e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home కామారెడ్డి కుండపోత

కుండపోత

  • ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
  • వరద నీటిమళ్లింపు చర్యలు చేపట్టినఅధికారులు, ప్రజాప్రతినిధులు
  • 40 ఏండ్ల తరువాత నిండిన సుర్భిర్యాల్‌ అడ్డోడికుంట
  • ఆరేండ్లకు మత్తడి దుంకిన మోర్తాడ్‌లోని ముసలమ్మ చెరువు
  • వడ్యాట్‌-కమ్మర్‌పల్లి మధ్య తెగిన రోడ్డు

నమస్తే తెలంగాణ యంత్రాగం, జూలై 22 :జిల్లా వ్యాప్తంగా గురువారం జోరువాన కురిసింది. రెండు రోజులుగా వానలు కురుస్తుండడంతో వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని కాలనీలు చెరువులను తలపించాయి. పూలాంగ్‌వాగు ఉధృతంగా ప్రవహించింది. పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోని చెరువులు అలుగుపారుతున్నాయి. పలుచోట్ల బలహీనంగా మారిన చెరువు కట్టలు తెగిపోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పలు చోట్ల శిథిలావస్థలో ఉన్న ఇండ్లు కూలాయి. పంటపొలాలు నీట మునిగాయి. ధర్పల్లిలోని మాటుకాలువ కల్వర్టు వద్ద వరద ప్రవాహానికి అడ్డుగా పేరుకుపోయిన చెట్లను, ముళ్లపొదలను సర్పంచ్‌ ఆర్మూర్‌ పెద్దబాల్‌రాజ్‌ తొలగింపజేశారు. సిరికొండలోని దోండ్ల వాగు వంతెనపై నుంచి వరద ప్రవహించంతో భీమ్‌గల్‌ మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. మండలంలో 144.4మి.మీ వర్షపాతం నమోదైంది. జక్రాన్‌పల్లి మండలంలో 95.8మి.మీ. వర్షపాతం నమోదైంది. ధర్పల్లి మండలంలోని వాడి గ్రామశివారులలోని వాగు ఉధృతంగా ప్రహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మధ్యతరహా నీటి ప్రాజెక్టు అయిన రామడుగు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1278 అడుగులు కాగా ప్రస్తుతం 1264 అడుగుల వరకు నీటిమట్టం ఉందని ప్రాజెక్టు ఏఈ ప్రశాంత్‌ తెలిపారు.

మండలంలో 85.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్‌ జయంత్‌రెడ్డి తెలిపారు. మోపాల్‌ మండలం సిర్‌పూర్‌లో మూడు, కంజరలో ఒక ఇల్లు కూలిందని అధికారులు తెలిపారు. మంచిప్పలోని ఓ ఇంటిగోడ కూలింది.మోర్తాడ్‌లో 149 మి.మీ వర్షం కురిసినట్లు తహసీల్దార్‌ శ్రీధర్‌ తెలిపారు. మండలంలోని పెద్దవాగు, మొండివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆరేండ్ల తర్వాత ముసలమ్మ చెరువు అలుగుపారింది. మోర్తాడ్‌ మండలం శెట్‌పల్లి గ్రామానికి సమీపంలో ఉన్న ఊర చెరువులో ప్రమాదస్థాయిలో నీళ్లు చేరడంతో కట్టతెగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇరిగేషన్‌ అధికారులు కట్ట తెగిపోకుండా ముందు జాగ్రత్తగా కొద్దిగా కట్టను తొలగించి చెరువులో చేరిన నీరు దిగువకు వెళ్లిపోయేలా చేశారు. భీమ్‌గల్‌ పట్టణంలో పెంకుటిల్లు కూలింది. మొగిలి చెరువు కట్ట బలహీనంగా మారడంతో కమిషనర్‌ గంగాధర్‌ కట్టపై మొరం పోయించారు. మెండోరాలోని పెద్ద చెరువు 20, పురాణీపేట్‌లోని చెన్న చెరువులు 26 సంవత్సరాల తర్వాత పారుతున్నాయి.

- Advertisement -

వేల్పూర్‌ మండలం పడగల్‌ నవాబ్‌ చెరువు అలుగు పారుతుండడంతో రహదారి దెబ్బతిన్నది. మోతె గ్రామ సమీపంలో ఉన్న కప్పల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. నవాబ్‌ చెరువు అలుగు పారడంతో పడగల్‌ గ్రామానికి వెళ్లే దారి ధ్వంసం అయ్యింది. కమ్మర్‌పల్లి మండలం ఉప్లూర్‌లోని నల్ల చెరువు కట్ట కోతకు గురైంది. దమ్మన్నపేట్‌, నాగాపూర్‌ మధ్య వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచి పోయాయి. బోధన్‌ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, నీరు నిల్వకుండా మున్సిపల్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు. షర్బతీ కెనాల్‌, సాత్‌పూల్‌ ద్వారా నీరు ఉధృతంగా పారుతున్నది. పట్టణ శివారులోని పాండు చెరువు, చెక్కితలాబ్‌లు నీటితో నిండిపోయాయి. బోధన్‌- నిజామాబాద్‌ రహదారిలోని నర్సాపూర్‌ వాగులో నీరు ఉధృతంగా పారుతున్నది. గ్రామాల్లో పురాతన ఇండ్లు, నీరు చేరే ప్రాంతాల విషయంలో ప్రజలతోపాటు స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని బోధన్‌ ఆర్డీవో సోమ రాజేశ్వర్‌ సూచించారు.

జిల్లా అధికారుల ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రజలకు ఆశ్రయం కల్పించేందుకుగాను ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భవనాలు, పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా ఉపయోగించుకోవాల న్నారు. బోధన్‌ మండలం సాలూరా వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. నదిని ఆర్డీవో రాజేశ్వర్‌ గురువారం పరిశీలించారు. బోధన్‌ మండలంలోని కల్దుర్కి గ్రామం లో రెండు పాత ఇండ్లు కూలిపోయాయి. బోధన్‌లోని బీటీ నగర్‌లో ఉన్న లక్ష్మీనర్సింహస్వామి ఆల యం ప్రహరీ కూలిపోయింది. ఎడపల్లి మం డలంలోని అలీసాగర్‌ చెరు వు పూర్తిగా నిండిపోయిం ది. పులి చెరువు నిండుకుండలా మారగా మిగు లు నీరు ఫీడర్‌ ఛానల్‌ ద్వారా పెద్ద చెరువుకు చేరుతున్నది. నవీపేట మండలం యంచ వద్ద గోదావరి నది ఉధృతంగా పారుతున్నది. నిజామాబాద్‌ ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వచ్చి చేరడంతో జన్నేపల్లి బ్రిడ్జితోపాటు పెద్ద చెరువు అలుగు పొంగిపొర్లుతున్నది. రెంజల్‌ మండలం కందకుర్తి గ్రామ శివారులో గోదావరినది పరవళ్లు తొక్కుతున్నది.

కందకుర్తి, బోర్గాం తదితర గ్రామాల్లో సోయా పంటలు నీటమునిగాయని రైతులు వాపోయారు. రెంజల్‌ మండలంలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్‌ రాంచందర్‌ తెలిపారు. ఆర్మూర్‌ పట్టణంలోని 2వ వార్డులో గుడిసెలు వేసుకొని ఉంటున్న సిక్కుల ఇండ్లల్లోకి వర్షం నీరు వచ్చి చేరింది. పలువురి ఇండ్లు కూలిపోగా కొందరికి గాయాలయ్యాయి. సిక్కుల కాలనీలో సహాయక చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సూచించగా, అధికారులు గూండ్ల చెరువు, మల్లారెడ్డి చెరువును సందర్శించారు. అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు సూచించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ మున్నా, కౌన్సిలర్‌ శంకర్‌, మున్సిపల్‌ ఎన్విరాన్మెంట్‌ ఇంజినీర్‌ పూర్ణమౌళి పెర్కిట్‌లోని ఊర చెరువును పరిశీలించి చెరువు వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మున్సిపల్‌, రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. 40 ఏండ్ల తర్వాత మండలంలోని సుర్భిర్యాల్‌ అడ్డోడి కుంట చెరువు నిండింది. మాక్లూర్‌ మండలంలో 10.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్‌ ఆంజనేయులు తెలిపారు. మాందాపూర్‌లో పెంకుటిల్లు పైభాగం వర్షానికి కూలిపోయింది. నందిపేట్‌ మండలం ఉమ్మెడ పాత గ్రామం వద్ద గోదావరి నదిలోకి భారీగా వరద వస్తున్నది. నది ఒడ్డున ఉన్న ఉమా మహేశ్వర ఆలయం నీటమునిగింది.

బోధన్‌ డివిజన్‌లో వర్షపాతం..
బోధన్‌ డివిజన్‌లో మండలాల వారీగా నమోదైన వర్షపాతం వివరాలను ఆర్డీవో రాజేశ్వర్‌ వెల్లడించారు. బోధన్‌ మండలంలో 45 మిల్లీ మీటర్లు, రెంజల్‌ మండలంలో 71.8 మి.మీ, ఎడపల్లి మండలంలో 58.2 మి.మీ, కోటగిరి మండలంలో 55 మి.మీ, రుద్రూర్‌ మండలంలో 40.3 మి.మీ, వర్ని మండలంలో 61.2 మి.మీ, చందూర్‌ మండలంలో 53.5 మి.మీ, మోస్రా మండలంలో 65.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని ఆర్డీవో ఒక ప్రకటనలో వెల్లడించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana