e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022

యువతా మేలుకో..

‘నెవర్‌ గివ్‌ అప్‌ ఆన్‌ సమ్‌థింగ్‌,విచ్‌ యూ స్ట్రాంగ్‌లీ బిలీవ్‌ ఇన్‌’. ఏదైతే మనం బలంగా నమ్ముతున్నామో, కావాలని గట్టిగా కోరుకున్నామో, ఒక లక్ష్యం పెట్టుకున్నామో దాన్ని సాధించేంత వరకు వదలకూడదు అని అర్థం.

మన జీవితంలో అనేక సందర్భాల్లో గెలుపు, ఓటములను ప్రామాణికంగా తీసుకుంటాం. జీవితంలో గెలుపు, ఓటములు సాధారణమే. కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా పనిచేయడం, పోరాడటం ఆపకూడదు. అప్పుడు గెలుపు, ఓటములతో మన జీవితంలో ప్రమేయం ఉండదు. ప్రతి రోజూ, ప్రతి క్షణం పనిచేయడం, చివరి నిమిషం వరకూ పోరాటం, ఇదే మన జీవితమని బతికితే జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే తట్టుకుని లక్ష్యాన్ని సాధించగలం.ఉదాహరణకు ఒక వ్యక్తి సివిల్స్‌ కోసం ప్రిపేరయ్యాడు. కానీ సివిల్స్‌లో సక్సెస్‌ కాలేదు. జీవితంలో అంతకంటే గొప్ప అంశాల్లో సివిల్‌ ప్రిపరేషన్‌ పనికివచ్చి ఇంకా గొప్పవాళ్లయిన సందర్భాలు ఉన్నాయి. స్నేహితులు కాని, విద్యార్థులు కాని కొన్నిసార్లు సివిల్స్‌ మెయిన్స్‌లోనో, ఇంటర్వ్యూలోనో రెండు, మూడుసార్లు ప్రయత్నించి విజయం పొందనప్పుడు వాళ్లు జీవితాన్ని అక్కడే వదిలిపెట్టలేదు. ఆ సివిల్స్‌ ప్రిపరేషన్‌, దాని సంకల్పం జీవితంలో ఇంకో పెద్ద లక్ష్యం పెట్టుకుని దాన్ని సాధించారు. గొప్ప గొప్ప అగ్రికల్చర్‌ శాస్త్రవేత్తలయ్యారు.

- Advertisement -

గొప్ప గొప్ప పారిశ్రామిక వేత్తలయ్యారు అంటే మనం ఒక లక్ష్యం పెట్టుకుని ప్రారంభించినప్పుడు కొన్నిసార్లు ఆ లక్ష్యం దగ్గరే ఆగిపోకుండా తరువాత స్థాయికి వెళ్లి అక్కడ నిలబడగలమని గుర్తుంచుకోండి.చిన్న లక్ష్యమయినా ప్రపంచంలో అందరికంటే మీరు ఎంత కష్టపడగలరో, ఏ మానవుడైనా గరిష్టంగా ఎంత కష్టపడగలడో అంత కష్టపడటం నేర్చుకోండి. ఆటోమేటిక్‌గా విజయం మన చుట్టూ తిరుగుతుంటుంది. ఒకవేళ కొన్నిటిలో విజయం మనకు వరించలేదా దాని అర్థం ఇంకా పెద్ద విజయం ఇంకొక రంగంలో దాగి ఉందని. అంతేకాని చిన్న చిన్న విషయాల్లో విఫలమయిపోయాం అని చెప్పి, చిన్న చిన్న లక్ష్యాలు మనం చేరుకోలేదు కాబట్టి ఆ దిగులుతో, నిరాశతో ఇప్పుడున్న విలువైన సమయం వృథా చేసుకోకూడదు.

నిబిడీకృతమైన శక్తి
జీవితమనేది రంగులతో నిండి ఉంటుంది. ప్రతి రంగులో ఒక కొత్త దనం ఉంటుంది. ప్రతిదాన్నీ అన్వేషించడానికి ప్రయత్నించండి. జీవితం ఆహ్లాదంగా, ఉత్సాహంగా, ప్రతి రంగంలో మన ముద్రవేసుకునేలాగా ప్రయత్నించండి. అప్పుడు జీవితకాల సాఫల్యమనేది వస్తుంది.
ప్రతి మనిషిలో నిరంతరమైన శక్తి దాగి ఉంది. అందరిలో ఒకటే శక్తి ఉన్నప్పుడు అతికొద్దిమంది మాత్రం ఎందుకు విజయం పొందుతారు. అతికొద్దిమంది మాత్రమే జీవితంలో చాలా పైస్థాయికి ఎదుగుతారు. ఆ కొద్దిమందిలో మనముండాలి. రహస్యం ఏమిటంటే మనిషిలో ఉన్న శక్తి సహజంగా ఏ మనిషి అయినా తన కోసం తను వాడుకుని, తను ఆ సమయంలో పైకి వస్తే ఆ మనిషి గొప్పవాడవుతాడు. అదే శక్తి నిర్వీర్యం చేసుకుని ఏదో ఆలోచిస్తూ ఎవరిపైనో మనం శక్తులు పెడితే మొత్తం విఫలమవుతాం.ఆ శక్తిని వృథాగా అన్నిరకాల విషయాలకు వాడి కొంతమాత్రమే మనకోసం వాడితే జీవితంలో అంతగా విజయం సాధించలేం. 100 శాతం శక్తినంతా మనకోసమే వాడుకుంటే విజయం సాధించవచ్చు. అలాంటివారే విజేతలవుతారు.

సహనం, పట్టుదల, కఠోర శ్రమ విజయానికి సోపానాలు
సక్సెస్‌ కావాలంటే మనిషికి చాలా లక్షణాలు ఉండాలి. దానిలో ముఖ్యమైనది సహనం. సహనం, పట్టుదలతో కొండల్ని ఎక్కవచ్చు, పిండి చేయవచ్చు. సముద్రాల్ని ఈదవచ్చు. ఎంతవరకు ఓపిక ఉండాలి. అంటే జీవితకాలం ఒక పనిమీద కృషి చేసేంతవరకు.సహనం, మొక్కవోని పట్టుదల, అంతకుమించి కఠోర శ్రమ, ఈ మూడు కనుక ఏ మనిషిలోనైనా ఉంటే అనుకున్నది సాధించి తీరుతాడు. ఈ ప్రపంచంలో సాధించలేనిది ఏదీ ఉండదు. శ్రమించండి. ఆ శ్రమలోనే సాధన ఉంటుంది. ఆటోమేటిక్‌గా విజయం వరిస్తుంది. చాలామంది చాలా కష్టపడుతున్నాం, అనుకున్నదంతా చేస్తున్నాం. కానీ విజయం చేకూరట్లేదని అంటున్నారు. ఇలా అనేవాళ్లు ఒక్కసారి వాళ్ల మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. కావలసినంత ఓర్పు, ఓపికతో ఉన్నామా? సహనంతో ముందుకు వెళుతున్నామా? కఠోరంగా శ్రమిస్తున్నామా? మానసికంగా స్థిరంగా, చిత్తశుద్ధి ఉందా? ఎంతకాలం నుంచి అలా ఒకటే రకంగా కష్టపడుతున్నాం? ఒకటే లక్ష్యంతో కష్టపడుతున్నామా? ఒకటే ప్రాధాన్యతను పెట్టుకుని కష్టపడుతున్నామా అని ఆలోచించండి.

దీనికి సమాధానంగా 100 శాతం ఇస్తున్నాను. రెండు, మూడు సంవత్సరాలు ఒకటే అంశం మీద కష్టపడ్డామంటే కచ్చితంగా విజయం వరిస్తుంది. కాకపోతే దీనికి ప్రధాన శత్రువు మనమే. మన ఓర్పు నశించడానికి, ఓపిక పోవడానికి, శ్రమ చేయలేకపోవడానికి కారణాలేమిటి? దానికి అనేక కారణాలు ఉన్నాయి, దానికి అనేక శత్రువులు మనలో ఉన్నాయి. ఆ శత్రువుని మనం జయించాలి.

అంతర్గత శతృవులు
ఒకటి బద్ధకం, రెండోది వాయిదా, మూడవది అపనమ్మకం, నాల్గవది చుట్టుపక్కల వాళ్ల మాటలు వినడం, అయిదవది మానసిక బలహీనతలు. ఇవన్నీ లేకుండా ఉంటే ఒక మనిషి దేవుడంత గొప్పవాడవుతాడు. అలా అవడానికి మనలో అన్ని లక్షణాలు ఉన్నాయి. అంత శక్తి మనలో ఉంది. ఈ అయిదు మనలో మనల్ని తినేసే బలహీనతలు. కానీ ఈ అయిదు లక్షణాలు, ఈ అయిదు శత్రువుల్ని జయిస్తే అనుకున్నది ప్రతిదీ సాధిస్తాం. ఈ అయిదు జయించినవాడు ప్రపంచంలో ఎంతో గొప్పవాడవుతాడు.

ఈ రోజుని జాగ్రత్తగా వాడుకోండి
సాధారణంగా గడిచిపోయిన రోజులు, గడిచిపోయిన స్మృతులను తలుచుకుని ప్రస్తుతం అదే ఆలోచిస్తూ ఉంటాం. కొన్నిసార్లు భవిష్యత్‌ అంటే భయపడి ప్రస్తుతాన్ని పాడుచేసుకుంటాం. గతమనేది మన చేతుల్లో లేదు. భవిష్యత్‌ బాగుండాలంటే ఈ రోజు మన ప్రయత్నం వంద శాతం పెట్టాలి. ఎక్కువగా మనం గతాన్ని, భవిష్యత్‌ని తలుచుకుంటూ వర్తమానాన్ని పాడుచేసుకుంటాం. మనిషి జీవితంలో ప్రస్తుతం జరిగే కొన్ని క్షణాలు ముఖ్యం. ప్రస్తుతంలో ఇప్పుడున్న వర్తమానంలో మనం ఏం చేస్తున్నాం? ఏం సాధిస్తున్నాం? ఎంతబాగా ఉపయోగించుకుంటున్నాం? ఆ రోజుని ఎంత సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నాం? అనేవి చాలా ముఖ్యం. కాబట్టి గతాన్ని వదిలేయండి. ప్రస్తుతంపై దృష్టి సారించండి.

త్వరలో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు రాబోతున్నాయి. కాబట్టి ప్రతి విద్యార్థి, ఉద్యోగార్థి తాము నిర్ణయించుకున్న ఉద్యోగానికి సంబంధించిన విషయాలపట్ల సమగ్ర అవగాహన చేసుకొని, ఆ సంబంధిత సిలబస్‌కు అనుగుణంగా పుస్తకాలను ఏర్పాటు చేసుకొని సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి.అవకాశం వచ్చినప్పుడే దానిని అందిపుచ్చుకోవాలి. దానికోసం కఠోర శ్రమని అలవర్చుకుని అకుంఠిత దీక్షతో లక్ష్య సాధనకు సంసిద్ధం కావాలి. ఏ ఒక్క రోజుకూడా నీరుగారకుండా ప్రతి రోజూ జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుని సరైన అభ్యాసం చేసుకుని వెళితే వాళ్లకు విజయం చేకూరుతుంది. దానికి ముందడుగు ఏమిటంటే నిత్యకృత్యంగా ఒకటే రకమైన దినచర్య, నిత్యకృత్యంగా ఒకటే జీవనశైలి, పోటీ పరీక్షల్లో ముందుకు వెళ్లేటప్పుడు ఒక్కోసారి బోర్‌ కొడుతుంది. మరోసారి చిరాకువేస్తుంది. ఇంకోసారి ఎందుకువచ్చిన తలనొప్పి అని అనిపిస్తుంది. ఏది ఎలా ఉన్నా లక్ష్యంపట్ల దృష్టిపెట్టి ముందుకు వెళితే ఎంత బోర్‌ కొట్టినా, ఎంత ఉదాసీనంగా ఉన్నా, ఎంత నీరసం వచ్చినా విజయం సాధించవచ్చు.

-మల్లవరపు బాలలత
సివిల్స్‌ ఫ్యాకల్టీ ,హైదరాబాద్‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement