e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News సుప్రీంకోర్టు తీర్పులు

సుప్రీంకోర్టు తీర్పులు

లైంగిక నేరాలు

శరీరం-శరీరం (స్కిన్‌ టు స్కిన్‌) తాకకపోతే అది లైంగిక నేరం కాదంటూ బాంబే హైకోర్ట్‌ ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్ట్‌ కొట్టివేసింది. నవంబర్‌ 18న ఈ తీర్పు వెలువడింది. శరీరాన్ని తాకకపోయినా అలాంటి కామవాంఛను కలిగి ఉండటం కూడా తప్పే అని స్పష్టం చేసింది. గతంలో బాంబే హైకోర్ట్‌ ఇచ్చిన తీర్పును అటార్ని జనరల్‌ కేకే వేణుగోపాల్‌ సవాల్‌ చేశారు.

- Advertisement -

హరిత ట్రిబ్యునల్‌కు సుమోటో అధికారం

పత్రిక కథనాలు, లేఖలు, వినతి పత్రాలను ఆధారంగా చేసుకొని సుమోటోగా కేసులు విచారించే అధికారం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ)కు ఉందని సుప్రీంకోర్ట్‌ పేర్కొంది. భవిష్యత్‌ తరాలకు చక్కని వాతావరణాన్ని ఇచ్చేలా చూసే వ్యవస్థ ఉండటం దేశ క్షేమం దృష్ట్యా అవసరం అని వ్యాఖ్యానించింది. ఎవరూ తలుపు తట్టడం లేదని మౌన ప్రేక్షకుడిలా ఎన్‌జీటీ ఉండటం తగదని అంది.

ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్ట్‌ల పథకం కొనసాగింపు

1000 ఫాస్ట్‌ ట్రాక్‌ స్పెషల్‌ కోర్ట్‌ల కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇది కేంద్ర ప్రాయోజిత కార్యక్రమం, ఏప్రిల్‌ 2021 నుంచి 2023 మార్చి వరకు ఇది కొనసాగుతుంది. ఇందులో 389 ప్రత్యేకంగా పోక్సో కోర్టులు ఉండనున్నాయి. వీటికి నిర్భయ నిధుల నుంచి కేంద్రం తన వాటాను ఇవ్వనుంది.

నేర చరితపై యాప్‌

ఎన్నికల్లో పోటీ చేసేందుకు వివిధ పార్టీల అభ్యర్థులుగా ఎంపికయిన వారి నేర చరిత్రను తెలిపేందుకు ప్రత్యేక మొబైల్‌ అప్లికేషన్‌ను రూపొందించాలని సుప్రీం కోర్ట్‌ ఆగస్ట్‌ 10న భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఒక్క క్లిక్‌తో తమ మొబైల్‌ ఫోన్ల నుంచి అభ్యర్థుల జాతకాన్ని తెలుసుకొనేలా ఉండాలని సూచించింది. అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయడానికి రెండు వారాల ముందు తమ నేర చరిత్ర వివరాలను బయటపెట్టాలనే తనపూర్వపు ఉత్తర్వులను సవరించింది. అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నట్లు పార్టీలు ప్రకటించిన 48 గంటల్లోపు ఆ వివరాలు పొందుపరచాలని పేర్కొంది.

ఎన్డీఏ పరీక్షలపై కీలక తీర్పు

స్త్రీ-పురుష సమానత్వం దిశగా సుప్రీంకోర్ట్‌ ఆగస్ట్‌ 18న కీలక నిర్ణయాన్ని వెలువరించింది. సైన్యంలో చేరడానికి ఉద్దేశించిన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ప్రవేశ పరీక్షలో మహిళలు పాల్గొనడానికి అవకాశం కల్పించింది. నేవల్‌ అకాడమీ పరీక్షలో అర్హులయిన మహిళలకు అవకాశం కల్పించాలంటూ ఖుష్‌ కర్లా అనే అభ్యర్థి దాఖలు చేసిన వ్యాజ్యంపై ఈ ఆదేశాలను సుప్రీంకోర్ట్‌ జారీ చేసింది.

జాప్యంపై ఆగ్రహం

ప్రజా ప్రతినిధులపై పెట్టిన కేసుల దర్యాప్తులో మితిమీరిన ఆలస్యం జరుగుతూ ఉండటంపై ఆగస్ట్‌ 25న సుప్రీంకోర్ట్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీబీఐ కేసులు నమోదు చేస్తున్నా, వాటికి ఎప్పటికీ ముగింపు ఉండటం లేదు. ఇందుకోసం అవసరమయిన మానవ వనరులు, ఇతర సదుపాయాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్ట్‌ సూచించింది. వివిధ కేసుల్లో శిక్షలు పడిన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవిత కాల నిషేధం విధించడంపై పార్లమెంట్‌ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్ట్‌ పేర్కొంది.

చట్టసవరణ అధికారం పార్లమెంట్‌దే

సభ్యుల అనర్హతలపై స్పీకర్‌ సకాలంలో నిర్ణయం తీసుకొనేలా చట్టాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌దే అని సుప్రీంకోర్ట్‌ పేర్కొంది. జూలైలో జరిగిన విచారణలో ఈ తీర్పు చెప్పింది. నిర్ణీత కాలపరిమితి విధించకపోవడంతో పార్టీ ఫిరాయించే సభ్యులపై అనర్హత వేటు వేయకుండా స్పీకర్లు జాప్యం చేస్తున్నారని పిటిషన్‌ దారుడు పశ్చిమబెంగాల్‌ కాంగ్రెస్‌ కమిటీ సభ్యుడు రణజిత్‌ ముఖర్జీ తన దావాలో తెలిపారు.

66ఏ కేసుల కొనసాగింపుపై కేంద్రానికి నోటీస్‌

2015లోనే రద్దయిన ఐటీ సెక్షన్‌ 66ఏ చట్టాన్ని ఇంకా వినియోగించడంపై సుప్రీంకోర్ట్‌ కేంద్రానికి నోటీస్‌ ఇచ్చింది. పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ సంస్థ ఈ అంశాన్ని సుప్రీంకోర్ట్‌ దృష్టికి తీసుకెళ్లింది. చట్టం రద్దయినా ఇప్పటికీ 745 కేసులు, 11 రాష్ర్టాల్లో నమోదయ్యాయని పేర్కొంది. ఈ ఏడాది జూలైలో ఈ తీర్పును సుప్రీంకోర్ట్‌ చెప్పింది. శ్రేయా సింఘాల్‌ కేసులో ఈ చట్టాన్ని మార్చి 2015లో సుప్రీంకోర్ట్‌ కొట్టివేసింది.
ఉపసంహరణ: ఐటీ చట్టం 2000లోని సెక్షన్‌ 66ఏ కింద ఎలాంటి కేసులు నమోదు చేయరాదని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ర్టాలను సుప్రీంకోర్ట్‌ తీర్పు వెలువరించిన అనంతరం ఆదేశించింది. ఇప్పటికే ఈ సెక్షన్‌ కింద పెట్టిన కేసులను ఉపసంహరించాలని కూడా ఉత్తర్వులో పేర్కొంది.

సెక్షన్‌ 124ఏ రద్దు చేయకపోవడంపై ప్రశ్న

స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన రాజద్రోహ చట్టం అవసరంపై సుప్రీంకోర్ట్‌ ప్రశ్నించింది. ఈ సెక్షన్‌ రాజద్రోహాన్ని ప్రస్తావిస్తుంది. మాటల ద్వారా కాని, రాతల ద్వారా కాని, సంకేతాల ద్వారా కాని, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరయినా చట్టబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వంపై అసంతృప్తి పోగుచేసినా, రెచ్చగొట్టినా, ధిక్కరించినా, శతృత్వ భావన కలిగించినా, అందుకు ప్రయత్నించినా అది రాజద్రోహమే అవుతుంది.

రాష్ర్టాల అంశాల్లో కేంద్ర ఏకపక్ష చట్టాలు చెల్లవు

రాజ్యాంగ సవరణలు, సహకార సంఘాల నిర్వహణ అంశంలో సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. రాష్ర్టాల పరిధిలోని అంశాల్లో కేంద్రం ఏకపక్షంగా చేసే చట్టాలు చెల్లుబాటు కాబోవని పేర్కొంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 97వ రాజ్యాంగ సవరణ తీరును తప్పు పట్టింది. బహుళ రాష్ర్టాల్లో కార్యకలాపాలు ఉండే సహకార సంఘాల కోసం రాజ్యాంగ అధికరణం 243 జడ్‌ఆర్‌లో చేర్చిన 9బి నిబంధనలను కొనసాగిస్తున్నట్లు పేర్కొంది.

సత్వర విచారణ ప్రాథమిక హక్కు

వేగవంతమైన విచారణ పౌరులకు ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్ట్‌ వ్యాఖ్యానించింది. బీమా-కోరేగావ్‌ ఉద్రిక్తత కేసులకు సంబంధించి కోర్ట్‌ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో కేసులు దాఖలు చేయలేదు. ఇంకా పరిశీలన దశలో ఉన్నాయి. విచారణ ప్రారంభం కాకపోవడంతో నిందితులు నిర్బంధంలోనే ఉన్నారు. సత్వర విచారణ ఆర్టికల్‌ 21లో భాగం అని సుప్రీంకోర్ట్‌ పేర్కొంది. గతంలో బాబు సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ యూపీలో సత్వర విచారణ సాంఘిక న్యాయం అని తీర్పు చెప్పింది.

ప్రభుత్వ ఉద్యోగులపై విచారణకు అనుమతి తప్పనిసరి

విధి నిర్వహణలో నేరానికి పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులపై విచారణ నిర్వహించేందుకు తగిన అర్హత ఉన్న అధికారి నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్ట్‌ జూలై 23న తీర్పు చెప్పింది. ఒక భూ వ్యవహారంలో ప్రభుత్వ క్లస్టర్లను విచారణ నుంచి రక్షణ కల్పిస్తూ రాజస్థాన్‌ హైకోర్ట్‌ గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement