e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, July 26, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ కళావంతులు అనే పదం ఏ అర్థంలో వాడుతున్నారు?

కళావంతులు అనే పదం ఏ అర్థంలో వాడుతున్నారు?

కళావంతులు అనే పదం ఏ అర్థంలో వాడుతున్నారు?
  • గతవారం తరువాయి..


కర్మ: కర్మ అనే పదానికి కార్యం, పని అని అర్థం. నేడు ఈ పదం పితృకర్మకు రూఢి అయ్యింది.
ఛాందసుడు: ఈ పదానికి ‘వేదవేత్త’ అని అర్థం. నేడు లోకజ్ఞానం లేనివాడు అని నిందార్థం ఏర్పడింది.
వ్యంగ్యం: వ్యంగ్యం అంటే ‘భిన్నమైన అర్థ విశేషాన్ని తెలిపేది’ అని అర్థం. నేడు వ్యంగ్యం అనేది వేళాకోళం, ఎత్తిపొడుపు అనే అర్థాల్లో వ్యవహరిస్తున్నారు.
కంపు: పూర్వకాలంలో కంపు అంటే సుగంధం/సువాసన అనే అర్థం ఉండేది. నేడు ఈ శబ్దం దుర్గంధం/దుర్వాసన అనే అర్థంలో వాడుతున్నాం.
సన్యాసి: సన్యాసి అంటే రంగు, రుచి, వాసన లేకుండా ఇహలోక సంబంధ బాంధవ్యాల్ని విడిచిపెట్టిన మోక్షగామి అని అర్థం.

నేడు ఎందుకు పనికిరానివాడు (సన్నాసి), ఎందుకు కొరగానివాడు (సన్నాసోడు) అనే అర్థాల్లో వాడుతున్నాం.
స్వాహా: యజ్ఞ సమయంలో అగ్నికి ఆజ్యాన్ని సమర్పిస్తూ మంత్రోచ్ఛారణ సమయంలో పలికే మాట ఇది. కానీ నేడు దిగమింగు, దొంగిలించు, అపహరించు అనే నీచార్థాలు చోటుచేసుకున్నాయి.
దేవదాసి: దేవాలయాల్లో పూజ కైంకర్యాల్లో నృత్యగానాదుల్ని నిర్వహించడానికి నియమించే భక్తురాలు అని ప్రాచీన అర్థం. కానీ నేడు ఈ పదం ‘వేశ్య’కు పర్యాయపదంగా వాడుతున్నారు.
కళావంతులు: పూర్వం ‘కళావంతులు’ పదానికి నృత్య సంగీతాది కళల్ని అభ్యసించిన స్త్రీలు అని అర్థం ఉండేది. కానీ నేడు ఈ పదానికి వేశ్యలు, భోగంవాళ్లు అనే అర్థంలో వాడుతున్నారు.
కైంకర్యం: సేవ, పూజ అని ప్రాచీనార్థం. నేడు కైంకర్యం అంటే దొంగిలించు, అపహరించు, మోసగించు అనే చెడు అర్థాల్లో వాడుతున్నారు.
అపహాస్యం: సహింపరానిది, సాధ్యంలేనిది అనేవి సామాన్యార్థాలు. నేడు అపహాస్యం అనే పదం నుంచి చెడ్డ, నీచం, అనిష్టం, రోత అనే న్యూనార్థాలు ఏర్పడ్డాయి.
సాని: నన్నయ కాలంలో ‘సాని’ అనే పదానికి ‘రాణి’ అనే అర్థం ఉంది. ఉదా: దొరసాని, మేదరసాని. నేడు సాని అనే పదం వేశ్య అనే అర్థంలో వాడుతున్నారు.
విధవ: విధవ అనే పదానికి వితంతువు అనే అర్థం ఉంది. నేడు ఈ పదం నిందార్థకంలో వాడుతున్నారు.
ముండ: ముండనం చేయబడిన స్త్రీ, వితంతువు అనే అర్థాల్లో ఉపయోగిస్తున్న ‘ముండ’ పదం నేడు చెడు అర్థంలో తిట్టుగా ఉంది.

  • ముండ- జుత్తు కత్తిరింపబడిన విధవ
- Advertisement -

ముండ- ఎందుకూ పనికిరానివాడు
గ్రహచారం: గ్రహాల గమనం అనే ప్రాచీనార్థంలో వాడుతున్నారు. కానీ నేడు ఈ పదం ‘దురదృష్టం’ అనే అర్థ వికృతిని పొందింది. రాయలసీమ ప్రాంతంలో ‘గాచ్చారం’ అని వ్యవహారంలో ఉంది.
పూజ్యం: పూర్వం దీని అర్థం పూజింపదగింది. కానీ నేడు దీని అర్థం ‘శూన్యం’.
నిండుకున్నవి: పూర్వం నిండుగా ఉన్నది. అనే అర్థం. నేడు అయిపోయింది అనే అర్థంలో వాడబడుతుంది.
శనిగ్రహం: నవగ్రహ దేవతల్లో ఒక దేవత. కానీ నేడు వదిలించుకోవల్సిన పీడ అనే అర్థంలో వాడుతున్నాం.
ఘటం: సంస్కృతంలో ‘ఘటం’ అంటే కుండ, ఏనుగు, కుంభస్థలం, కుంభకం, శిఖరం అనే అర్థాలు ఉన్నాయి.
n తెలుగు వ్యవహారంలో శరీరానికీ, వ్యక్తికి నిందార్థంలో వాడబడుతుంది. ఉదా: ఆ ఘటం ఇంకా చావలేదు (మొండిఘటం).
5) సభ్యోక్తి (Euphemism)
n సభలో కానీ, కొందరి సమక్షంలో కానీ, సంఘంలో కానీ ప్రత్యక్షంగా వాచ్యం చేయడానికి వీలుకాని పదాల అర్థాన్ని, పరోక్షంగా కానీ, నూతన పదబంధ కల్పనల్లో కానీ తెలియజేసే విధానాన్ని ‘సభ్యోక్తి’ అంటారు.
ఉదా: 1) చనిపోవు 2) మూత్రవిసర్జన, మల
విసర్జన 3) మలం 4) మలవిసర్జన ప్రదేశం
5) కులాల పేర్లు 6) కడుపుతో ఉంది.
చనిపోవు: కాల ధర్మం, కీర్తిశేషుడు, బాల్చీ తన్నాడు, శివైక్యం పొందాడు, స్వర్గస్తుడయ్యాడు, దివంగతుడగు, దీర్ఘనిద్ర, నూకలు చెల్లాయి, పరమపదించాడు.
మూత్ర విసర్జన, మలవిసర్జన: ఒంటికి, రెంటికి, లఘుశంక, గురుశంక, దొడ్డికెళ్లు, చెరువుకెళ్లు, కాల్వకుపోవు, చెంబట్టికెళ్లు, బయటకుపోవు, బహిర్భూమికి పోవు.
మలం: అశుద్ధం
మలవిసర్జన ప్రదేశం: పాయిఖానా, దొడ్డి,
మరుగుదొడ్డి, రెస్ట్‌రూం
కులాల పేర్లు: చాకలి-రజకుడు, మంగలి-నాయిబ్రాహ్మణ, కంసాలి-విశ్వబ్రాహ్మణ, బోయ-వాల్మీకి, గొల్ల-యాదవ, మాల మాదిగలు-హరిజనులు, ఎరుకల, చెంచు, సుగాలీ-గిరిజనులు.
కడుపుతో ఉంది: గర్భవతి, ఆవిడ నీళ్లు పోసుకుంది. నెలతప్పింది. ఉత్తిమనిషి కాదు.
n ‘మోసగాడు’ అనే పదాన్ని ‘గంటిజోగి సోమయాజి’ పెద్దమనిషి అని సభ్యోక్తిలో చేర్చారు.
6) మృదూక్తి: మృదు+ఉక్తి= మృదువైన మాట, మృదువుగా చెప్పడం. కఠినమైన లేదా దుఃఖ స్ఫోరకమైన అభిప్రాయాలను మృదువైన రీతిలో చెప్పడమే మృదూక్తి.
కఠినమైన మాటలు మృదూక్తి
1) దీపం ఆరిపోయింది
దీపం పెద్దదైనది, కొండెక్కింది
2) నల్లపూసలు తెగిపోయాయి
సూత్రం పెరిగిపోయింది
3) మరుగుదొడ్లు శుభ్రం చేసేవాడు పాకీవాడు
4) వట్టి మూర్ఖుడు దేవానంప్రియ
5) సున్నా పూర్ణం
7) లక్ష్యార్థిసిద్ధి (Transfer of meaning)
n భాషలోని అనేక పదాలు లక్ష్యార్థాల్లో రూఢికెక్కడం సహజం. ఈ లక్ష్యార్థాలకు అనేక మూలాలు ఉంటాయి.
n ఆధారం-ఆధేయం, కార్యం-కారణం, కార్యం-కర్త, ఉపమానం-ఉపమేయం, అంగం-అంగి, ఏకదేశం-అన్యదేశ్యం మొదలైన జంటల్లో ఒకటి ఇంకొకదానికి వాచకమై కాలక్రమేణా వ్యవహరించబడుతుంటాయి.
ఉదా: 1) ముష్టి 2) దాహం
3) సూది ఆధార (Support), ఆధేయ (Supported) సంబంధం
ముష్టి-పిడికిలి/భిక్షం: పిడికిలి అనే అర్థం ఉన్న ‘ముష్టి’ పదానికి ఆధారాధేయ సంబంధం వల్ల ‘భిక్షం’ అనే అర్థం వచ్చింది. ఇక్కడ భిక్షం పరిణామార్థకం.
కార్యకారణ సంబంధం
దాహం-దహించడం, తపించడం/దప్పిక, పానీయం: దహించడం, తపించడం అనే అర్థం ఉండే దాహం అనే పదానికి కార్యకారణ సంబంధం వల్ల దప్పిక, పానీయం అనే అర్థాలు ఏర్పడ్డాయి. ఇక్కడ దప్పిక, పానీయం పరిణామం వల్ల సంభవించిన అర్థాలు.
లక్ష్యలక్షణ సంబంధం
n సూది-బట్టలు కుట్టే సూది/డాక్టర్లు మందును పేషెంట్ల శరీరంలోకి ఎక్కించడానికి ఉపయోగించే సూది వంటి పరికరం. ఇక్కడ లక్ష్యలక్షణ సంబంధం వల్ల అర్థపరిణామం జరిగింది.
8) వస్తు పరిణామం(Subreption)
n ఒక పదం అది సూచించే వస్తురూపం, నిర్మాణం మొదలైన వాటిలో కాలక్రమేణా వ్యవహారంలో ఎంతో భేదాన్ని సంతరించుకుంది.
1) లక్కపిడతలు 2) ఆయుధం
3) బండి 4) ఇల్లు
లక్కపిడతలు: పిల్లలు ఆడుకునే బొమ్మల్ని ‘పూర్వం లక్కతో చేయడంవల్ల వాటిని లక్కపిడతలు అనే పదం రూఢి అయ్యింది. ఇప్పుడు కర్రతో చేసిన వాటిని కూడా ఆ పేరుతోనే వ్యవహరిస్తున్నారు.
ఆయుధం: విల్లు, గద, కత్తి, తోమరం మొదలైనవి ప్రాచీన ఆయుధాలు. తుపాకీ, రైఫిల్‌, రివాల్వర్‌, ఫిరంగి మొదలైనవి నేటి ఆయుధాలు.
బండి: ఒకప్పుడు బండి అంటే ఎడ్లబండి. నేడు బైక్‌, కార్‌.
ఇల్లు: ఒకప్పుడు పూరిళ్లు, పాకలు, పెంకుటిళ్లు, మిద్దెలు, మేడలు. ఇప్పుడు డాబా, ప్యాలెస్‌, ప్లాజా, అపార్ట్‌మెంట్‌, ఫ్లాట్స్‌.
9) ఆలంకారిక ప్రయోగం(Figurative Use)
n ఉపమానానికి ఉపమేయార్థం సంక్రమించడం, అలంకార ప్రియత్వంతో ఆలంకారికంగా చెప్పడం వల్ల, పోలికలు చేర్చడం వల్ల కూడా అర్థపరిణామం జరుగుతుంది.
ఉదా: ఆమె రంభ, వాడు మన్మథుడు, వాడు నారదుడు, తీపిమాటలు, చేదునిజం, పచ్చి అబద్ధం, ఎండ నిప్పులు చెరుగుతుంది, వాడు సిసింద్రీ, చలాకీ మనిషి, కడుపులో చిచ్చుపెట్టిపోయాడు, కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నది, గుండెచెరువు అవుతుంది.
10) లోకనిరుక్తి (Folk Etymology)
n కొంతమంది తమకు బాగా పరిచయమైన పదాల్ని తమకు పరిచయం లేని పదాల స్థానంలో చేర్చి వ్యవహరిస్తారు. తర్వాత అపరిచితమైన పదమే సామాన్య జన వ్యవహారాల్లో బహుళ ప్రాచుర్యాన్ని పొందుతుంది. అంటే కొత్తగా పదం కల్పించబడుతుంది.
n ప్రజలు తమకు ఉన్న జ్ఞానంలో ఆ పదంలోని అక్షరాల్ని కొద్దిగా అటూ ఇటూ మారుస్తారు. ఇలాంటి మార్పునే లోకనిరుక్తి/జననిరుక్తి అని కూడా అంటారు.
ఉదా: 1) Over Oiling 2) నారద సింహాచలం 3) మధురవాడ 4) బోరన్‌ మిఠాయి 5) మొక్కజొన్న 6) చక్రకేళి 7) ఆకాశ రామన్న 8) ఆరంజోతి (అరుంధతి) 9) శ్రీమంతం 10) అనిరుద్రుడు 11) రుషికేశవా 12) కాలుచిచ్చు 13) చెక్కుపోస్టు (Check post) 14) చందమామ 15) శ్రీకృష్ణం స్టేషను (Sea castom starion) 16) పారం చెట్టు (ఫారిన్‌ చెట్టు) 17) ఐదు వరాలు 18) వ్యాకరణం
Over Oiling
n ‘Over Hauling’ Over Oilingగా మారింది. అంటే ఒక యంత్రాన్ని విప్పి దానిలోని భాగాలకు నూనె వేసి శుభ్రపర్చడం.
నారద సింహాచలం
n ‘North Simhachalam’ నారద సింహాచలంగా మార్పుచెందింది. ఇది ఒక రైల్వేస్టేషన్‌ పేరు ‘North’ పదం తెలియని వారు నారదగా మార్చారు. ఈ పదానికి వ్యుత్పత్తిని కూడా కల్పించారు. నారదుడు ఆకాశం నుంచి దిగి కొండమీదకు నడిచి వెళ్లాడని అందువల్ల నారదుడు దిగిన సింహాచలం కాబట్టి ‘నారద సింహాచలం’ అయిందని జనవ్యవహారంలో ఉంది.
మధురవాడ
n మధుర – వాడ. వాడ అంటే నగరానికి ఆనుకుని ఉన్న చిన్న గ్రామం అని అర్థం. ఈ పదం మీద అవగాహన లేనివారు ‘మధుర’ శబ్దం తప్పుగా భావించి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ‘మధుర’తో చేర్చి మధురవాడ అని వాడారు.
బోరన్‌ మిఠాయి
n ‘బోరన్‌ విటా’ పొడి తియ్యగా ఉంటుంది. ‘విటా’ పదం తెలియనివారు దాని రుచిని బట్టి ‘విటా’ను ‘మిఠాయి’గా మార్చారు.
మొక్కజొన్న
n మక్కా-జొన్న మొక్కజొన్న అయింది. మక్కా నుంచి భారతదేశానికి దిగుమతి అయింది. మక్కా-జొన్న. ఇది తెలియనవారు మక్కా పదం తప్పు అనుకొని దానికి బదులుగా మొక్క వాడారు.
చక్రకేళి
n శర్కర కేళి చక్రకేళి అయింది. దీనికి తియ్యని అరటిపండు అని అర్థం. ఇక్కడ శర్కరకు బదులుగా చక్ర వాడారు.

లోక్‌నాథ్‌ రెడ్డి
విషయ నిపుణులు
ఏకేఆర్‌ స్టడీ సర్కిల్‌
వికారాబాద్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కళావంతులు అనే పదం ఏ అర్థంలో వాడుతున్నారు?
కళావంతులు అనే పదం ఏ అర్థంలో వాడుతున్నారు?
కళావంతులు అనే పదం ఏ అర్థంలో వాడుతున్నారు?

ట్రెండింగ్‌

Advertisement