న్యూఢిల్లీ: వైద్యవిద్యలో పారదర్శకత, జవాబుదారీతనం, ఏకరూపతను తీసుకురావడం కోసం దేశంలో మెడికల్ ఎడ్యుకేషన్, మెడికల్ ప్రొఫెషనల్స్‌ను నియంత్రించే నేషనల్ మెడికల్ కమిషన్.. నెక్స్ట్ (NEXT) పరీక్ష నిర్వహించడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. MBBS గ్రాడ్యుయేట్లు, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్లు (FMG)లకు ఈ పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నది. MBBS పూర్తిచేసిన విద్యార్థులు సంబంధిత మెడికల్ కౌన్సిల్స్ నుంచి ప్రాక్టిస్ లైసెన్స్ పొందడానికి నమోదు చేసుకునే ముందు ప్రాక్టికల్ ఇంటర్న్‌షిప్, థియరిటికల్ నాలెడ్జ్‌ను పరిశీలించడానికి ఈ నెక్స్ట్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ పరీక్ష నిర్వహణ సీరియస్‌గా వైద్య విద్యను అభ్యసించిన, అర్హత కలిగిన వైద్యులు మాత్రమే ప్రాక్టీస్ చేసే అవకాశం కల్పిస్తుంది. దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఈ అవకాశం లేదు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత ప్రభుత్వం దీనిని ఆమోదించిన తర్వాత 2023 విద్యా సంవత్సరం నుంచి కొత్త నిబంధనను అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సవివరమైన అధ్యయనం జరిగిందని, అందుకు సంబంధించిన సమాచారాన్ని మంత్రిత్వ శాఖకు అందించామని మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్‌కు చెందిన 1980 MBBS బ్యాచ్ పూర్వ విద్యార్థి డాక్టర్ అరుణ వాణికర్ చెప్పారు.
డాక్టర్ అరుణ ఆమె ముగ్గురు సహచరులైన డాక్టర్ విజయేంద్ర కుమార్, డాక్టర్ M మింట్జ్, డాక్టర్ D చక్రవర్తిలతో కలిసి తమ పరిశోధనా పత్రాన్ని సిద్ధం చేశారు. నేషనల్ మెడికల్ జర్నల్‌లో ‘మెడిసిన్ అండ్ సొసైటీ’ అనే పేరుతో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ స్టడీస్ ఈ పరిశోధనా పత్రాన్ని ప్రచురించింది. డాక్టర్ అరుణ మాట్లాడుతూ.. “భారతదేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయాలనుకునే భారతీయ, విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లకు (FMG) నెక్స్ట్ పరీక్ష తప్పనిసరి. వారి ప్రాక్టికల్ నైపుణ్యాలను పరీక్షించేలా ఈ పరీక్ష ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈ పారదర్శకత ఇప్పుడు అమల్లో లేదు. నెక్స్ట్ పరీక్ష వైద్య విద్యకు సంబంధించినంత వరకు దేశవ్యాప్తంగా ఏకరూపతను తీసుకువస్తుంది” అన్నారు.