CPGET 2025 | హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) 2025 నోటిఫికేషన్ బుధవారం విడుదల కానుంది. మధ్యాహ్నం 3: 30 గంటలకు ఉన్నతవిద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వుడిత్యాల బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ తదితరులు ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకాం వంటి కోర్సుల్లోని సీట్లను సీపీగెట్ ద్వారా భర్తీచేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా సీపీగెట్ నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా యూనివర్సిటీకే అప్పగించారు. ప్రొఫెసర్ ఐ పాండు రంగారెడ్డి సీపీగెట్ కన్వీనర్‌గా నియమితులయ్యారు.
మూడు విడతల్లో..
పీజీ కోర్సుల్లోని సీట్లను ఈ సారి మూడు విడతల్లో భర్తీచేస్తారు. మొదటి విడత రిజిస్ట్రేషన్లు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు సీపీగెట్‌కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌ను సైతం అధికారులు విడుదల చేస్తారు. ఇది వరకు వికలాంగులకు 30 సీట్లకు ఒక సీటును కేటాయించే వారు. కానిప్పుడు ఐదు శాతం రిజర్వేషన్‌ను వర్తింపజేయనున్నారు. ఉమ్మడి కోటా ప్రవేశాల గడువు ముగియడంతో 15 శాతం ఏపీ కోటా సీట్లకు కోతపడనుంది. ఇక నుంచి ఏపీ విద్యార్థులు నాన్‌లోకల్ కోటాలోనే సీట్లకు పోటీపడొచ్చు. రాష్ట్రవ్యాప్తంగా 8 వర్సిటీల్లోని పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్ కలుపుకుంటే మొత్తంగా 50 వేలకు పైగా సీట్లున్నాయి. వీటిలో ఏటా 22 నుంచి 23 వేలు మాత్రమే నిండుతున్నాయి. దాదాపు 27 వేల సీట్లున్నా విద్యార్థులుఎవరు చేరడంలేదు. దీంతో ఆయా సీట్లన్నీ ఖాళీగా ఉంటున్నాయి.