SBI: దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ (SBI) భారీగా క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నది. దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో 6 వేలకు పైగా జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్టు అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారి నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ 26వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ద్వారా 6589 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో 5,180 రెగ్యులర్, 1409 బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్ రీజియన్ (తెలంగాణలో) 250 రెగ్యులర్ పోస్టులు (జనరల్ 101, ఎస్సీ 40, ఎస్టీ 17, ఓబీసీ 67, ఈడబ్ల్యూఎస్ 25), బ్యాక్లాగ్ 70 (పీడబ్ల్యూబీడీ 12, ఎక్స్ఎస్ 58), ఏపీలో 310 పోస్టులు (జనరల్ 126, ఎస్సీ 49, ఎస్టీ 21, ఓబీసీ 83, ఈడబ్ల్యూఎస్ 31), బ్యాక్లాగ్ 5 (ఎస్టీ 3, పీడబ్ల్యూడీ 2) ఉన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతలు తప్పనిసరి. 2025 ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏండ్ల వయస్సు మించకూడదు. రిజర్వేషన్ల ఆధారంగా ఆయా వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే డిసెంబర్ 31 కంటే ముందే సంబంధిత ఆధారాలను సమర్పించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: సెలక్షన్ ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ ఎగ్జామ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్.
దరఖాస్తు రుసుం: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఎలాంటి రుసుం లేదు.
పరీక్ష..
ప్రిలిమినరీలో మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు అడుగుతారు. గంటలో పరీక్ష పూర్తిచేయాలి. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు, రీజనింగ్ 35 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున ఉంటుంది. ప్రతి విభాగానికి 20 నిమిషాల చొప్పున కేటాయిస్తారు.
మెయిన్స్ 200 మార్కులకు ఉంటుంది. 190 ప్రశ్నలు అడుగుతారు. 2.40 గంటల్లో పరీక్ష రాయాలి. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు (50 మార్కులు), జనరల్ ఇంగ్లిష్ నుంచి 40 ప్రశ్నలు (40 మార్కులు) అడుగుతారు. రెండు విభాగాలకు 35 నిమిషాల చొప్పున 70 నిమిషాల సమయం ఇస్తారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 ప్రశ్నలు (50 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్రశ్నలు (60 మార్కులు) అడుగుతారు. ఈ రెండు విభాగాలకు 45 నిమిషాల చొప్పున 90 నిమిషాల సమయం కేటాయించారు.
పరీక్ష తేదీ: ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 20, 21, 27, 28 తేదీల్లో, మెయిన్స్ పరీక్ష నవంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించే అవకాశం ఉంది.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్
దరఖాస్తులు: ఆగస్టు 26 (ఆన్లైన్లో)
వెబ్సైట్: https://sbi.co.in/web/careers