MBBS, BDS Counselling | హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : వైద్య విద్యలో స్థానికతపై సుప్రీంకోర్టు తీర్పుతో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు అడ్డంకులు తొలగిపోగా.. జీవో నంబర్ 33ని సవరిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ ఆదేశాలతో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభించింది. అభ్యర్థులు మంగళవారం నుంచి 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 15 నుంచి రాష్ట్ర కోటా కింద కౌన్సెలింగ్ ప్రారంభించనున్నట్టు పేర్కొన్నది. రాష్ట్రంలో 61 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో 8,430 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా, ఒక ప్రభు త్వ, 11 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,140 సీట్లు ఉన్నాయి. 4 క్యాటగిరీలకు చెందిన విద్యార్థులు రాష్ట్రంలో చదవకపోయినా ప్రవేశాలకు అర్హత కల్పిస్తూ కాళోజీ హెల్త్ వర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రం వెలుపల నివసిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల విద్యార్థులకు, రాష్ట్రం వెలుపల నివసిస్తున్న తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆల్ ఇండియా సర్వీస్(ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్) కుటుంబాల విద్యార్థులు అర్హులు. డిఫెన్స్, ఎక్స్ సర్వీస్‌మెన్, ఆర్మ్డ్ పోలీసు ఫోర్స్ సర్వీసుల్లో పని చేస్తున్న సిబ్బంది పిల్లలు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కార్పొరేషన్లు, ఏజెన్సీలు, సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది పిల్లల అడ్మిషన్లకు మినహాయింపులు కల్పిస్తూ వర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. వివరాలకు www.knruhs. telangana.gov.in వెబ్సైట్ సందర్శించాలని సూచించింది.