ఆర్మూర్, మే 7 : ఆకాల వర్షాలతో పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు ప్రభుత్వం అండగా ఉంటుందని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. మండలంలో దెబ్బతిన్న పంటలను ఆదివారం పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. వంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు అధైర్య పడొద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందన్నారు.
ఇది రైతు ప్రభుత్వమని, అన్నదాతలకు కష్టమొస్తే తనకొచ్చినట్లేనని భావించి సీఎం కేసీఆర్.. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటారని జీవన్‌రెడ్డి తెలిపారు. అన్నదాలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. రైతు కష్టాలను దూరం చేసేందుకు తానున్నానంటూ భరోసా కల్పించారు. కార్యక్రమంలో ఆర్మూర్ ఎంపీపీ పస్క నర్సయ్య, కౌన్సిలర్లు రవి గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పూజా నరేందర్, సీనియర్ నాయకుడు పండిత్ పవన్ పాల్గొన్నారు.