నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 27: బీఆర్ఎస్ హయాంలో పదేండ్లు ఆనందంగా ఉన్న రైతులను ఏడాదికాలంగా కష్టాలు వెంటాడుతున్నాయి. రైతాంగానికి అబద్ధపు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వ్యవ‘సాయం’పై నిర్లక్ష్యం వహించింది. రైతులకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కర్షకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నది.
పంట పెట్టుబడి సాయం అందించడంలో సర్కార్ తాత్సారం చేయడంతో ఏం చేయాలో తెలియక రైతన్న దిగాలు చెందుతున్నాడు. ఒకవైపు అప్పుల బాధలు, బ్యాంకు అధికారుల వేధింపులు మరోవైపు ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడం, సమయానికి పంట పెట్టుబడి సాయం అందించకపోవడంతో రైతన్న చితికిపోతున్నాడు. వ్యవసాయం భారమై, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, సర్కారు సాయం అందక బలవన్మరణమే శరణ్యమని ప్రాణాలు వదులుతున్నాడు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 15 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.
గుండె చెదిరి ప్రాణాలను వదిలిన రైతుకుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. నాలుగురోజుల క్రితం నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌లో రైతు ఆత్మహత్యలు, వ్యవసాయ సంక్షోభంపై మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన రైతు అధ్యయన కమిటీ పర్యటించింది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిటీ సభ్యులు తెలుసుకున్నారు. రైతాంగం సమస్యలను పరిష్కరించేవరకూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదని అధ్యయన కమిటీ స్పష్టంచేసి, అండగా ఉంటామని కర్షకుల్లో భరోసా నింపింది.
రైతు అధ్యయన కమిటీ సభ్యులకు రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఏడాదికాలంగా పడుతున్న ఇబ్బందులను తెలియజేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మి ఓటు వేశామని, ఇప్పుడు మోసపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు భరోసా రూ.15వేలు అని చెప్పి, ఇప్పుడేమో రూ.12వేలు అంటూ మాట తప్పారన్నారు.
అదికూడా టైంకు ఇవ్వకపోవడంతో అప్పులు చేసి సాగుచేస్తున్నామని వాపోయారు. జిల్లాలో రుణమాఫీ కూడా అందరికీ చేయలేదని, సగం మందికిలోపే చేశారని అన్నారు. ధాన్యాన్ని విక్రయించడానికి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. కేసీఆర్ పాలనలో ఆనందంగా ఉన్నామని, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల ఫలాలు సమయానికి అందకపోవడంతోనే అన్నదాతలు ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు అభిప్రాయాలు వ్యక్తంచేశారు
బాల్కొండ, జనవరి 27 : రైతుభరోసా ఇస్తమని చెప్పి ఇస్తలేరు. ఇప్పటికైనా రైతులందరికీ ఇవ్వాలి. అప్పుడే రూ.10వేలు అంటరు, మళ్లీ రూ.12వేలు అంటరు. రూ.15 వేలు ఇస్తమని హామీ ఇచ్చి ఇస్తలేరు. ఇప్పటికైనా రైతుభరోసా అందరికీ ఇవ్వాలి.
-రాజేందర్, దూద్గాం, బాల్కొండ
రైతులను మోసం చేసిన ప్రభుత్వం చరిత్రలో ఎప్పుడూ బాగుపడలేదు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆ పార్టీకి రైతులు ఓటేసినందుకు ఇప్పుడు బాధపడుతున్నారు. మళ్లీ పదేండ్ల క్రితంనాటి గోస అనుభవిస్తున్నాం. రైతుబంధు వస్తలేదు. పండిన పంట కొంటలేరు. పెట్టుబడి కోసం వ్యాపారుల దగ్గరికిపోతే వడ్డీ అడుగుతున్నారు. లేదంటే కేసీఆర్ ఉన్నప్పుడు మేమే ధర నిర్ణయించేటోళ్లం. ఇప్పుడు వ్యాపారులే ధర నిర్ణయించే పరిస్థితి వచ్చింది.
– మహిపాల్, నాగపూర్, బాల్కొండ
భీమ్‌గల్, జనవరి 27 : నేను బ్యాంకులో రూ. 84వేల లోన్ తీసుకున్న. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తున్నదని భరోసాతో ఉన్న. కానీ డబ్బులు మాఫీ కాలేదు. నా ఇం టికి బ్యాంకు వారు వచ్చి నన్ను లోన్ డబ్బులు కట్టమని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. జూన్ 12వ తేదీన లోన్ డబ్బులు కట్టిన. రుణమాఫీ జూన్ 18 నాడు అయ్యింది. బ్యాం కుకెళ్లి అడిగితే నీ డబ్బులు వచ్చి వాపస్ పోయినయి అన్నారు. ఆఫీసుల చుట్ట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన. నువ్వు కట్టి న నీ రుణం మాఫీ అయితదని బ్యాంకు వారు మోసం చేసిం డ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సకాలంలో డబ్బులు ఖాతాలో వేయక నేను నమ్మి మోస పోయిన.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో రైతులు నానా కష్టాలు పడాల్సి వస్తున్నది. గత ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో మాకు మోటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తలేదు. మోటర్లు కాలిపోవడం కూడా జరగలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో మోటర్లు కాలిపోయి రిపేర్ల కోసమని, మళ్లీ అధికారుల చుట్టూ తిరగాల్సి వస్తున్నది.
– అశోక్, కిసాన్‌నగర్, బాల్కొండ మండలం
కాంగ్రెస్ చేసిన మోసాలపై అన్ని గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఒక్క ఏడాదిలోనే కాంగ్రెస్ సర్కారుపై వ్యతిరేకత పెరిగింది. కాంగ్రెస్ మాటలకు మోసపోయినం. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయ్. మళ్లీ పథకాలంటూ నాటకాలు ఆడుతున్నారు. మళ్లీ మోసపోం. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను నిలదీస్తాం. తగిన బుద్ధి చెప్తాం.
*కేసీఆర్ సర్కార్ అన్ని అందుబాటులో ఉంచేది
పంట మొదలుపెట్టే సమయంలోనే అన్ని సౌకర్యాల ను అందుబాటులో ఉంచేది. పంట కోతకు వచ్చే వర కు అధికారులను ఎల్లవేళలా అందుబాటులో ఉంచేవారు. కానీ ఇప్పుడు అధికారులు సమయానికి రావడంలేదు, మాకు సలహాలు ఇవ్వడంలేదు. రైతులను విస్మరించిన ప్రభుత్వం ఎన్నటికీ నిలబడదు.
కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలు నమ్మి మోసపోయినం. నాకు రూ. 20వేల రుణ మాఫీ అయ్యింది. కానీ ఇందులో రూ. 1304 కడితేనే నాకు పాసు పుస్తకాలు ఇస్తామన్నారు. ఇదేనా రుణమాఫీ. నమ్మిన మమ్మల్ని నట్టేట ముంచారు. రుణం కావాలని పొతే బ్యాంకులు ఇయ్య కుండా తిప్పుతున్నాయి
-కుంట దశాగౌడ్, రైతు, బాబానగర్
కౌలు రైతులకు కూడా కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా ఇస్తామని చెప్పింది. ఇవ్వకుండా కౌలు రైతులను మోసం చేసింది. రైతు భరోసా ఎకరానికి రూ.15వేలు అని చెప్పి చేతులు ఎత్తేసిండు. రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపించుకుంటే రైతులను నట్టేట ముంచిండు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది ఒకటి, చేస్తున్నది మరొకటి. దేనికీ పొంతనలేకుండా పోయింది.
-గాంధీ, రైతు, పురాణీపేట్, భీమ్‌గల్ మండలం
రైతు భరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఎగొట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలకు, చేస్తున్న పనులకు సంబంధంలేదు. రైతులకు ముచ్చట్లు చెప్పి మోసం చేసింది రేవంత్ రెడ్డి సర్కారు. రోజులు చెబుతూ కాలం గడుపుతున్నారు. రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మరు.
-తోగిటి అరుణ్, రైతు, భీమ్‌గల్