హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగాఉన్న పీజీ సీట్ల భర్తీకి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ (CPGET) నిర్వహించనున్నారు. దీనిద్వారా వర్సిటీ క్యాంపస్, కాన్స్టిట్యూయెంట్, వర్సిటీ డిస్ట్రిక్ట్ పీజీ కళాశాలల్లో ఖాళీ పీజీ సీట్లను భర్తీ చేయనున్నారు. దీనికోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ప్రారంభమవుతుంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు 9వ తేదీ నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఈ నెల 12న వెబ్ ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపు జాబితాను ఈ నెల 14న విడుదల చేస్తామన్నారు. వివరాలకు www.ouadmissions. com, www.osmania. ac.in వెబ్సైట్లలో చూడాలని సూచించారు.
వివిధ కారణాల వల్ల గతంలో కౌన్సెలింగ్‌కు హాజరుకాలేకపోయిన విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. 2022లో రాష్ట్ర వ్యాప్తంగా పీజీ కోర్సులకు సంబంధించిన 52 వేల సీట్లు అందుబాటులో ఉండగా.. ఇప్ప టివరకు మూడు దశల్లో కౌన్సెలింగ్ చేపట్టారు. అయితే అందులో 24 వేలమంది ప్రవేశాలు పొందగా.. ఇంకా 28 వేల సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఆర్ట్స్ గ్రూపుల్లోనే ఎక్కువ సీట్లు ఉన్నాయి.
అయితే, డిగ్రీ కోర్సులు చేసిన కొంతమందికి బ్యాక్‌లాగ్స్ ఉండటంతో వీటిని ఇటీవల జరిగిన పరీక్షల్లో పూర్తిచేశారు. కానీ ఫలితాలు వచ్చే నాటికి పీజీ కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి చివరిదశ కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.