కమ్మర్పల్లి, ఆగస్టు 9 : ఎస్సారెస్పీ నిర్మాణం జరిగిన నాటి నుంచి ప్రాజెక్టు పరిస్థితి ఒక ఏడాది అతివృష్టి మరో ఏడాది అనావృష్టి అన్న చందగా సాగుతూ వచ్చింది. దశాబ్దాల ఈ దుస్థితికి పరిష్కారం కోసం సంకల్పించారు సీఎం కేసీఆర్. ఎస్సారెస్పీకి నీటి లభ్యత కోసం ఏదైనా చేయాలన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తపనకు కేసీఆర్ ఆలోచనలు రూపమిచ్చాయి. ప్రాజెక్టుకు కాళేశ్వరం జలాలతో పునర్జీవం పోయాలని సంకల్పించారు. రూ.వెయ్యి కోట్లతో ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి రూపకల్పన చేశారు. ప్రాజెక్టు నుంచి 300 కిలో మీటర్ల దూరంలోని కాళేశ్వరం జలాలను వరద కాలువ ద్వారా ఎదురెక్కించి ఎస్సారెస్పీ నింపేలా రివర్స్ పంపింగ్ పథకాన్ని డిజైన్ చేశారు. 2017 ఆగస్టు 2న అప్పటి నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి ఎస్సారెస్పీని సందర్శించి పరిశీలించారు. ఎస్సారెస్పీకి భరోసా కల్పించేందుకు కేసీఆర్ పునరుజ్జీవ పథకాన్ని చేపట్టనున్నట్లు ఆ రోజే మంత్రి హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు.
పునరుజ్జీవ పథకం ఇలా
ఎస్సారెస్పీలో నీరు లేనప్పుడు కాళేశ్వరం నుంచి రోజుకు ఒక టీఎంసీ చొప్పున 60 టీఎంసీలను రిజర్వాయర్‌కు వరద కాలువ ద్వారా ఎగువకు తరలించేలా రివర్స్ పంపింగ్ నిర్మాణాన్ని డిజైన్ చేశారు. కాళేశ్వరం నీటిని వరద కాలువలోకి తరలించి కాలువలో భారీ పంపు హౌస్‌లను నిర్మించి ఎగువకు ఎత్తిపోసేలా రివర్స్ పంపింగ్ పథకాన్ని రూపొందించారు. ఇందులో భాగంగా వరద కాలువలో 73వ కిలోమీటర్ వద్ద జగిత్యాల జిల్లా రాంపూర్ వద్ద మొదటి పంపుహౌస్‌ను, 34వ కిలో మీటరు వద్ద ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్ రావు పేట్ వద్ద రెండో పంపుహౌస్‌ను, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ వద్ద ఎస్సారెస్పీ వద్ద వరద కాలువ జీరో పాయింట్ వద్ద మూడో పంపుహౌస్‌ను నిర్మించారు. వీటి ద్వారా వరద కాలువకు 2019 నుంచి నీటి విడుదల జరుగుతున్నది. తొలిసారిగా కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీ గడపకు చేరినప్పుడు మంత్రి వేముల పూజలు చేసి వరద కాలువ వెంట స్వయంగా కారు నడుపుతూ కలియదిరిగి సంబుర పడ్డారు.
ప్రాజెక్టు కింద అవసరాలు తీరేలా..
స్టేజీ-1 కింద 9.68 లక్షలు, స్టేజీ-2 కింద 5 లక్షల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ప్రాజెక్టు ఎగువన నీటి లభ్యత తగ్గి పోవడం..పూడిక కారణంగా అప్పటికే గడిచిన 20 సంవత్సరాల్లో 90 టీఎంసీల సామర్థ్యానికి తగ్గిపోయింది. సాగు, తాగు నీటి అవసరాలకు మొత్తం 123 టీఎంసీల నీటి డిమాండ్ ప్రాజెక్టు నుంచి ఉన్న పరిస్థితి. ఈ డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఎస్సారెస్సీకి కాళేశ్వరం జలాలు అందించేలా పునరుజ్జీవ పథకం తెచ్చారు.
వరద కాలువకు జల జీవం
బీడు వారిన భూములను తలపిస్తూ వృథాగా కనిపించే ఎస్సారెస్పీ వరద కాలువకు పునరుజ్జీవ పథకంతో నిత్య జీవం వచ్చింది. దీంతో వరద కాలువ కింద వేలాది ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు పంటలకు సాగు నీరు అందుతున్నది.
మరుపు రాని జన జాతర
ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకానికి 2017 ఆగస్టు 10 న శంకుస్థాపన చేసిన రోజు ఎస్సారెస్సీలో ఆవిష్కృతమైన జన జాతర దృశ్యం మరుపు రానిది. ఎస్సారెస్పీకి పునరుజ్జీవం పోసే పథకం కావడంతో ఆనాడు ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాల నుంచి జనం లక్షల్లో తరలివచ్చారు. వారి ఆశలు తీరుస్తూ, ఎస్సారెస్సీకి భరోసానిస్తూ నేడు పునరుజ్జీవ పథకం సేవలు అందిస్తున్నది.