e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News త్రివిధ దళాల్లో… సేవా భాగ్యం!

త్రివిధ దళాల్లో… సేవా భాగ్యం!

  • సీడీఎస్‌-2022
  • శిక్షణ కాలంలో నెలకు రూ.56,100
  • డిగ్రీ ఉత్తీర్ణులు, ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు అవకాశం

త్రివిధ దళాలు.. దేశ రక్షణలో అత్యంత కీలకమైనవి. వీటిలో పనిచేయడం అంటే దేశసేవ చేయడంతోపాటు నిత్యం చాలెంజింగ్‌తో కూడుకున్న జాబ్స్‌ ఇవి. సాహసానికి మారుపేరుగా నిలిచే కొలువులు. మంచి జీతభత్యాలు, సమాజంలో గౌరవ ప్రదమైన ఉద్యోగాలు.. అంతేకాదు కుటుంబానికి భరోసానిచ్చే కొలువులు ఇవి. డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న వారికి ఇది చక్కటి అవకాశం. ఏటా రెండుసార్లు ఈ నోటిఫికేషన్‌ను యూపీఎస్సీ విడుదల చేస్తుంది. ప్రస్తుతం సీడీఎస్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. సీడీఎస్‌ నోటిఫికేషన్‌ వివరాలు, పరీక్ష విధానం,

ఎంపిక విధానం సంక్షిప్తంగా..

- Advertisement -

కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (1)-2022 నోటిఫికేషన్‌ను యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 341

  1. ఇండియన్‌ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్‌) – 100 ఖాళీలు
  2. భారత నావిక దళం (ఇండియన్‌ నేవల్‌ అకాడమీ, ఎజిమల)- 22 ఖాళీలు
  3. ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీ (హైదరాబాద్‌)- 32 పోస్టులు
  4. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ (చెన్నై) – 170 ఖాళీలు (పురుషులు), 17 ఖాళీలు (మహిళలు)
    ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు ?

అవివాహిత పురుష, మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
విద్యార్హతలు: మిలిటరీ అకాడమీ, ఆఫీసర్‌ ట్రెయినింగ్‌ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, నేవల్‌ అకాడమీకి బీటెక్‌/బీఈ చదివి ఉండాలి. ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్మీడియట్‌లో గణితం, భౌతిక శాస్త్రం చదివి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా అర్హులే. మహిళా అభ్యర్థులు కేవలం ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీకి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వయస్సు: ఇండియన్‌ మిలిటరీ అకాడమీ, నేవల్‌ అకాడమీ పోస్టులకు 1999, జనవరి 2 నుంచి 2004, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి 2023, జనవరి 1 నాటికి 20- 24 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1999, జనవరి 2 నుంచి 2003, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
నోట్‌: కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ ఉన్నవారికి గరిష్ఠ వయోపరిమితిలో రెండేండ్లు సడలింపు ఉంటుంది. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ పోస్టులకు 1998, జనవరి 2 నుంచి 2004, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
నోట్‌: అభ్యర్థులకు నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి.

ఎంపిక విధానం

ఎంపికలో భాగంగా మొదట రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇంటెలిజెన్స్‌, పర్సనాలిటీ పరీక్షలు ఉంటాయి. ఆ తర్వాత శారీరక, వైద్య పరీక్షల అనంతరం నియామకాల ఖరారు ఉంటుంది. ఇండియన్‌ మిలటరీ అకాడమీ, నేవీ, ఏయిర్‌ఫోర్స్‌ అకాడమీలకు పరీక్ష ఒకే పద్ధతిలో ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, ప్రాథమిక గణిత పరిజ్ఞానంపై పరీక్ష ఉంటుంది. ఒక్కో విభాగానికి రెండు గంటల చొప్పున మొత్తం ఆరు గంటల పాటు పరీక్ష ఉంటుంది. ప్రతి విభాగానికి 100 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ విభాగానికి సంబంధించి కేవలం ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌లు మాత్రమే ఉంటాయి. ఇందులో కూడా ఒక్కో విభాగానికి రెండు గంటల చొప్పున మొత్తం నాలుగు గంటల సమయం ఉంటుంది. ప్రతి విభాగానికి 100 మార్కుల చొప్పున, 200 మార్కులకు గాను పరీక్ష ఉంటుంది.
పరీక్షలో ప్రశ్నలు మొత్తం ఆబ్జెక్టివ్‌ విధానంలో ఇస్తారు.

సిలబస్‌ వివరాలు ఇంగ్లిష్‌

అభ్యర్థి భాషను ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోనే రీతిలో ప్రశ్నలు ఇస్తారు. కాంప్రహెన్షన్‌, ఎర్రర్స్‌ అండ్‌ ఒమిషన్స్‌, జంబుల్డ్‌ సెంటెన్స్‌, సెంటెన్స్‌ కరెక్షన్‌, సినానిమ్స్‌, యాంటానిమ్స్‌, ఐడియమ్స్‌ అండ్‌ ఫ్రేజ్‌ పార్ట్స్‌, స్పెల్లింగ్‌ మిస్టేక్స్‌, ఫిల్‌ ఇన్‌ ది బ్లాంక్స్‌, రిపోర్టెడ్‌ స్పీచ్‌ తదితర అంశాలపై ప్రశ్నలు ఇస్తారు.

జనరల్‌ నాలెడ్జ్‌

ఇండియన్‌ హిస్టరీ, జాగ్రఫీ ప్రశ్నలు ఇస్తారు. వర్తమాన అంశాలకు (కరెంట్‌ అఫైర్స్‌) ప్రాధాన్యం ఇస్తారు.దైనందిన జీవితానికి సంబంధించిన అంశాలు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలపై ప్రశ్నలు ఇస్తారు.
ఎవరు సంఖ్యామానం, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, అకరణీయ సంఖ్యలు, వాస్తవ సంఖ్యలు, ఫండమెంటల్‌ ఆపరేషన్స్‌, కూడికలు, తీసివేతలు, గుణకారం, భాగాహారం, స్వేర్‌ రూట్స్‌, దశాంశ భిన్నాలు, యూనిటరీ మెథడ్‌, కాలం-దూరం, కాలం-పని, శాతాలు, సరళ వడ్డీ, బారువడ్డీ, లాభం, నష్టం, నిష్పత్తి తదితరాలు, నంబర్‌ థియరీ, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్‌, లాగరిథిమ్స్‌, ఆల్‌జీబ్రా, త్రికోణమితి, జామెట్రీ, మెన్సురేషన్‌, స్టాటిస్టిక్స్‌ నుంచి ప్రశ్నలు ఇస్తారు.
నోట్‌: మ్యాథమెటిక్స్‌ ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఇస్తారు.
ఇంటెలిజెన్స్‌ అండ్‌ పర్సనాలిటీ టెస్ట్‌ (ఇంటర్వ్యూ)
దీన్ని ఎస్‌ఎస్‌బీ బోర్డు నిర్వహిస్తుంది
దీనిలో రెండు దశలు.. స్టేజ్‌-1, స్టేజ్‌-2 ఉంటాయి. స్టేజ్‌-1లో అర్హత సాధించిన వారిని మాత్రమే స్టేజ్‌-2కు అనుమతిస్తారు.
స్టేజ్‌-1
దీనిలో ఆఫీసర్‌ ఇంటెలిజెన్స్‌ రేటింగ్‌ (ఓఐఆర్‌) టెస్ట్‌, పిక్చర్‌ పర్‌సెప్షన్‌, డిస్క్రిప్షిన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. పై టెస్ట్‌ల్లో అభ్యర్థి చూపించిన ప్రతిభ ఆధారంగా స్టేజ్‌-2కు ఎంపిక చేస్తారు.
స్టేజ్‌-2
ఇంటర్వ్యూ, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌ టాస్క్‌, సైకాలజీ టెస్ట్‌, కాన్ఫరెన్స్‌. వీటిని నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు.
నోట్‌: స్టేజ్‌-1, స్టేజ్‌-2లో అర్హత సాధించిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి వారికి శిక్షణ ఇస్తారు.

జీతభత్యాలు

లెఫ్టినెంట్‌ హోదాలో లెవల్‌ -10 కింద నెలకు రూ.56,100-1,77,500/- జీతం ఇస్తారు. వీరికి లెఫ్టినెంట్‌ నుంచి కెప్టెన్‌-మేజర్‌- లెఫ్టినెంట్‌ కల్నల్‌- కల్నల్‌- బ్రిగేడియర్‌ ఇలా లెవల్‌-18 వరకు పదోన్నతులకు అవకాశం ఉంటుంది.
ప్రారంభ వేతనం రూ.56,100కు అదనంగా మిలిటరీ సర్వీస్‌ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏ తదితర అలవెన్సులు ఇస్తారు. అంటే సుమారు రూ. లక్ష వరకు వేతనం అందుతుంది. పదోన్నతులు వచ్చినప్పుడు జీతభత్యాలు మరింత పెరుగుతాయి. వీటికి అదనంగా క్యాంటీన్‌, వైద్య సౌకర్యాలు, ఇన్సూరెన్స్‌ తదితరాలు ఉంటాయి.

ప్రిపరేషన్‌ విధానం

గణితం కీలకం. పాఠశాల స్థాయిలోనే ప్రశ్నలు ఉంటాయి. అయితే అకడమిక్‌, పరీక్షలా కాకుండా పూర్తి స్థాయి షార్ట్‌కట్స్‌తో అభ్యర్థులు ప్రాక్టీస్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో అర్థమెటిక్‌, ఆల్జీబ్రా, జామెట్రీ, ట్రిగనామెట్రీ, మెన్సురేషన్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ముందుగా అభ్యర్థులు పాఠశాల స్థాయిలోని పుస్తకాలను తిరగేసి కాన్సెప్ట్‌లను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అవసరం అయితే ఆరు నుంచి పదో తరగతి వరకు ఉన్న గణిత పుస్తకాలలోని కాన్సెప్ట్‌లను అర్థం చేసుకుంటే, ప్రశ్న ఏ రీతిన అడిగినా సమాధానం గుర్తించేందుకు వీలు ఉంటుంది. అయితే అభ్యర్థులు కొత్త కోణంలో ఆలోచించగలిగే సామార్థ్యాన్ని పెంచుకోవాలి. ఉదాహరణకు గతంలో గణిత విభాగం నుంచి అడిగిన ప్రశ్నను పరిశీలిస్తే…
ఒక సంఖ్యలో రెండు అంకెలు ఉన్నాయి. ఆ రెండు అంకెల మొత్తం 10. ఆ రెండింటిని తిప్పి రాయగా, మొదటి సంఖ్య విలువ కంటే 36 మేర తగ్గింది. ఆ రెండు సంఖ్యల లబ్ధం ఎంత?
ఎ. 21 బి. 24 సి. 36 డి. 42
సాధారణంగా అభ్యర్థులు దీనిని అకడమిక్‌ పద్ధతిలో చేసేందుకు యత్నిస్తారు. దానికి బదులుగా, అసలు ఆప్షన్లలో, ట్రయల్‌ అండ్‌ ఎర్రర్‌ పద్ధతుల్లో పరిశీలిస్తే, మొదట 21 తీసుకుందాం. 21 సంఖ్యను 7×3 గా రాయొచ్చు. అలాగే 7+3=10 అవుతుంది, ఇప్పుడు 73ను తిప్పి రాస్తే 37 అవుతుంది. 73-37 చేస్తే, 36 వస్తుంది. ప్రశ్నలో ఇచ్చిన అన్ని నిబంధనలను ఇది పాటిస్తుంది. కాబట్టి ఇదే సరైన సమాధానం. ఇక వేరే ఆప్షన్లను పరిశీలించాల్సిన అవసరమే లేదు. అందుకే అభ్యర్థులు సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. పోటీ పరీక్షల ప్రిపరేషన్‌, అకడమిక్‌కు పూర్తి భిన్నంగా ఉండాలి.

జనరల్‌ నాలెడ్జ్‌

ఇందులో చరిత్ర, ఆర్థిక శాస్త్రం, సైన్స్‌, భారత రాజ్యాంగం, భూగోళ శాస్త్రం నుంచి ప్రశ్నలు వస్తాయి. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి కూడా ప్రాధాన్యం ఉంటుంది. అయితే అభ్యర్థుల విశ్లేషణ పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటున్నాయి. ఉదాహరణకు గతంలో ఆర్థిక శాస్త్రం నుంచి ‘ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్నప్పుడు, కింద పేర్కొన్న ఏ చర్య తీసుకోవాలి?’ అంటూ ప్రశ్నించారు, అంటే ఆబ్జెక్టివ్‌ పరీక్షలోనూ అభ్యర్థుల విశ్లేషణ శక్తిని పరిశీలిస్తున్నారు. ప్రాథమిక స్థాయి పుస్తకాలను బాగా చదవడంతో పాటు, గత ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే ప్రశ్న కోణం అర్థం అవుతుంది.
ఇంగ్లిష్‌
ఇందులో కాంప్రహెన్షన్‌, స్పాటింగ్‌ ఎర్రర్స్‌, పేరా జంబుల్డ్‌, సినానిమ్స్‌, ఆంటానిమ్స్‌ నుంచి ప్రశ్నలు ఉంటాయి. గతంలో 6 కాంప్రహెన్షన్లు వచ్చాయి. కాబట్టి అభ్యర్థులు వీటిని సాధ్యమైనన్ని ఎక్కువ ప్రాక్టీస్‌ చేయాలి. అలాగే స్పాటింగ్‌ ఎర్రర్స్‌లో మంచి మార్కులు సాధించేందుకు ఆంగ్ల వ్యాకరణంపై పట్టు ఉండాలి. పోటీ పరీక్షల కోణంలో చదవాలి.

శిక్షణ వివరాలు

అభ్యర్థి ఏ విభాగంలో ఎంపికైనా శిక్షణ కాలంలో నెలకు రూ.56,100/- స్టయిఫండ్‌ చెల్లిస్తారు.
ఇండియన్‌ మిలిటరీ అకాడమీకి ఎంపికైన వారికి డెహ్రాడూన్‌లో 18 నెలల శిక్షణ ఇస్తారు.
నేవల్‌ అకాడమీకి ఎంపికైన వారికి కేరళలోని ఎజిమలలో 18 నెలల శిక్షణ ఇస్తారు.
ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి ఎంపికైన వారికి హైదరాబాద్‌లో 18 నెలల శిక్షణ ఇస్తారు.
ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీకి ఎంపికైన వారికి చెన్నైలో 11 నెలల శిక్షణ ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి మద్రాస్‌ యూనివర్సిటీ నుంచి పీజీ డిప్లొమా ఇన్‌ డిఫెన్స్‌ అండ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు.

ముఖ్య తేదీలు
దరఖాస్తు : ఆన్‌లైన్‌లో
చివరితేదీ : జనవరి 11
(సాయంత్రం 6 గంటల వరకు)
పరీక్ష తేదీ : ఏప్రిల్‌ 10
వెబ్‌సైట్‌ : https://upsc.gov.in

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement