రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లే కీలకం కానున్నారు. వారే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించనున్నారు. యువజనులు ఎవరివైపు మొగ్గితే ఆ నాయకులే గెలుపుతీరాలకు చేరనున్నారు. కామారెడ్డి జిల్లాలో యువ ఓటర్ల సంఖ్యే అత్యధికంగా ఉంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో మొత్తం ఓటర్ల్లు 6,61,163 మంది ఉండగా, అందులో యువజనులే సగానికి పైగా ఉన్నారు. 18 నుంచి 40 ఏండ్లలోపు వారి సంఖ్య 3,43,396 కావడం గమనార్హం. వీరే రాజకీయ నేతల తలరాతను తిరగ రాయనున్నారు. మరోవైపు, మహిళలు సైతం నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారు. జిల్లాలో పురుష ఓటర్ల (3,21,104) కన్నా మహిళా ఓటర్లే (3,40,022) ఎక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా పార్టీలు యువతతో పాటు మహిళలను ప్రసన్నం చేసుకోవడంపై దృష్టి సారించాయి. కీలకమైన మహిళలు, యువకుల మద్దతు తమకే అంటూ అన్ని పార్టీలు చెప్పుకుంటున్నా, బీఆర్ఎస్ పార్టీ అందరి కన్నా ముందున్నది. మరోవైపు, జిల్లాలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య కూడా అధికంగానే ఉన్నది. వందేళ్లకు పైబడిన 312 మంది.. వచ్చే ఎన్నికల్లో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
కామారెడ్డి, అక్టోబర్ 12 : ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు వజ్రాయుధం లాంటిది. దేశాభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేసేవారిని ఎన్నుకోవడానికి ఓటు ఒక చక్కటి మార్గంగా పనిచేస్తుంది. ఓటు హక్కును పొందడానికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ అర్హులే. అర్హులైన వారు ఓటు హక్కు పొందడానికి ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. చదువుకున్న యువత సకాలంలో ఓటు హక్కు పొందితే దీనికి మరింత సార్థకత చేకూరుతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు పొందేలా ఎన్నికల సంఘం కృషి చేస్తున్నది. దేశంలో పార్లమెంట్, శాసనసభలకు ఐదేండ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 1980 వరకు వయోజనుల ఓటు హక్కు 21 ఏండ్లుగా ఉండేది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఓటుహక్కును 18 ఏండ్లకు కుదించారు.అప్పటి నుంచి 18 ఏండ్లకు ఓటు హక్కు కల్పించింది రాజ్యాంగం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం వచ్చింది.
జిల్లావ్యాప్తంగా 6,61,163 ఓటర్లు..
కామారెడ్డి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం తుది జాబితాను విడుదల చేసింది. తుది జాబితాలో 6,61,163 ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 3,21,104, స్త్రీలు 3,40,022 మంది ఉన్నారు. ఇతరులు 37 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే కొత్త ఓటర్లు ఓటు హక్కు నమోదుకు ఈ నెల 31వ తేదీ వరకు ఎన్నికల సంఘం గడువు విధించింది. నామినేషన్ల స్వీకరణకు పది రోజుల ముందు వరకు ఓటర్లు దరఖాస్తు చేసుకుంనేందుకు అవకాశం కల్పించింది. తుది జాబితాను ఓటర్ల వయస్సుల వారీగా విశ్లేషిస్తే.. మధ్య వయస్సు వారే ఎన్నికల్లో కీలకం కానున్నారు.
యువ ఓటర్లే కీలకం..
జిల్లావ్యాప్తంగా కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్ మూడు నియోజకవర్గ యువ ఓటర్లు కీలకం కానున్నారు. 18 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఓటర్లు 20,380 మంది, 20 నుంచి 29 సంవత్సరాల వయస్సు ఓటర్లు 1,37,463, 30 నుంచి 39 సంవత్సరాల ఓటర్లు 1,85,553, 40 నుంచి 49 వయస్సు ఓటర్లు 1,22,682, 50 నుంచి 59 వయస్సు ఓటర్లు 96,330, 60 నుంచి 69 వయస్సు ఓటర్లు 13,394, 70 నుంచి 79 వయస్సు ఓటర్లు 30,879, 80 నుంచి 89 వయస్సు ఓటర్లు 7,559 మంది, 90 నుంచి 99 వయస్సు ఓటర్లు 1,219, 100 నుంచి 109 ఏండ్ల మధ్య వయస్సు ఉన్న వారు 61 మంది ఓటర్లు, 120 ఏండ్లు పైబడిన వారు 251 మంది ఉన్నారు. ఇందులో కామారెడ్డి నియోజకవర్గంలో 234 మంది ఓటర్లు, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 16 మంది ఓటర్లు, జుక్కల్ నియోజకవర్గంలో ఒకరు ఉన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 6,61,163 ఓటర్లు ఉన్నారు.
30 ఏండ్లు దాటిన ఓటర్లలో మహిళలే అధికం…
జిల్లావ్యాప్తంగా 30 నుంచి 39 ఏండ్లు దాటిన ఓటర్లలో అధికంగా మహిళలే ఉన్నారు. ఇందులో మొత్తం 66,189 మంది ఓటర్లు ఉండగా.. 32,230 ఓటర్లు,మహిళలు 33,953 మంది ఉన్నారు. 18-19 ఏండ్ల మధ్య పురుషులు 12,039 మంది, మహిళలు 8,339 మంది ఓటర్లు ఉన్నారు. 120 ఏండ్లు దాటిన ఓటర్లలో పురుషులు 115 మంది, మహిళలు 135 మంది, ఇతరులు ఒకరు ఉన్నారు.