హైదరాబాద్: నీట్ యూజీ రిజిస్ట్రేషన్‌కు అపార్ ఐడీ తప్పనిసరికాదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) స్పష్టం చేసింది. విద్యార్థలు తమ వద్ద ఉన్న ఇతర వివరాలతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో నీట్ యూజీ మార్గదర్శకాలను విడుదల చేసిన ఎన్టీఏ.. దరఖాస్తులో అపార్ ఐడీ (APPAR ID), ఆధార్ కార్డ్ అవసరం అని పేర్కొంది. నీట్ పరీక్ష ప్రక్రియలో ధ్రువీకరణ, రిజిస్ట్రేషన్ పద్ధతులను సులభతరం చేయడానికి, విశ్వసనీయతను పెంచడానికి ఆధార్, అపార్ ఐడీని ఉపయోగిస్తున్నట్లు తెలిపింది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించే ముందు వారి AAPAR IDని తయారు చేసి, ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని ఏజెన్సీ తెలిపింది. దీనిపై విద్యార్థుల్లో గందరగోళం నెలకొనడంతో పరీక్ష నిర్వహణ సంస్థ తాజాగా స్పష్టత నిచ్చింది.
అపార్ ఐడీ అంటే..
అపార్.. ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ. ఇది విద్యార్థుల గుర్తింపు కోసం రూపొందించిన ప్రత్యేక వ్యవస్థ. ‘వన్ నేషన్ వన్ స్టూడెంట్ ఐడీ’ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దీనిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయిస్తారు. ఇందులో విద్యార్థుల పూర్తి రికార్డులు నమోదు చేస్తారు. సాధారణంగా అపార్ ఐడీని స్కూల్ నుంచి క్రియేట్ చేస్తారు.