e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ ప్రాజెక్ట్‌ దంతక్‌ను భారత్‌ ఏ దేశంలో చేపట్టింది?

ప్రాజెక్ట్‌ దంతక్‌ను భారత్‌ ఏ దేశంలో చేపట్టింది?

ప్రాజెక్ట్‌ దంతక్‌ను భారత్‌ ఏ దేశంలో చేపట్టింది?
 1. ఎస్‌ఐపీఆర్‌ఐ అనే సంస్థ పరిశోధన ఆధారంగా మిలిటరీ వ్యయంలో ప్రపంచంలో భారత్‌ ఎన్నో స్థానంలో ఉంది? (డి)
  ఎ) 1 బి) 2 సి) 4 డి) 3
  వివరణ: ప్రపంచ వ్యాప్తంగా మిలిటరీ వ్యయం 1981 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు పెరిగిందని స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. 2019లో ప్రపంచ జీడీపీలో మిలిటరీ వ్యయం 2.2 శాతం ఉండగా 2020లో అది 2.4 శాతానికి పెరిగింది. 2020లో సైన్యానికి అతి ఎక్కువ వ్యయం చేసిన తొలి అయిదు దేశాలు వరుసగా అమెరికా, చైనా, భారత్‌, రష్యా, యూకే. ప్రపంచంలో మొత్తం సైనిక వ్యయంలో ఈ అయిదు దేశాల వాటా 62 శాతం.
 2. పర్యావరణ మార్పును అంచనా వేసే సూపర్‌ కంప్యూటర్‌ను తయారు చేస్తున్న దేశం ఏది? (బి)
  ఎ) అమెరికా బి) యూకే
  సి) జపాన్‌ డి) దక్షిణ కొరియా
  వివరణ: పర్యావరణ మార్పును అంచనా వేసే అత్యంత శక్తిమంతమైన సూపర్‌కంప్యూటర్‌ను బ్రిటిష్‌ నిర్మించనుంది. మైక్రోసాఫ్ట్‌, మెట్‌ ఆఫీస్‌లు దీనిని సంయుక్తంగా రూపొందిస్తున్నాయి. వరదలు, తుఫానులు, మంచు పడటం తదితర విపరీత వాతావరణ పరిస్థితులకు సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని ఇది ఇస్తుంది. ఇప్పటికే పలు దేశాలు ఈ తరహా కంప్యూటర్లను రూపొందించుకున్నాయి. సునామీల ద్వారా వచ్చే వరదను అంచనా వేయడానికి జపాన్‌ ఫుగాకు అనే సూపర్‌ కంప్యూటర్‌ను ఉపయోగిస్తుంది.
 3. ప్రెషర్‌ స్వింగ్‌ అడ్సార్‌ప్షన్‌ అనే పదం ఇటీవల వార్తల్లో నిలిచింది, ఇది ఏంటి? (సి)
  ఎ) కరోనా నిర్ధారణ పరీక్షలు
  బి) వ్యాక్సిన్‌ పనిచేసే సాంకేతిక పరిజ్ఞానం సి) ఆక్సిజన్‌ తయారీ పరిజ్ఞానం
  డి) ఏదీ కాదు
  వివరణ: ఆక్సిజన్‌ తయారు చేసేందుకు డీఆర్‌డీవో ఆవిష్కరించిన పరిజ్ఞానమే ప్రెషర్‌ స్వింగ్‌ అడ్సార్‌ప్షన్‌. వాతావరణం నుంచి గాలిని పీల్చుకొని జియోలైట్‌ పదార్థం సాయంతో అందులోని ఇతర వాయువులను తొలగించి 933% గాఢతతో ఆక్సిజన్‌ను వేరుస్తారు. దీనిని నేరుగా కొవిడ్‌ రోగులకు ఇవ్వచ్చు. తేలికపాటి యద్ధ విమానం తేజస్‌లో అక్కడికక్కడే ఆక్సిజన్‌ తయారుచేసేందుకు అభివృద్ధి చేసిన ఈ సాంకేతికతతో దేశ వ్యాప్తంగా 500 ఆక్సిజన్‌ ఉత్పత్తి కే్రందాలను డీఆర్‌డీవో ప్రారంభించనుంది. ఒక్కొక్కటి నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్‌ను తయారు చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఒక్కో కేంద్రంలో 190 మందికి ఆక్సిజన్‌ను అందించవచ్చు. అదనంగా 195 సిలిండర్లను కూడా నింపవచ్చు.
 4. బోవో ఫోరమ్‌ ఫర్‌ ఆసియా అనేది ఏ దేశం కేంద్రంగా పనిచేస్తుంది? (ఎ)
  ఎ) చైనా బి)జపాన్‌ సి) దక్షిణ కొరియా డి) మయన్మార్‌
  వివరణ: బోవో ఫోరమ్‌ ఫర్‌ ఆసియా అనేది లాభాపేక్షలేని అంతర్జాతీయ సంస్థ. దీని వార్షిక సమావేశం ఇటీవల నిర్వహించారు. చైనాలోని బోవో అనే ప్రాంతం కేంద్రంగా పనిచేస్తుంది. స్విట్జర్లాండ్‌లోని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సంస్థ తరహాలోనే దీనిని కూడా తీర్చిదిద్దేందుకు యత్నిస్తున్నారు. బోవో ఫోరమ్‌ ఫర్‌ ఆసియాలో భారత్‌కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంది. 2001లో 25 ఆసియా దేశాలు, ఆస్ట్రేలియాలు కలిసి దీనిని ఏర్పాటు చేశాయి. ప్రస్తుతం ఇందులో 29 సభ్య దేశాలు ఉన్నాయి
 5. ప్రాజెక్ట్‌ దంతక్‌ (డీఏఎన్‌టీఏకే) ఇటీవల వార్తల్లో నిలిచింది. దీనిని భారత్‌ ఏ దేశంలో చేపట్టింది? (బి)
  ఎ) శ్రీలంక బి) భూటాన్‌
  సి) నేపాల్‌ డి) బంగ్లాదేశ్‌
  వివరణ: భూటాన్‌ దేశంలో బోర్డర్స్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ చేపట్టిన ప్రాజెక్టుల్లో ఒకటి దంతక్‌. 1961 ఏప్రిల్‌ 24న ఇది ప్రారంభమైంది. ఇటీవల ఈ ప్రాజెక్ట్‌ వజ్రోత్సవాన్ని నిర్వహించారు. ఆ దేశంలో 1600 కిలో మీటర్ల రహదారులు, 5000 మీటర్ల పొడవైన వంతెనలను ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. పారో విమానాశ్రయంతో పాటు పలు జల వనరుల ప్రాజెక్టులను కూడా చేపట్టారు. నాటి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, భూటాన్‌ రాజుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఈ ప్రాజెక్టును భారత్‌ చేపట్టింది.
 6. చాండ్లర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ ఇండెక్స్‌లో భారత్‌ ఎన్నో ర్యాంక్‌లో నిలిచింది? (సి)
  ఎ) 47 బి) 48
  సి) 49 డి) 50
  వివరణ: చాండ్లర్‌ సుపరిపాలన సూచీలో భారత్‌ 49వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఫిన్‌లాండ్‌ అగ్రస్థానంలో ఉంది. సింగపూర్‌ కేంద్రంగా చాండ్లర్‌ సంస్థ పనిచేస్తుంది. ఇది లాభాపేక్షలేని ఒక స్వచ్ఛంద సంస్థ. మొత్తం 104 దేశాలకు సంబంధించిన వివిధ పాలన అంశాలను సేకరించి ర్యాంకులను కేటాయించింది. 50 అంశాలను ప్రాతిపదికగా తీసుకుంది. ఇందులో భారత్‌ 49వ స్థానంలో ఉంది. ఏటా డిసెంబర్‌ 25న భారత్‌లో సుపరిపాలన దినోత్సవాన్ని నిర్వహిస్తారు.
 7. ప్రతిపాదన (ఏ): విదేశాల నుంచి వచ్చే ఆక్సిజన్‌కు దిగుమతి సుంకాలు మినహాయించాలని కేంద్రం నిర్ణయించింది (బి)
  కారణం (ఆర్‌): మూడు నెలల పాటు సుంకం మినహాయించనున్నారు
  ఎ) ఏ, ఆర్‌ సరైనవే. ఏ ను ఆర్‌ సరిగ్గా వివరిస్తుంది
  బి) ఏ, ఆర్‌ సరైనవే. ఏ కు ఆర్‌ సరికాదు
  సి) ఏ సరైనది, ఆర్‌ సరికాదు
  డి) ఏ తప్పు, ఆర్‌ సరైనది
  వివరణ: కరోనా విజృంభణ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. విదేశాల నుంచి కొనుగోలు చేసే ఆక్సిజన్‌తో పాటు, దాని ఉత్పత్తి, వినియోగం కోసం వాడే వస్తువులు, టీకాలపై మూడు నెలల పాటు దిగుమతి సుంకాలు, ఆరోగ్య సెస్‌ను కూడా మినహాయిస్తారు. మొత్తం 15 రకాల వస్తువులపై ఇది వర్తిస్తుంది. అలాగే దిగుమతి సమయంలో ఇబ్బందులు లేకుండా నోడల్‌ అధికారులను నియమించాలని ప్రధాన మంత్రి చేసిన సూచనల మేరకు కేంద్ర ఆర్థిక శాఖ దేశ వ్యాప్తంగా 20 మందికి ఈ బాధ్యతలను అప్పగించింది.
 8. స్వమిత్వ దేనికి సంబంధించింది? (ఎ)
  ఎ) భూమి రికార్డుల తయారీ
  బి) మిత్రులు కలిసి ఏర్పాటు చేసుకొనే స్టార్టప్‌ సి) వ్యవసాయ ఎగుమతులు
  డి) ఏదీకాదు
  వివరణ: స్వమిత్వ అనేది సంక్షిప్త రూపం. దీనిని విస్తరిస్తే.. సర్వే ఆఫ్‌ విలేజెస్‌ అండ్‌ మ్యాపింగ్‌ విత్‌ ఇంప్రూవైజ్‌డ్‌ టెక్నాలజీ ఇన్‌ విలేజ్‌ ఏరియాస్‌ అని అర్థం. 2020 ఏప్రిల్‌ 24న ఈ పథకాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో భూమి రికార్డుల తయారీకి సంబంధించిన కార్యక్రమం. 2021 ఏప్రిల్‌ 24న ఈ పథకంలో భాగంగా ఈ-ప్రాపర్టీ కార్డ్‌ల పంపిణీని ప్రధాని ప్రారంభించారు. 4.09 లక్షల మంది ఈ కార్డులను అందుకున్నారు. 2021-25 మధ్య 6.62 లక్షల గ్రామాలకు ఈ పథకాన్ని విస్తరించనున్నారు.
 9. గ్లోబల్‌ ఎనర్జీ ట్రాన్సిషన్‌ సూచీలో భారత్‌ ఎన్నో స్థానంలో ఉంది? (సి)
  ఎ) 85 బి) 86 సి) 87 డి) 88
  వివరణ: 2021 ఎనర్జీ ట్రాన్సిషన్‌ ఇండెక్స్‌లో మొత్తం 115 దేశాలకుగాను భారత్‌ 87వ స్థానంలో నిలిచింది. ఈ సూచీలో స్వీడన్‌ అగ్రస్థానంలో ఉంది. 2, 3, 4, 5వ స్థానాల్లో వరుసగా నార్వే, డెన్మార్క్‌, స్విట్జర్లాండ్‌, ఆస్ట్రియా దేశాలు నిలిచాయి. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేసే వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం దీనిని విడుదల చేస్తుంది. ఈ జాబితాలో చివరి స్థానంలో జింబాబ్వే ఉంది.
 10. ప్రతిపాదన (ఏ): పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ను ప్రారంభించింది (ఎ)
  కారణం (ఆర్‌): నిధులను సమీకరించాలని పవర్‌ గ్రిడ్‌ నిర్ణయించింది
  ఎ) ఏ, ఆర్‌ సరైనవే. ఏ ను ఆర్‌ సరిగ్గా వివరిస్తుంది
  బి) ఏ, ఆర్‌ సరైనవే. ఏ కు ఆర్‌ సరికాదు
  సి) ఏ సరైనది, ఆర్‌ సరికాదు
  డి) ఏ తప్పు, ఆర్‌ సరైనది
  వివరణ: పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ను ప్రారంభించింది. మౌలిక సదుపాయాల నిధిగా దీనిని చెప్పొచ్చు. దీని పేరు-పవర్‌ గ్రిడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ట్రస్ట్‌. ఒక ప్రభుత్వ రంగ సంస్థ తన మౌలిక సదుపాయాల ఆస్తులను నగదుగా మార్చుకోవడం ఇదే తొలిసారి. అలాగే ఇది భారత మార్కెట్‌లోకి కూడా ప్రవేశించనుంది. నిధుల సమీకరణకు కేంద్రం ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ మార్గం ఇది. మ్యూచువల్‌ ఫండ్‌ తరహాలోనే ఇది ఉంటుంది.
 11. ఎన్‌ఈవో-01 ఇటీవల వార్తల్లో నిలిచింది, ఇది ఏంటి? (బి)
  ఎ) కరోనాలో కొత్త ఉత్పరివర్తనం
  బి) రోబో ప్రొటోటైప్‌
  సి) భూమికి దగ్గరగా వచ్చిన ఒక తోకచుక్క డి) కరోనా కట్టడికి కొత్త ఔషధం
  వివరణ: ఎన్‌ఈవో-01 అనే రోబో ప్రొటోటైప్‌ (నఖలు)ను చైనా ఏప్రిల్‌ 27న ప్రయోగించింది. ఇందుకు లాంగ్‌ మార్చ్‌ 6 రాకెట్‌ను ఉపయోగించింది. అంతరిక్షంలో చిన్న ఖగోళ వస్తువులను గుర్తించడం, అలాగే అంతరిక్షంలోని చెత్తను తొలగించే పరిజ్ఞానాన్ని పెంపొందించడం దీని ప్రధాన లక్ష్యం. దీనికి మరో స్పేస్‌ క్రాఫ్ట్‌ ఉండటంతో పాటు ఒక వల కూడా ఉంటుంది. అంతరిక్షంలోని చెత్తను అందులోకి సేకరించి ఎలక్ట్రిక్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ ద్వారా దహించి వేస్తుంది. చైనాలోని షెన్‌జెన్‌ కేంద్రంగా పనిచేసే ఒరిజిన్‌ స్పేస్‌ అనే ఒక అంకుర సంస్థ దీనిని రూపొందించింది.
 12. నాస్‌కామ్‌కు 2021-22 సంవత్సరానికి చైర్‌పర్సన్‌గా నియామకమైంది ఎవరు? (సి)
  ఎ) వనితా గుప్తా బి) సౌమ్య స్వామినాథన్‌ సి) రేఖా మీనన్‌ డి) ప్రియాంక మొహితే
  వివరణ: ఐటీ పరిశ్రమ సంఘం నాస్‌కామ్‌కు 2021-22 సంవత్సరానికి చైర్‌పర్సన్‌గా యాక్సెంచర్‌ ఇండియా సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రేఖా మేనన్‌ నియమితులయ్యారు. నాస్‌కామ్‌ 30 సంవత్సరాల చరిత్రలో చైర్‌పర్సన్‌ బాధ్యతను చేపట్టనున్న తొలి మహిళ ఆమె.
  వనితాగుప్తా: అమెరికా న్యాయ విభాగంలో మూడో అత్యున్నత పదవి అయిన అసోసియేట్‌ అటార్నీ జనరల్‌గా ప్రముఖ మానవ హక్కుల న్యాయవాది వనితా గుప్తా నియామకమయ్యారు. ఆ పదవిని అందుకున్న భారత సంతతికి చెందిన తొలి మహిళ ఆమె.
  సౌమ్య స్వామినాథన్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్య స్వామి నాథన్‌ మరో కీలక బాధ్యతలను చేపట్టనున్నారు. మహమ్మారులపై పోరాటానికి బ్రిటన్‌ ఏర్పాటు చేసిన 20 మంది నిపుణుల బృందంలో ఆమె కూడా స్థానం దక్కించుకున్నారు.
  ప్రియాంక మొహితే: ప్రపంచంలో పదో ఎత్తయిన పర్వతం అయిన అన్నపూర్ణను అధిరోహించిన తొలి భారత మహిళగా ప్రియాంక మొహితే కొత్త రికార్డ్‌ నెలకొల్పారు. ఏప్రిల్‌ 16, 2021న ఆమె ఈ ఘనత సాధించారు.
 13. కొండపాకలో ఇటీవల రాతి యుగపు ఆనవాళ్లు గుర్తించారు. ఇది ఏ జిల్లాలో ఉంది? (డి)
  ఎ) యాదాద్రి భువనగిరి బి) సంగారెడ్డి సి) మెదక్‌ డి) సిద్దిపేట
  వివరణ: మధ్య రాతి యుగపు నాటి సూక్ష్మ రాతి పరికరాలు (మైక్రోలిథ్స్‌) సిద్దిపేట జిల్లాలోని కొండపాకలో ఇటీవల గుర్తించారు. వివిధ ఆకారాల్లో ఇవి ఉన్నాయి. ద్విముఖ, ద్వి కుంభాకార, ఉపరితల లక్షణాలతో కొత్త రాతి యుగపు గొడ్డళ్లు, వాటి ముక్కలు కూడా లభించాయి. ఇవి క్రీ.పూ 8 వేల నుంచి 300 సంవత్సరాల నాటివిగా భావిస్తున్నారు. అలాగే శాతవాహన కాలం నాటి కుండపెంకులు కూడా దొరికాయి. లభించిన వాటిలో చెకుముకి (ఫ్లింట్‌) రాయితో చేసిన రెండు సెంటిమీటర్ల పొడవైన బాణం ములుకు లభించడం విశేషం.
 14. ‘ఇండోరియోనెక్టెస్‌ తెలంగానెన్సిస్‌’ ఇటీవల వార్తల్లో నిలిచింది, ఇది ఏంటి? (బి)
  ఎ) తెలంగాణకే పరిమితమైన పుష్ప జాతి బి) తెలంగాణకే పరిమితమైన ఒక మత్స్య జాతి
  సి) తెలంగాణలో లభించిన ఒక ఔషధ మొక్క డి) ఏదీ కాదు
  వివరణ: తెలంగాణలో 143 జాతులతో కూడిన మత్స్య సంపద ఉన్నట్లు వెల్లడయ్యింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో వీటిని గుర్తించారు. మొత్తం 143 జాతుల్లో బక్కలు (రీటబకలు), సన్న ఉలసలు (ఇండోరియోనెక్టెస్‌ తెలంగానెన్సిస్‌)తెలంగాణ రాష్ర్టానికే పరిమితమైన జాతు లు. ఇవి గోదావరితో పాటు ఉత్తర తెలంగాణలోని గోదావరి ఉపనదుల్లో ఉన్నట్లు తేల్చారు. మరో స్థానిక జాతి బంకజెల్ల (పంగానియస్‌ సిలాసి) నాగార్జునసాగర్‌ ప్రాంతంలోని కృష్ణా నదిలో మాత్రమే కనిపిస్తుంది.
 15. ఆర్గనైజేషన్‌ ఫర్‌ ది ప్రొహిబిషన్‌ ఆఫ్‌ కెమికల్‌ వెపన్స్‌కు ఎక్స్‌టర్నల్‌ ఆడిటర్‌గా ఎవరు నియామకమయ్యారు? (సి)
  ఎ) అరుణ్‌ రస్తే బి) అమిత్‌ బెనర్జీ సి) జీసీ ముర్ము డి) ఎవరూ కాదు
  వివరణ: భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ జీసీ ముర్ము ఆర్గనైజేషన్‌ ఫర్‌ ది ప్రొహిబిషన్‌ ఆఫ్‌ కెమికల్‌ వెపన్స్‌కు ఎక్స్‌టర్నల్‌ ఆడిటర్‌గా నియామకమయ్యారు. మూడు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. నెదర్లాండ్స్‌లోని హేగ్‌ కేంద్రంగా ఈ సంస్థను 1997 ఏప్రిల్‌ 29న ఏర్పాటు చేశారు.
  అరుణ్‌ రస్తే: నేషనల్‌ కమోడిటీ అండ్‌ డెరివేటివ్స్‌ ఎక్సేంజ్‌ లిమిటెడ్‌కు సీఈవో, ఎండీగా అరుణ్‌ రస్తేను సెబీ నియమించింది.
  అమిత్‌ బెనర్జీ: బీఈఎంఎల్‌ లిమిటెడ్‌ సంస్థకు చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌గా అమిత్‌ బెనర్జీ నియమితులయ్యారు. ఇది రక్షణ రంగానికి చెందిన సంస్థ. మినీరత్న విభాగంలో ఉంది.

వి.రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ , వ్యోమా.నెట్‌
9849212411

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రాజెక్ట్‌ దంతక్‌ను భారత్‌ ఏ దేశంలో చేపట్టింది?

ట్రెండింగ్‌

Advertisement