రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది గడుస్తున్నది. మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరికీ అమాత్యయోగం కలుగలేదు. తర్వాత మంత్రి వర్గ విస్తరణ రేపు మాపు ఉంటుందంటూ ఏడాదికాలంగా వినిపిస్తున్నా..ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా లేదు. దీంతో ఉమ్మడి జిల్లాకు పెద్ద దిక్కులేకుండా పోయింది. నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్నప్పటికీ ఎవరికీ మంత్రివర్గంలో స్థానం లభించలేదు. అసలు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా అనేది జవాబు లేని ప్రశ్నగా మిగిలింది. మంత్రి పదవిపై ఎమ్మెల్యేలు ఎన్నో ఆశలు పెట్టుకోగా.. సాగదీత పరిస్థితిలో రోజుకొకరు తెర మీదకు వస్తున్నారు. రేసులో నేనున్నానంటూ ముందుకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డికే మంత్రి యోగం తథ్యమన్న సంకేతాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. పెద్దాయనకే అమాత్య యోగం దక్కుతుందని అంతా అనుకుంటున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమేనంటూ సుదర్శన్ రెడ్డి కూడా అనేక సందర్భాల్లో చెప్పుకుంటున్నప్పటికీ ఎప్పుడన్నది తెలియడంలేదు. త్వరలో మంత్రివర్గ విస్తరణ అంటూ వార్తలు వస్తుండడం..టీవీ సీరియల్‌ను తలపిస్తున్నాయని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుకోవడం గమనార్హం.
-నిజామాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంత్రి పదవిని ఆశిస్తున్న వారంతా కళ్లలో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ లీడర్లు తీవ్రంగా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాదిగా ఇదే విషయమై ఢిల్లీ దాకా పైరవీలు చేస్తున్నారు. రోజుకొకరు తెర మీదికి వచ్చి మంత్రి పదవిని ఆశిస్తున్న నేపథ్యంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్నది. ఆశావహుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
ఆశించడం తప్పేం కాదన్నట్లుగా ఏఐసీసీ దాకా మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు కాని వారు కూడా దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. దీంతో మొదటి జాబితాలోనే పేరున్న వారిలో ఈ కొత్త పరిణామాలు ఒకింత ఇబ్బందికి గురి చేస్తున్నాయి. చూస్తుండగానే ఏడాది కాలం కరిగి పోయింది. ఏ పదవీ లేకుండానే ఎమ్మెల్యేగానే కొనసాగుతుండడంతో జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేకు సైతం మింగుడు పడటం లేదు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలోనే ఇదే తనకు చివరి ఎన్నికలుగా సుదర్శన్ రెడ్డి ప్రకటించుకున్నారు.
ప్రభుత్వం వస్తే పదవి గ్యారంటీ అని మొదట్నుంచి ఆశిస్తూ వస్తున్నారు. కానీ అందుకు విరుద్ధమైన పరిస్థితి ఇప్పుడు ఎదురవుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వాస్తవానికి సుదర్శన్ రెడ్డికి ఎవ్వరూ పోటీ లేరు. గెలిచిన నలుగురు ఎమ్మెల్యేల్లో సీనియారిటీ, కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా ఆయనకే అర్హతలు ఉన్నాయి. అయినప్పటికీ మంత్రి పదవి విషయంలో మాజీ మంత్రికి పేచీలు వెంటాడుతున్నాయి. ఎందుకు? ఎవరు? అడ్డు తగులుతున్నారో కూడా తెలియని అయోమయ పరిస్థితిలో ఆయన కొట్టుమిట్టాడుతున్నారు.
కొద్ది కాలం క్రితం వరకు మంత్రి పదవి వచ్చేస్తుందనుకుని దూకుడు ప్రదర్శించారు. ఉమ్మడి జిల్లా ప్రభుత్వ యంత్రాంగంతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించి హల్చల్ చేశారు. తీరా మంత్రి వర్గ విస్తరణలో జాప్యంతో కినుక వహించి అంటి ముట్టనట్లుగానే ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుదర్శన్ రెడ్డి అనుచరవర్గం సైతం ఈ విషయంలో ఒకింత అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ జిల్లాలో బోధన్, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. వీరిలో భూపతి రెడ్డి తొలిసారి చట్ట సభకు ఎన్నికయ్యారు. గతంలో ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉన్నప్పటికీ ఇప్పుడు నేరుగా శాసనసభలో అడుగు పెట్టారు. ఇక బోధన్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో ఇద్దరు నేతలు మంత్రి పదవి కోసం విన్నపాలు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా నుంచి ఎల్లారెడ్డి, జుక్కల్ శాసనసభ్యులు ఇరువురు తొలిసారి అసెంబ్లీకి ఎన్నుకోబడ్డారు.
ఏఐసీసీ అండదండలతో మదన్ మోహన్‌రావు తీవ్రంగా పైరవీ చేసుకుంటున్నాడు. తాజాగా తన అనుచరులు సదాశివనగర్‌లో మంత్రి పదవి ఇవ్వాలంటూ పాదయాత్ర చేసి నిరసన తెలిపారు. మదన్ మోహన్ రావు చర్యలతో కాంగ్రెస్ పార్టీలో దుమారం రేగుతోంది. తనకే మంత్రి పదవి ఖాయమని భావిస్తున్న సుదర్శన్ రెడ్డికి బహిరంగంగానే మదన్ మోహన్ రావు రూపంలో పోటీ ఏర్పడింది. ఇద్దరూ అమాత్య యోగం కోసం ఏడాదిగా ఎవరికి వారు పైరవీ చేసుకుంటున్నారు. వీరికి తోడుగా జుక్కల్ ఎమ్మెల్యే సైతం తనకున్న ప్రాబల్యాన్ని ఇందుకోసం వాడుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతున్నది.
ఏకంగా దళిత సామాజిక వర్గం కోటాలో మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఇలా ఎవరికి వారు మంత్రి పదవి కోసం తలబడుతుండడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. 2024 సంక్రాంతి నుంచి మొదలైన ఈ పోటీ 2025 సంక్రాంతి వస్తున్నా ముగింపు కార్డు మాత్రం పడలేదు. 2023, డిసెంబర్ 7న పది మంది మంత్రులతో కలిసి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తదనంతరం రేపు మాపు అంటూ వాయిదాలు మినహా ఆశావహులకు భరోసా దక్కడం లేదు.
పీసీసీ చీఫ్‌గా పార్టీ పదవిని దక్కించుకున్న మహేశ్‌కుమార్ గౌడ్ సైతం బీసీ కోటాలో మంత్రి పదవి అడిగినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. షబ్బీర్ అలీ సైతం తన చివరి రాజకీయ మజిలీలో మంత్రి యోగం కోసం మైనార్టీ కోటాలో పట్టుబడుతున్నాడు. మొత్తానికి ఉమ్మడి జిల్లా రాజకీయాలను ప్రభావితం చేసే మంత్రి పదవి కోసం కాంగ్రెస్‌లో భారీగా పోటీ నెలకొంది. కొద్ది రోజుల్లోనే ఈ ప్రాంతానికి మంత్రి పదవికి ఎవరికైనా దక్కుతుందా? లేదంటే వాయిదాల పర్వమే ఉంటుందా? అన్నది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.