SSC CGL | ఈ నెల 13 నుంచి జరగాల్సిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ (CGL) పరీక్ష వాయిదా పడింది. సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్షలను నిర్వహిస్తామని, పూర్తిస్థాయి ఎగ్జామ్ షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని కమిషన్ ప్రకటించింది. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు, సంస్థలలో మొత్తం 14,582 ఖాళీల భర్తీకి ఎస్ఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టైర్-1 పరీక్షలు ఆగస్టు 13 నుంచి 30 వరకు జరగాల్సి ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో పరీక్షలను వాయిదా వేసింది. కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణలో మార్పులు చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ఎస్ఎస్సీ పోస్ట్ ఫేజ్ 13 పరీక్షల నిర్వహణ సందర్భంగా కొన్ని కేంద్రాలలో లాగిన్, సర్వర్ సమస్యలు, ప్రశ్నలు సరిగా లోడ్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. దీంతో సుమారు 55 వేల మంది అభ్యర్థులు పరీక్షలు రాయలేకపోయారు. వీరికి ఈ నెల చివరి వారంలో మళ్లీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సీజీఎల్ పరీక్షలను వాయిదా వేసిన కమిషన్.. పరీక్షలను ఎప్పుడు నిర్వహించేంది త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.
ఎస్ఎస్సీ సీజీఎల్ 2025 నోటిఫికేషన్ జూన్ 9న విడుదలైంది. అదే నెల 9 నుంచి జూలై 4 వరకు దరఖాస్తులు స్వీకరించారు. వివిధ విభాగాల్లో మొత్తం 14,582 ఖాళీల భర్తీ చేయనున్నారు. మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. నాలుగు విభాగాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. గంటలో (60 నిమిషాలు) పరీక్షను పూర్తిచేయాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున కేటాయించారు. అదేవిధంగా ప్రతి తప్పు జవాబుకు 0.50 మార్కులు కోతవిధిస్తారు.