమూర్తి సంకల్పం. ఆయన సంకల్పంతోనే మూడు ఆలయాలను పునర్నిర్మించాం. మేము అయ్యప్ప భక్తులం. మా నాన్న 25ఏండ్లు అయ్యప్ప మాల వేశారు. నేను ,మా సోదరుడు బిగాల మహేశ్ కూడా ఆయ్యప్ప మాల వేశాం. ఆయన ఆశీస్సులతోనే ఈస్థాయికి చేరుకున్నాం. మా నాన్న సంకల్పం నెరవేరడం ఆనందంగా ఉంది. ఊరు మాకు ఎంతో ఇచ్చింది. ఊరి కోసం కొంతైనా ఇవ్వాలన్నదే మా ధ్యేయం.
– బిగాల గణేశ్ గుప్తా, ఎమ్మెల్యే