e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 16, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ సృజనాత్మకతకు ప్రాణం పోస్తే?

సృజనాత్మకతకు ప్రాణం పోస్తే?

సృజనాత్మకతకు ప్రాణం పోస్తే?

ఒక ఆలోచన లేదా కల్పన నుంచి రూపుదిద్దుకున్న ఒక ఉత్పత్తి లేదా వస్తువుని చూసి ఇది ఎంత బాగుందో కదా అని ఎప్పుడైనా అనుకున్నారా? దాన్ని సృష్టించిన వ్యక్తి సృజనాత్మకతకు అబ్బుర పోయారా? రామప్పకి వెళితే అక్కడి కట్టడాన్ని కట్టిన వాస్తుశిల్పి నైపుణ్యం కనిపిస్తుంది. అగ్గిపెట్టెలో పట్టే చీరను చూస్తే మన నేతన్న వాస్తవికత కనిపిస్తుంది. వార్తాపత్రికలో వచ్చిన ఒక ప్రకటనను చూస్తే, అవసరం ఉన్నా లేకపోయినా కావాలనిపిస్తుంది. ఒక సాధారణ వస్తువుకి సృజనాత్మకతను జోడించి ప్రాణం పోస్తే అది మనల్ని ఆకట్టుకోవాల్సిందేకదా. ఆర్కిటెక్ట్‌ లే కాకుండా డిజైన్‌ రంగంలో ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి.

ఉపాధి అవకాశాలు
డిజైనర్లు, దేశీయ రిటైల్‌, తయారీ సంస్థలు, బహుళజాతి రిటైల్‌ సంస్థలు మీడియా / అడ్వర్టైజింగ్‌ / పబ్లికేషన్‌ హౌసెస్‌, ఎన్జీఓలు, ఎగుమతి సంస్థలు, హౌసింగ్‌ రంగం, బిజినెస్‌ కన్సల్టెన్సీలు, స్టార్టప్స్‌ డిజైన్‌ గ్రాడ్యుయేట్స్‌కి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి.

ఫ్యాషన్‌ డిజైనర్‌
టెక్స్‌టైల్‌, అప్పారెల్‌: వస్త్రం మనిషి సాధారణ అవసరం. దేశంలో టెక్స్‌టైల్‌ వ్యాపారం ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. కాబట్టి మన ఎకానమీలో ఈ రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. టెక్స్‌టైల్‌, అప్పారెల్‌ ఇండస్ట్రీలో అవకాశాలు చాలా ఉన్నాయి. అరవింద్‌ మిల్స్‌, గో కలర్స్‌, ఫ్యాబ్‌ వరల్డ్‌రేమండ్‌, వర్ధమాన్‌ టెక్స్‌టైల్‌ వంటి ఎన్నో ప్రఖ్యాత కంపెనీల్లో డిజైనర్‌గా అవకాశం పొందవచ్చు. ఫ్యాషన్‌ డిజైన్‌, అప్పారెల్‌ డిజైన్‌, నిట్‌ వేర్‌ డిజైన్‌ వంటి కోర్సులు చేయవచ్చు.

యాక్సెసరీస్‌ డిజైనర్‌
బ్యాగ్స్‌, బెల్ట్‌, నగలు, ఫుట్‌వేర్‌, లగ్జరీ ఉత్పత్తులు, వెండి సామగ్రి, విలువైన లోహాన్ని ఉపయోగించి తయారుచేసే బహుమతి సామాను ఇంకా ఇతర వస్తువుల్లో కూడా ఫ్యాషన్‌ ఉంటుంది. పాదరక్షల తయారీ పట్ల ఆసక్తి ఉన్నవారు అడిడాస్‌, బాటా వంటి కంపెనీల్లో అవకాశాలు పొందవచ్చు. నైకా, రిలయన్స్‌ రిటైల్‌ వంటి ఫ్యాషన్‌ స్టోర్‌, స్వరోవ్‌స్కీ ఇతర ఆభరణాలు, రత్నాలు తయారుచేసే సంస్థల్లో కూడా అవకాశాలు పొందవచ్చు.

కమ్యూనికేషన్‌ డిజైనర్‌
యానిమేషన్‌, వీడియో గ్రాఫిక్స్‌, స్పెషల్‌ ఎఫెక్ట్స్‌తో డిగ్రీ ప్రోగ్రామ్‌లు గ్రాడ్యుయేట్లకు భారీ సంఖ్యలో కెరీర్‌ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వారు ప్రకటనలు, ప్రచురణ, వెబ్‌ డిజైన్‌ లేదా చలన చిత్ర పరిశ్రమలో పనిచేయవచ్చు. మల్టీమీడియా, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ), యూజర్‌ ఎక్స్‌పీరియన్స్‌ (యూఎక్స్‌), ఇన్ఫోగ్రాఫిక్స్‌లో అవకాశాలు ఉన్నాయి. రాయడంలో నైపుణ్యం కలవారు ఫ్యాషన్‌ జర్నలిస్ట్‌, కాపీ రైటర్‌, బ్లాగర్‌, కాలమిస్ట్‌, క్రిటిక్‌ (విమర్శకులు) వంటి అవకాశాలు ఉన్నాయి. ఫొటోగ్రఫీ లేదా వీడియోగ్రఫీలో కూడా మంచిగా భవిష్యత్తును మలుచుకోవచ్చు.

బ్రాండ్‌ డిజైనర్‌
ప్రతి ప్రొడక్ట్‌ తనకంటూ ఒక స్థానాన్ని, తన పట్ల ఒక నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. బ్రాండ్‌ వ్యాల్యూని పెంచడానికి, నిలబెట్టడానికి ఒక మంచి ప్రొడక్ట్‌కి బ్రాండ్‌ మేనేజర్ల అవసరం ఉంది. వీరు బ్రాండ్‌కి సంబంధించిన ప్రమోషన్‌, అడ్వర్టైజింగ్‌ సృజనాత్మకంగా రూపుదిద్దుతూ డిజిటల్‌ యాప్స్‌, వెబ్‌సైట్‌, డిజిటల్‌ క్యాంపెయిన్‌కి దోహదపడుతారు. గ్రాఫిక్‌ డిజైన్‌, గ్రాఫిక్‌ కమ్యూనికేషన్‌ డిజైన్‌, గ్రాఫిక్‌ బ్రాండింగ్‌, విజువల్‌ కమ్యూనికేషన్‌, బ్రాండ్‌ డిజైన్‌ వంటి కోర్సులు చేసిన వారికి ఇటువంటి అవకాశాలు రావచ్చు.

ఫ్యాషన్‌ టెక్నాలజీ అవకాశాలు
ఫ్యాషన్‌ టెక్నాలజీ చదివినవారికి కంప్యూటర్‌ ఎయిడెడ్‌ డిజైన్‌ (సీఏడీ), గార్మెంట్‌ నిర్మాణం, మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌, ప్రొడక్షన్‌ ప్లానింగ్‌, టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌, కంప్యూటర్‌ ఇంటిగ్రేటెడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌, రిటైల్‌ టెక్నాలజీ, వెబ్‌ బేస్డ్‌ డేటా మేనేజ్‌మెంట్‌, లాజిస్టిక్స్‌ వంటి విభాగాల్లో అవకాశాలు ఉన్నాయి.

ఇంటీరియర్‌ డిజైనర్‌
ఆధునిక, పట్టణంలో జనాభా పెరుగుతూ, స్మార్ట్‌ సిటీ అన్న కాన్సెప్ట్‌ మొదలయ్యాక ఇంటీరియర్‌ డిజైనర్లకు డిమాండ్‌ పెరిగింది. ఈ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఫర్నిచర్‌ డిజైన్‌, ఎగ్జిబిషన్‌ డిజైన్‌, కిచెన్‌ డిజైన్‌, ఆర్కిటెక్ట్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌. ఈ వృత్తిలో రాణించాలనుకునేవారికి కలర్‌, ఫ్యాబ్రిక్‌, మెటీరియల్‌ ఏస్థటిక్‌ సెన్స్‌ ఉండటం ఎంతో అవసరం. ఇంటీరియర్‌ డిజైన్‌, అర్బన్‌ ప్లానింగ్‌, ల్యాండ్‌స్కేప్‌ డిజైన్‌ వంటి కోర్సులు ఉన్నాయి.

ఇతర అవకాశాలు
బిజినెస్‌ అనలిటిక్స్‌, ఈ-కామర్స్‌, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్వెంటరీ కంట్రోల్‌, సేల్స్‌ మేనేజ్‌మెంట్‌, స్టోర్‌ నిర్వహణ వంటి అవకాశాలకు మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ అవసరం. డిజైన్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ పట్ల అభిరుచి ఉన్నవారికి వాస్తవికత, సృజనాత్మకత అవసరం. ప్రొడక్ట్‌ డిజైన్‌, ఇన్నోవేషన్‌ డిజైన్‌, డిజైన్‌ రిసెర్చ్‌ వంటి స్కిల్స్‌ అవసరం. బోధన పట్ల ఆసక్తి ఉన్నవారు అకడమిక్‌ వైపు కెరీర్‌ని మలుచుకోవచ్చు.
దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన కాలేజీల్లో బ్యాచిలర్‌ అఫ్‌ డిజైన్‌ కోర్సు చేసినవారికి సంవత్సరానికి సుమారు రూ.5 లక్షల నుంచి 50 లక్షల వరకు వేతనం ఉండవచ్చు. ఇది వారి సామర్థ్యం, జాతీయ లేదా అంతర్జాతీయ అవకాశాలను బట్టి కూడా ఉంటుంది.

డిజైన్‌ పరీక్షలు
దేశంలో డిజైన్‌ కోర్సు చదవాలనుకునేవారు రాసే పరీక్షల్లో ప్రముఖమైనవి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ అండ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ పరీక్షలు
నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ డిజైన్‌ (నిడ్‌)
నిడ్‌ (https://nid.edu/) 4 సంవత్సరాల బ్యాచిలర్‌ అఫ్‌ డిజైన్‌ ప్రోగ్రాం ఆఫర్‌ చేస్తుంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌ క్యాంపస్‌లు అహ్మదాబాద్‌ (125 సీట్లు), ఆంధ్రప్రదేశ్‌ (75 సీట్లు), హర్యానా (75 సీట్లు), మధ్యప్రదేశ్‌ (75 సీట్లు), అసోం (75 సీట్లు)లో ఉన్నాయి. సిరామిక్‌ & గ్లాస్‌ డిజైన్‌, ఫర్నిచర్‌ & ఇంటీరియర్‌ డిజైన్‌, ప్రొడక్ట్‌ డిజైన్‌, యానిమేషన్‌ ఫిల్మ్‌ డిజైన్‌, ఎగ్జిబిషన్‌ డిజైన్‌, ఫిల్మ్‌ & వీడియో కమ్యూనికేషన్‌, గ్రాఫిక్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌ వంటి కోర్సులు ఉన్నాయి.
ప్రవేశ పరీక్ష రెండు రౌండ్లలో జరుగుతుంది. రౌండ్‌ 1: డీఏటీ (డాట్‌) ప్రిలిమ్స్‌ అండ్‌ రౌండ్‌ 2: డీఏటీ (డాట్‌) మెయిన్స్‌. 12వ తరగతి ఉత్తీర్ణులైన సైన్స్‌, కామర్స్‌, హ్యుమానిటీస్‌, ఆర్ట్స్‌ వంటి ఏ స్ట్రీమ్‌కి చెందినవారైనా పరీక్షకు హాజరు కావచ్చు.
డీఏటీ (డాట్‌) ప్రిలిమ్స్‌ 100 మార్కులకు 3 గంటల్లో నిర్వహిస్తారు. ఇందులో ఆప్టిట్యూడ్‌ అండ్‌ క్రియేటివ్‌ డ్రాయింగ్‌ స్కిల్స్‌ని టెస్ట్‌ చేస్తారు. మెయిన్స్‌లో స్టూడియో టెస్ట్‌ అంటే ఇచ్చిన మెటీరియల్‌తో మోడల్‌ మేకింగ్‌ వంటి టెస్ట్‌ జరుగుతుంది.

నిఫ్ట్‌
నిఫ్ట్‌ (https://nift.ac.in/) క్యాంపస్‌లను మొదట 1995లో చెన్నై, గాంధీనగర్‌, కోల్‌కతా, హైదరాబాద్‌, ముంబై, 1997లో బెంగళూరులో ప్రారంభించారు. ఆ తర్వాత భోపాల్‌, భువనేశ్వర్‌, జోధ్‌పూర్‌, కాంగ్రా, కన్నూర్‌, పాట్నా, రాయ్‌బరేలి, షిల్లాంగ్‌లో ప్రారంభమయ్యాయి.
నిఫ్ట్‌లో బీడీఎస్‌ (ఫ్యాషన్‌ డిజైన్‌), బీడీఎస్‌ (లెదర్‌ డిజైన్‌), బీడీఎస్‌ (యాక్సెసరీస్‌ డిజైన్‌), బీడీఎస్‌ (టెక్ట్స్‌టైల్‌ డిజైన్‌), బీడీఎస్‌ (నిట్‌వేర్‌ డిజైన్‌), బీడీఎస్‌ (ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌), బీఎఫ్‌టెక్‌ (అప్పారెల్‌ ప్రొడక్షన్‌) వంటి యూజీ కోర్సులు ఉన్నాయి.
lబీడీఎస్‌ పరీక్ష ఏ స్ట్రీమ్‌వారైనా రాయవచ్చు. బీఎఫ్‌టెక్‌ 12వ తరగతిలో మ్యాథమెటిక్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ చదివినవారు రాయవచ్చు.
బీడీఎస్‌ ప్రవేశ పరీక్ష రెండు రౌండ్లలో జరుగుతుంది. మొదటి రౌండ్‌ 1లో క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌ (3 గంటలు), జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (2 గంటలు 100 ప్రశ్నలు) ఉంటుంది. రౌండ్‌ 2లో సిచ్యువేషన్‌ టెస్ట్‌ ఉంటుంది. ఇందులో మెటీరియల్‌ హ్యాండ్లింగ్‌, మోడల్‌ మేకింగ్‌ స్కిల్స్‌ని పరీక్షిస్తారు. బీఎఫ్‌టెక్‌కి జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ ఉంటుంది. ఇది 3 గంటల సమయంలో సుమారు 150 ప్రశ్నల పరీక్ష. నిఫ్ట్‌లో 3,556 వరకు సీట్లు కలవు.

పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి?
‘డ్రాయింగ్‌ అండ్‌ స్కెచింగ్‌’ సాధన చేయాలి. మొదట ఫ్రీ హ్యాండ్‌ మూవ్‌మెంట్‌ అలవాటు చేసుకోవాలి. జియోమెట్రిక్‌ ఆకారాలతో మొదలుపెట్టి, ఆ తర్వాత చూసిన వస్తువులు, పరిసరాలను లేదా మీ జ్ఞాపకాల నుంచి బొమ్మలు వేయడం సాధన చేయాలి. ఒక వస్తువు లేదా గది ఏ కోణంలో చూస్తే ఎలా కనిపిస్తుందన్నది ఊహించగలగాలి.

కలర్‌ల పట్ల అవగాహన ఉండాలి
ఆయిల్‌ పేస్టల్స్‌, పోస్టర్‌ కలర్స్‌, వాటర్‌ కలర్స్‌ ఉపయోగిస్తూ ఏ రంగులు కలిపితే మీకు కావలసిన రంగు వస్తుందన్నది నేర్చుకోవాలి. కలర్‌ వీల్‌ పట్ల అవగాహన ఉండాలి. లైటింగ్‌ ఎఫెక్ట్‌, టోన్‌ అండ్‌ షేడ్స్‌ మీరు వేసే బొమ్మల్లో కనిపించాలి.

జనరల్‌ ఎబిలిటీ, ఆప్టిట్యూడ్‌
ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కోసం ప్యాసేజ్‌ రీడింగ్‌, గ్రామర్‌, ఆంగ్ల పదజాలానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు రాయగలగాలి. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ కోసం బేసిక్‌ మ్యాథమెటిక్స్‌ ప్రశ్నలు, అనలిటికల్‌ స్కిల్స్‌ కోసం రీజనింగ్‌ ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాలి. జనరల్‌ నాలెడ్జ్‌ కోసం వార్తాపత్రికలు చదవాలి. కరెంట్‌ అఫైర్స్‌, స్టాటిక్‌ జీకేతో పాటు ఫ్యాషన్‌ వరల్డ్‌ కంపెనీ బ్రాండ్‌ అండ్‌ లోగోస్‌ విషయాల గురించి సమాచారం తెలుసుకుని ఉండాలి. మాక్‌ ఎగ్జామ్స్‌ రాసి టైం మేనేజ్‌మెంట్‌ నేర్చుకోవాలి.
‘వివిధ వస్తువులతో క్రాఫ్ట్‌ వర్క్‌, పెయింటింగ్‌ వంటివి చేస్తే సిచ్యువేషన్‌ టెస్ట్‌ లేదా పోర్ట్‌ఫోలియో రౌండ్‌కు ఉపయోగపడుతుంది.

Sirisha Reddy
Director – Academics
Gyanville Academy
+91 76759 62248
www.gyanville.in
IITJEE | CLAT | IIM IPM

Advertisement
సృజనాత్మకతకు ప్రాణం పోస్తే?
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement